దుబాయ్: ఆసియా కప్‌లో డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగి స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్న భారత జట్టు బుధవారం మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్-4లో పాకిస్థాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే దాయాదిని చిత్తుచేసిన టీమ్ఇండియా నేడు బంగ్లాదేశ్‌ను ఢీకొననుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉండటంతో భారత్ జోరు కొనసాగించాలని భావిస్తున్నది. కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి కారణంగా ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఆగస్టులో బంగ్లాతో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌లను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య నేడు దుబాయ్ వేదికగా జరుగబోయే పోరులో బంగ్లా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. కానీ టీ20 ఫార్మాట్లో బంగ్లాదేశ్‌తో ఆడిన 17 మ్యాచ్‌లలో ఏకంగా 16 గెలుచుకుని సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్‌కు ఆ జట్టు ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి.
బలాబలాలపరంగా చూస్తే టీమ్ఇండియాకు బంగ్లా పోటీయే కాదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ మెన్ ఇన్ బ్లూ బంగ్లా కంటే మెరుగ్గా ఉంది. కానీ దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ బంతిని తిప్పేవారిదే ఆధిపత్యం కానుంది. అయితే బంతి దొరికితే బౌండరీ లైన్ ఆవల పడేయాలన్నంత కసితో బాదుతున్న అభిషేక్ శర్మతో పాటు పాక్‌తో మ్యాచ్‌లో టచ్‌లోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ ద్వయాన్ని ఆపడం బంగ్లా బౌలర్లకు పెను సవాలే. ఈ ఇద్దరితో పాటు కెప్టెన్ సూర్య, మిడిలార్డర్లో తిలక్, శాంసన్, హార్ధిక్, దూబె జోరుకు అడ్డుకట్ట వేయడానికి ఆ జట్టు శ్రమించాలి. పేస త్రయం ముస్తాఫిజుర్, టస్కిన్, తాంజిమ్ ఆరంభ ఓవర్లలో భారత్‌ను కట్టడి చేయాలని బంగ్లాదేశ్ కోరుకుంటున్నది. స్పిన్నర్లు రిషద్ హోసేన్, మెహది హసన్ రాణిస్తేనే ఆ జట్టుకు ప్రత్యర్థిని భారీ స్కోరు చేయకుండా నిలువరించే అవకాశం దక్కుతుంది.
ఇక భారత స్పిన్ త్రయం (అక్షర్, కుల్దీప్, వరుణ్)ను ఎదుర్కోవడం బంగ్లాకు శక్తికి మించిన పనే. ఆ జట్టులో కెప్టెన్ లిటన్ దాస్, తౌవిద్ హృదయ్, సైఫ్ హసన్ మాత్రమే ఈ టోర్నీలో స్పిన్‌ను మెరుగ్గా ఆడుతున్నారు. పేస్ విభాగంలో బుమ్రాకు విశ్రాంతినిస్తే హార్ధిక్‌కు జతగా అర్ష్‌దీప్ తుది జట్టులో ఉంటాడు. మధ్య ఓవర్లలో శివమ్ దూబె భారత్‌కు సర్ప్రైజ్ ప్యాకేజీలా మారాడు. అతడు బంతినందుకున్న ప్రతిసారి వికెట్లు పడగొడుతుండటం జట్టుకు కలిసొస్తున్నది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంటున్న నేపథ్యంలో బంగ్లా గనుక టాస్ గెలిస్తే భారత్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
భారత్: అభిషేక్, గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్, శాంసన్, హార్ధిక్, దూబె, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా/అర్ష్‌దీప్
బంగ్లాదేశ్: సైఫ్ హసన్, తాంజిద్, లిటన్ దాస్ (కెప్టెన్), తౌవిద్, షమీమ్, జేకర్, మెహిది హసన్, నసుమ్, షోరిఫుల్, టస్కిన్, ముస్తాఫిజుర్