పెర్త్: సుదీర్ఘ కెరీర్లో భారత క్రికెట్ జట్టుకు వందలాది మ్యాచ్‌లు ఆడిన లెజెండరీ బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. సుమారు ఏడు నెలల విరామానికి తెరదించుతూ కోట్లాది అభిమానులను మళ్లీ తమ ఆటతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి ఆస్ట్రేలియాతో మొదలుకాబోయే వన్డే సిరీస్‌తో ఈ ద్వయం బరిలోకి దిగుతున్న నేపథ్యంలో అందరి కండ్లూ ‘రోకో’మీదే నిలిచాయి. ఈ ఏడాది మార్చిలో ముగిసిన చాంపియన్స్ ట్రోఫీలో గెలిచిన తర్వాత నీలి రంగు జెర్సీల్లో ఆడనుడటం ఈ స్టార్ బ్యాటర్లకు ఇదే మొదటిసారి. వన్డేల్లో సారథ్య పగ్గాలు చేపట్టిన శుభ్‌మన్ గిల్‌కూ ఈ ఫార్మాట్లో ఆస్ట్రేలియా సిరీస్‌తోనే తొలి పరీక్ష ఎదురుకానుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య నేడు పెర్త్ వేదికగా తొలి పోరు జరుగనుంది.
నిరుడు టీ20లు, ఈ ఏడాది టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగాలని నిశ్చయించుకున్న రోకో.. ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తుండటంతో అందరి కండ్లూ వాళ్లమీదే కేంద్రీకృతమయ్యాయి. ఒకరి సారథ్యంలో ఒకరు కాకుండా మరో కెప్టెన్ నేతృత్వంలో ఆడనుండటం ఈ ఇద్దరికీ తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలిసారి. 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటమే లక్ష్యంగా ఉన్న ఈ ఇద్దరూ అందుకు సిద్ధంగా ఉన్నామని సెలక్టర్లను మెప్పించాలంటే ఇకనుంచి ఆడబోయే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. ఈ నేపథ్యంలో దిగ్గజ బ్యాటింగ్ ద్వయం కూడా ఆసీస్ సిరీస్ కోసం కఠిన సాధన చేసింది. ముఖ్యంగా రోహిత్ అయితే మూడు నెలల వ్యవధిలో సుమారు 12 కిలోల బరువు తగ్గి తన మిత్రుడు అభిషేక్ నాయర్ మార్గదర్శకత్వంలో పూర్తి ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఇక ఢిల్లీ నుంచి లండన్‌కు మకాం మార్చిన కోహ్లీ సైతం అక్కడే ఓ ప్రైవేట్ ట్రైనర్ దగ్గర సాధన చేశాడు. కాగా ఈ ఇద్దరికీ ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన కావొచ్చన్న విశ్లేషణల నేపథ్యంలోనూ అభిమానులు భారీ స్థాయిలో వీరి ఆటను చూసేందుకు వచ్చే అవకాశముంది.
రోహిత్ వైదొలగడంతో టెస్టులో తన స్థానాన్ని భర్తీచేసిన గిల్.. ఇంగ్లండ్ పర్యటనలో అంచనాలకు మించి రాణించాడు. టెస్టుల్లో బ్యాటర్‌గానే గాక సారథిగానూ తనదైన ముద్ర వేస్తున్న గిల్ వన్డేల్లో హిట్‌మ్యాన్ మ్యాజిక్‌ను ఎలా భర్తీచేస్తాడనేది ఆసక్తికరం. ఎందుకంటే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మరే సారథికి (భారత్ నుంచి) లేని విధంగా రోహిత్ 75శాతం విజయాలతో ఓ బెంచ్‌మార్కును సెట్ చేశాడు. ఆ అంచనాలను అందుకుని సెలక్టర్లను, అభిమానులను మెప్పించాలంటే గిల్‌కు శక్తికి మించిన పనే.
వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా తమ తర్వాతి తరం ఆటగాళ్లను పరీక్షించుకునేందుకు ఈ సిరీస్‌ను ఒక అవకాశంగా భావిస్తున్నది. ఇటీవలే సౌతాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లో ఓటమిపాలైన ఆ జట్టుకు కమిన్స్, గ్రీన్, జంపా వంటి స్టార్ ప్లేయర్లు లేకపోవడం ఇబ్బందే. మాథ్యూ రెన్షా, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్పీ, కున్హెమన్ వంటి ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కొచ్చు. ఫస్ట్ చాయిస్ ప్లేయర్లలో పలువురు గైర్హాజరీలో ఉన్నా హెడ్, కెప్టెన్ మార్ష్, స్టార్క్, హాజిల్‌వుడ్ వంటి అనుభవజ్ఞులతో ఆ జట్టు పటిష్టంగానే ఉంది.