రాత్రి 7.30 నుంచి..
విపరీతమైన మార్పులే దెబ్బతీశాయని మాజీలు అంటుంటే.. పొట్టి ప్రపంచకప్ కోసం 95 శాతం జట్టును సిద్ధం చేశామని కెప్టెన్ జబ్బలు చరుచుకుంటున్నాడు! ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ దళం మన సొంతం అనుకుంటే.. ఆసియాకప్‌లో ప్రత్యర్థులను ఆలౌట్ చేసేందుకు మనవాళ్లు ఆపసోపాలు పడ్డారు!!
లీగ్ దశలో ఫర్వాలేదనిపించిన టీమ్ఇండియా.. సూపర్-4లో వరుస పరాజయాలతో ఉసూరుమనిపించింది! వచ్చిన అవకాశాలను చేజార్చుకున్న రోహిత్ సేన.. ఇక నామమాత్ర పోరుకు సిద్ధమైంది.
దుబాయ్: ఇప్పటికే ఫైనల్ చేరే చాన్స్ మిస్ చేసుకున్న టీమ్ఇండియా.. ఆసియాకప్‌లో ఆఖరి మ్యాచ్‌కు రెడీ అయింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అఫ్గానిస్థాన్‌తో గురువారం రోహిత్‌సేన అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్దశలో పాకిస్థాన్, హాంకాంగ్‌పై విజయాలు సాధించి జోరు కనబర్చిన భారత్.. సూపర్-4లో పూర్తిగా నిరాశ పరిచింది. మంచి స్కోరు చేసి కూడా పాకిస్థాన్‌ను అడ్డుకోలేకపోయిన టీమ్ఇండియా.. లంకతో పోరులో ఆల్‌రౌండ్ వైఫల్యం కనబర్చింది. రెండు మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. ఛేదనలో ప్రత్యర్థిని కనీసం ఇబ్బంది పెట్టలేకపోయింది. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నీకి దూరం కాగా.. సీనియర్ పేసర్ భువనేశ్వర్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. అనారోగ్యంతో జట్టుకు దూరమైన అవేశ్ ఖాన్ ఆడిన మ్యాచ్‌ల్లో ధారాళంగా పరుగులు ఇచ్చుకోగా.. అర్శ్‌దీప్ తనదైన ముద్ర వేయలేకపోయాడు. పాక్‌తో గ్రూప్ మ్యాచ్‌లో అటు బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించిన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత మెరుపులు మెరిపించలేకపోయాడు. మోకాలి గాయంతో రవీంద్ర జడేజా జట్టుకు దూరమవడంతో టీమ్ఇండియా మరింత ఇబ్బందుల్లో పడింది. ఫామ్‌లేమితో సతమతమైన కోహ్లీ రెండు అర్ధశతకాలతో ఆకట్టుకున్నా.. తప్పక నెగ్గాల్సిన లంకతో పోరులో డకౌటై నిరాశ పరిచాడు. పాకిస్థాన్‌ను ఓడించినంత పనిచేసిన అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించాలంటే.. టీమ్ఇండియా శక్తికి మించి పోరాడక తప్పని పరిస్థితి.
అంతా సవ్యమేనా!
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ.. టీమ్ఇండియాను నడిపించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కొత్త ఆటగాడు అర్శ్‌దీప్ క్యాచ్ మిస్ చేసిన సమయంలో బాహాటంగా అతడిపై విరుచుకుపడ్డ హిట్‌మ్యాన్.. పాక్‌తో పోరులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను కూడా అరిచినట్లు వార్తలు వచ్చాయి. తుది జట్టు ఎంపిక, బ్యాటింగ్ ఆర్డర్లో తరచు మార్పులు కూడా జట్టుకు చేటు చేసినట్లు స్పష్టమవుతున్నది. పొట్టి ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని వివిధ సిరీస్‌ల్లో కొత్త ఆటగాళ్లకు అవకాశాలిచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. ప్రస్తుతం పునరాలోచనలో పడినట్లు కనిపిస్తున్నది. భవిష్యత్తు కెప్టెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ పంత్‌ను కాదని దినేశ్ కార్తీక్‌కు జట్టులో చోటు కల్పించడం కూడా వ్యూహాత్మక తప్పిదమనే చెప్పొచ్చు. దీంతో ఆత్మవిశ్వాసం లోపించిన పంత్.. ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేపోయాడు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించి జట్టు సమిష్టిగా సత్తాచాటాలని అభిమానులు ఆశిస్తున్నారు.