దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దాయాది పాకిస్థాన్‌ను భారత్ దాటేసింది. బుధవారం విడుదల అయిన తాజా ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా 108 పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారీ విజయం సాధించిన భారత్.. మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుని నాలుగో ర్యాంక్ నుంచి మూడో ర్యాంక్‌లో నిలిచింది. న్యూజిలాండ్(127) నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా, ఇంగ్లండ్(122) రెండో ర్యాంక్‌లో ఉంది. పాకిస్థాన్ 106 పాయింట్లతో ప్రస్తుతం నాలుగో ర్యాంక్‌కు పడిపోయింది.
టీమ్ఇండియా స్టార్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా వన్డేల్లో తిరిగి నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 718 పాయింట్లతో బుమ్రా టాప్‌లోకి దూసుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆరు వికెట్లతో కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ ముంబైకర్..కివీస్ పేసర్ బౌల్ట్(712)ను దాటేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో కపిల్‌దేవ్ తర్వాత అగ్రస్థానంలో నిలిచిన భారత పేసర్‌గా బుమ్రా రికార్డుల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మరోవైపు షమీ(579) నాలుగు ర్యాంక్‌లు మెరుగుపర్చుకుని 23వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే..కోహ్లీ(803), రోహిత్‌శర్మ(802) పాయింట్ తేడాతో వరుసగా మూడు, నాలుగు ర్యాంక్‌ల్లో ఉన్నారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(892) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు.