విశాఖపట్నం: ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మెగాటోర్నీలో సెమీఫైనల్ చేరాలంటే ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో టీమ్ఇండియా..ఆదివారం ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. స్పిన్‌కు సహకరించే ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో తిరిగి గెలుపు బాట పట్టాలని టీమ్ఇండియా చూస్తున్నది. దక్షిణాఫ్రికాతో గత మ్యాచ్‌ను చేజేతులా వదులుకున్న హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్సీలోని టీమ్ఇండియా..ఆసీస్‌పై సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటాలని చూస్తున్నది. సఫారీలతో గెలిచే మ్యాచ్‌ను వదిలిపెట్టుకున్న భారత్ తిరిగి అలాంటి తప్పులు పునరావృతం చేయవద్దన్న పట్టుదలతో ఉంది. ముఖ్యంగా ఆరో బౌలర్ లేమి టీమ్ఇండియాను కలవరపెడుతున్నది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఇది స్పష్టంగా కనిపించింది.
క్రాంతిగౌడ్, అమన్జ్యోత్కౌర్ రెగ్యులర్ పేసర్లుగా వ్యవహరిస్తుండగా, దీప్తిశర్మ, స్నేహ్‌రానా, శ్రీచరణి స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు. పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా కౌర్ వ్యవహరించినా అంతగా లాభం లేకపోయింది. దీంతో అన్నింటా బలమైన ఆసీస్‌ను ఎదుర్కొవాలంటే ఆరో బౌలర్ తప్పనిసరి అని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. ఇదే జరిగితే అప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే టాపార్డర్ వైఫల్యం టీమ్ఇండియాను ఇబ్బంది పెడుతున్నది.
మెగాటోర్నీకి ముందు సూపర్‌ఫామ్ మీదున్న మందన గత మూడు మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేకపోయింది.రోడ్రిగ్స్ వరుస గోల్డెన్ డక్ల పరంపర కొనసాగుతున్నది. ప్రతీకా రావల్, మందన, రోడ్రిగ్స్, హర్లిన్ డియోల్, కౌర్ రాణిస్తేనే ఆసీస్‌ను ఓడించే అవకాశముంటుంది. ఒకవేళ మార్పులు చేయాలనుకుంటే రాధా యాదవ్ లేదా అరుంధతిరెడ్డిని జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది. ఏడు సార్లు ప్రపంచకప్‌ను ముద్దాడిన కంగారూలు తమ జైత్రయాత్ర కొనసాగించేందుకు తహతహలాడుతున్నారు. కెప్టెన్ హిలీ, గార్డ్నర్, మూనీ, పెర్రీ రాణిస్తే ఆసీస్‌కు తిరుగుండదు.