గాలె: శ్రీలంక గడ్డపై స్పిన్నర్లు విజృంభించడంతో తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా.. మూడో రోజు, సోమవారం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 79.4 ఓవర్లలో 284 రన్స్‌కే కుప్పకూల్చింది. మానవ్ సుతార్ (4/76), రవీంద్ర జడేజా (3/57) స్పిన్ మాయకు లంక కుదేలైంది. 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ లంకను సోనల్ దినుషా (168 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 100) కెరీర్ తొలి శతకానికి తోడు నిరోషన్ డిక్వెలా (115 బంతుల్లో 7 ఫోర్లతో 80) ఆరో వికెట్‌కు 146 రన్స్ జోడించి ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 178 రన్స్ ఆధిక్యం దక్కగా నాలుగో రోజు గిల్ సేన వేగంగా ఆడి ప్రత్యర్థి ఎదుట భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే గాలె మన చేతికి చిక్కినట్టే!
మూడో రోజు తొలి నాలుగు బంతుల్లోనే భారత ఇన్నింగ్స్‌కు తెరదించిన లంకకు ఆ ఆనందం ఎంతోసేపు దక్కలేదు. ఆఫ్‌సైడ్‌కు ఆవలగా సిరాజ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని వెంటాడబోయిన నిషాన్ (0) ఫస్ట్ స్లిప్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇవ్వడంతో లంక పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. 8వ ఓవర్లోనే తనకు బంతిని అందించిన కెప్టెన్ గిల్ నమ్మకాన్ని నిలబెడుతూ.. సుతార్ ఫస్ట్ బాల్కే చందిమల్ (4)ను బోల్తా కొట్టించాడు. ఆరు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన ఉదార (27) డ్రింక్స్ బ్రేక్ తర్వాత సుతార్ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చాడు. కమిందు మెండిస్(14).. కుల్దీప్ బౌలింగ్‌లో బంతిని లెగ్‌సైడ్ దిశగా డ్రైవ్ చేయగా ఎక్స్ట్రా కవర్స్ వద్ద ఉన్న కెప్టెన్ గిల్ పక్కకు డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టడంతో అతడి కథ ముగిసింది. లంచ్‌కు రెండు ఓవర్ల ముందు జడేజా బౌలింగ్‌లో కెప్టెన్ ధనంజయ (21) ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో రాహుల్ అందుకోవడంతో ఆతిథ్య జట్టు 90/5తో నిలిచింది.

తొలి సెషన్లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించగా రెండో సెషన్ మాత్రం లంకదే. మూడేండ్ల తర్వాత జట్టులోకి వచ్చిన డిక్వెలా.. దినుషాతో కలిసి స్ఫూర్తిధాయక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ అనవసరపు షాట్ల జోలికి పోకుండా జోరుమీదున్న టీమిండియా స్పిన్నర్లను సమర్థవంతంగా నిలువరించారు. వీరిని బుట్టలో వేసుకునేందుకు భారత్ పలుమార్లు ప్రయత్నించి విఫలమైంది. రెండు రివ్యూలనూ వేస్ట్ చేసుకుంది. స్పిన్‌ను ఎదుర్కునేందుకు ఎక్కువశాతం స్వీప్ షాట్ల ద్వారా ఈ ద్వయం పరుగులు రాబట్టింది. 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాహుల్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన డిక్వెలా.. 67 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. దినుషా కాస్త నెమ్మదిగా ఆడినా ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వలేదు. రెండో సెషన్లో ఈ జోడీ 29 ఓవర్లు ఆడి సుమారు 4 రన్‌రేట్‌తో 116 రన్స్ జోడించడం గమనార్హం. అయితే ఫైనల్ సెషన్ మొదలయ్యాక తన మూడో ఓవర్లో ప్రసిద్ధ్.. డిక్వెలాను ఔట్ చేసి ఈ జోడీని విడదీసి భారత్‌కు బ్రేక్‌నిచ్చాడు. ఆరో వికెట్‌కు ఈ జోడీ 146 రన్స్ జతచేసింది.
డిక్వెలా నిష్క్రమించే సమయానికి 80ల్లోకి వచ్చిన దినుషా.. లోయరార్డర్ అండతో తన తొలి టెస్టు శతకాన్ని అందుకున్నా.. జడేజా, సుతార్ మరోసారి మాయ చేసి 300లోపే జట్టును నిలువరించారు. నువంత (2)ను ఔట్ చేసి జడేజా తన టెస్టు కెరీర్లో 350వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రభాత్ (10) సాయంతో దినుషా శతకం పూర్తైంది. కానీ తర్వాతి బంతికే అతడు జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. లాహిరు కుమార (10)ను సుతార్ ఔట్ చేయడంతో లంక ఇన్నింగ్స్‌కు తెరపడింది. మూడో రోజు మరో 15 ఓవర్లు మిగిలున్నా వాతావరణం అనుకూలించడకపోవడంతో అంపైర్లు ఆటను నిలిపేశారు.
భారత్: తొలి ఇన్నింగ్స్ 116.4 ఓవర్లలో 462 ఆలౌట్ (పడిక్కల్ 167, జురెల్ 51, ప్రభాత్ 4/109, నువంత 3/175)
శ్రీలంక: తొలి ఇన్నింగ్స్ 79.4 ఓవర్లలో 284 ఆలౌట్ (దినుషా 100, డిక్వెలా 80, సుతార్ 4/76, జడేజా 3/57)4
టెస్టుల్లో 4000 పరుగులు చేసి 350 వికెట్లు తీసిన నాలుగో క్రికెటర్ జడేజా. కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, వెటోరి ముందున్నారు.