రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి దిగ్గజాలు పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై పలకగా ప్రపంచకప్ గెలిచిన సీనియర్ జట్టు సభ్యుల గైర్హాజరీలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ‘యువ భారత్’కు శనివారం నుంచి ‘తొలి పరీక్ష’ ఎదురుకానుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ‘జనరేషన్ జెడ్ కిడ్స్’కు భావి భారత స్టార్లుగా ఎదగడానికి ఇదే సువర్ణావకాశం. 2026 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సీనియర్ల స్థానాలను భర్తీ చేసే పనిలో ఉన్న బీసీసీఐని కుర్రాళ్లు ఏ మేరకు మెప్పిస్తారనేది ఆసక్తికరం.
Team India | హరారే: టీ20 ప్రపంచకప్ గెలిచిన మధుర క్షణాలు, అభిమాన జనసంద్రాన్ని తలపించిన విజయయాత్ర తాలూకు ఉత్సాహం ఇంకా కండ్ల ముందు మెదులుతుండగానే భారత క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో ద్వైపాక్షిక సిరీస్ సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు జింబాబ్వే వెళ్లిన యువ భారత్‌కు శనివారమే తొలి పరీక్ష ఎదురుకానుంది. ఐపీఎల్లో అదరగొట్టిన కుర్రాళ్లతో పాటు ఇది వరకే భారత జట్టుకు అడపాదడపా ఆడిన పలువురు నవతరం క్రికెటర్లు సత్తా చాటేందుకు ఇది సదావకాశం. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగనున్న భారత్.. ఈ సిరీస్‌తోనే తదుపరి పొట్టి ప్రపంచకప్ సన్నాహకాలనూ మొదలపెట్టనుంది. సుమారు 15 ఏండ్లుగా భారత జట్టు బ్యాటింగ్ భారాన్ని మోసిన రోహిత్, కోహ్లీ (రోకో) టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై పలికిన నేపథ్యంలో వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్ల వేట సైతం ఈ సిరీస్‌తోనూ మొదలుకానుంది.
ఐపీఎల్లో అదరగొట్టిన అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రాణాకు తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపు అందగా వీరిలో తుషార్ మినహా మిగిలినవారంతా అరంగేట్రం చేసే అవకాశముంది. గిల్ తన చిన్ననాటి స్నేహితుడైన అభిషేక్‌తో ఓపెనింగ్ చేయనుండటంతో మెరుపు ఆరంభాలు ఖాయంగా కనిపిస్తోంది. మూడో స్థానంలో రుతురాజ్, ఆ తర్వాత రియాన్ పరాగ్, రింకూ సింగ్ వంటి హిట్టర్లతో టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. జితేశ్ శర్మ ఉన్నా ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండటం, స్పిన్ ఆల్‌రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్ సైతం ఉండటంతో 8వ స్థానం దాకా బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బిష్ణోయ్ ఉండగా పేసర్లుగా అవేశ్‌కు తోడుగా ఎవర్ని ఆడిస్తారనేది తేలాల్సి ఉంది. ఖలీల్, ముఖేశ్ రూపంలో భారత్‌కు మెరుగైన ఆప్షన్స్ ఉన్నాయి. ఈ సిరీస్‌లో మెరిస్తే కుర్రాళ్ల పంట పండినట్టే!
అంతర్జాతీయ క్రికెట్లో ఒకప్పుడు వెలుగు వెలిగి ఆ తర్వాత వరుస వైఫల్యాలతో రేసులో వెనుకబడ్డ జింబాబ్వే గత మూడు నాలుగేండ్లుగా ఫర్వాలేదనిపిస్తోంది. సికందర్ రజా సారథి అయ్యాక ఆ జట్టు బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక వంటి జట్లతో నిలకడగా రాణించింది. భారత్‌తో సిరీస్ ఆ జట్టుకు పుంజుకోవడానికి సదావకాశం. దీనిని జింబాబ్వే ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందనేది చూడాలి.
జట్ల అంచనా: భారత్: గిల్(కెప్టెన్), అభిషేక్, రుతురాజ్, రియాన్పరాగ్, రింకూసింగ్, జురెల్/జితేశ్, సుందర్, బిష్ణోయ్, అవేశ్‌ఖాన్, తుషార్దేశ్పాండే, ఖలీల్.
జింబాబ్వే: సికిందర్(కెప్టెన్), బెన్నెట్, మరుమని, క్యాంప్‌బెల్, నక్వి, ైక్లెవ్ మదాండె, మాదెవెరె, లూక్ జ్వోంగె, ఫరాజ్ అక్రమ్,
మసకద్జ, ముజర్బనీ.