రెండు నెలల పాటు ఐపీఎల్ లో తీరిక లేని క్రికెట్ ఆడిన టీమిండియా ఆటగాళ్లు దక్షిణాఫ్రికా సిరీస్ కు ముందు దొరికిన విశ్రాంతితో సేద తీరుతున్నారు. అయితే సఫారీ సిరీస్ తర్వాత భారత జట్టు మళ్లీ అంతర్జాతీయ షెడ్యూల్స్ తో బిజీ కానుంది. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ (మధ్యలో ఐర్లాండ్ తో రెండు మ్యాచులు) కు వెళ్లి గతేడాది మిగిలిన టెస్టు తో పాటు టీ20 లు ఆడే రోహిత్ సేన.. ఆ తర్వాత కరేబియన్ దీవులకు పయనం కానున్నది. జూలై 22 నుంచి ఆగస్టు 7 వరకు టీమిండియా.. వెస్టిండీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
ఈ మేరకు బీసీసీఐతో పాటు వెస్టిండీస్ క్రికెట్ జట్టు కూడా షెడ్యూల్ వివరాలను ప్రకటించాయి. విండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు ముందు.. విండీస్ తో మూడు వన్డేలను పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లోని క్వీన్స్ పార్క్ ఓవల్ లో ఆడుతుంది. ఆ తర్వాత ఐదు మ్యాచులు టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది.
అయితే టీ20 సిరీస్ లో భాగంగా మొదటి 3 టీ20 లను వెస్టిండీస్ లో నిర్వహించనుండగా.. చివరి రెండు మ్యాచులను మాత్రం అగ్రరాజ్యం అమెరికాలో జరిపించనుండటం గమనార్హం. యూఎస్ లోని ఫ్లోరిడాలో చివరి రెండు టీ20 లు జరుగనున్నాయి.
టీమిండియా విండీస్ పర్యటన షెడ్యూల్..
తొలి వన్డే: జూలై 22 (క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
రెండో వన్డే: జూలై 24 (క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
మూడో వన్డే: జూలై 27 (క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
తొలి టీ20 : జూలై 29: (బ్రియాన్ లారా స్టేడియం, పోర్ట్ ఆఫ్ స్పెయిన్)
రెండో టీ20 : ఆగస్టు 1 (వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ & నెవిస్)
మూడో టీ20 : ఆగస్టు 2 (వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్ & నెవిస్)
నాలుగో టీ20 : ఆగస్టు 6 (బ్రోవార్డ్ కౌంటీ గ్రౌండ్, ఫ్లోరిడా, అమెరికా)
ఐదో టీ20 : ఆగస్ట్ 7 (బ్రోవార్డ్ కౌంటీ గ్రౌండ్, ఫ్లోరిడా, అమెరికా)
వన్డే మ్యాచులు భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుండగా.. టీ20లు మాత్రం 8 గంటల నుంచి మొదలవుతాయి.