కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట కూడా రైద్దెంది. ఆదివారం వర్షం లేకపోయినా ఉదయం నుంచి ఎండ బాగానే కాసినా మైదానం చిత్తడిగా ఉండటంతో ఆట సాధ్యం కాలేదు. దీంతో వరుసగా రెండు రోజులూ ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దవడం గమనార్హం. తొలి రోజు 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవగా రెండు రోజుల పాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన వరుణుడు మూడో రోజు కాస్త తెరిపినిచ్చినా ఔట్ ఫీల్డ్ అనువుగా లేకపోవడంతో మ్యాచ్ సాగలేదు. వర్షం లేకపోవడంతో మ్యాచ్‌ను ఆస్వాదిద్దామని భావించి స్టేడియానికి పోటెత్తిన కాన్పూర్ వాసులకు నిరాశ తప్పలేదు.
ఉదయం 9 గంటలకు ఒకసారి 10 గంటలకు మరోసారి మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్‌ను నిర్వహించడం కష్టమని ప్రకటించారు. గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని ఆరబెట్టేందుకు కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ పరిశీలనకు వచ్చిన మ్యాచ్ నిర్వాహకులు మైదానం అలాగే ఉండటంతో మూడో రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే భారత్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల మీద ప్రభావం పడే అవకాశముంది.
కాన్పూర్: వరుణుడు తెరిపినిచ్చాడు.. రోజంతా ఎండ కాచింది.. స్టేడియాన్ని కప్పి ఉంచే కవర్లూ కనిపించలేదు.. అయినా కాన్పూర్ టెస్టులో మూడోరోజు మాత్రం ఒక్క బంతీ పడలేదు. ఆట ఎప్పుడు మొదలవుతుందా? తమ అభిమాన క్రికెటర్లను ఎప్పుడెప్పుడు చూస్తామా? అని వందలాది కిలోమీటర్లు ప్రయాణించి కాన్పూర్‌కు చేరిన ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు. దీనికి ప్రధాన కారణం ‘గ్రీన్‌పార్క్’లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండో టెస్టు రెండో రోజు వర్షం కురిసినా ఆదివారం రాత్రి నుంచి అక్కడ వరుణుడు శాంతించి రోజంతా సాధారణ ఊష్ణోగ్రతలే నమోదయ్యాయి. కానీ మూడుసార్లు మైదానాన్ని పరిశీలించిన మ్యాచ్ నిర్వాహకులు ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆట సాగదని తేల్చేశారు.
మైదానంలోని థర్టీ యార్డ్ సర్కిల్‌తో పాటు డీప్ మిడ్‌వికెట్ వద్ద లోపలి భాగం తడిగా ఉన్నట్టు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రౌ అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై పిచ్ క్యూరేటర్ శివ్ కుమార్ మాత్రం మరో విధంగా స్పందించాడు. ‘వాళ్లు (పరిశీలనకు వచ్చినవారు) మూడుసార్లు మైదానాన్ని పరిశీలించారు కానీ అసలు సమస్య ఏంటో మాకు చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పుంటే మేం అందుకు తగ్గ చర్యలు తీసుకునేవాళ్లం. మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి అని కూడా చెప్పాను’ అని తెలిపాడు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కాన్పూర్ ఇక టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. యూపీ రాజధాని లక్నోలోని ఏకనా స్టేడియంలో అధునాతన వసతులు కలిగి ఉండటంతో ఇకనుంచి గ్రీన్ పార్క్‌కు ఆతిథ్య హక్కులు దక్కడం కష్టమేనని తెలుస్తోంది.
ముంబై: ప్రపంచ క్రికెట్‌ను కనుసైగతో శాసించగల బీసీసీఐ అత్యంత సంపన్న బోర్డులలో ఒకటి. ఐపీఎల్ పుణ్యమా అని వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న బీసీసీఐ.. మైదానాల్లో కనీస వసతులు కల్పించడంలో దారుణంగా విఫలమవుతోంది. 2023 ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ప్రపంచంలోనే అత్యధిక సీటింగ్ సామర్థ్యం కలిగిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మైదానాన్ని డస్టర్లు, ఫ్యాన్లతో ఆరబెట్టడం విమర్శలకు తావిచ్చింది. ఇటీవలే అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య నోయిడా వేదికగా అర్ధాంతరంగా ముగిసిన ఏకైక టెస్టులోనూ ఇదే కథ.
అఫ్గాన్ క్రికెట్ బోర్డు కోరడంతో నోయిడాలో మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ అంగీకారం తెలిపింది. అక్కడా వర్షం లేకున్నా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో ఐదు రోజుల్లో కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దవడంతో సోషల్ మీడియాలో బీసీసీఐపై ట్రోలింగ్ వెల్లువెత్తింది. తాజాగా కాన్పూర్‌లోనూ ఇదే పునరావృతమవుతుండటంతో బీసీసీఐ క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురవుతోంది. కోటానుకోట్ల రూపాయలు ఆర్జిస్తున్న బోర్డు.. స్టేడియాలలో కనీసం మ్యాచ్ నిర్వహణకు అవసరమయ్యే వసతులనూ సమకూర్చడం లేదని అభిమానులు వాపోతున్నారు.