‘పాత నీరు పోవాలి..కొత్త నీరు రావాలి’ అంటారు. భారత క్రికెట్‌కు ఇది సరిగ్గా సరిపోతుంది. తమ అద్భుత ఆటతీరుకు తోడు మెండైన నాయకత్వ శైలితో దేశ క్రికెట్‌కు వన్నె తెచ్చిన కెప్టెన్లు ఎంతో మంది. తరాలు మారుతున్నా.. తరగని ప్రతిభతో వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ ప్రపంచ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన వారు ఎందరో! ప్రత్యర్థులకు దీటైన సవాల్ విసురుతూ స్వదేశం, విదేశమన్న తేడా లేకుండా జైత్రయాత్ర కొనసాగించారు. కాలానికి తగ్గట్లు సహచరుల్లో స్ఫూర్తినింపుతూ జట్టుకు విలువైన విజయాలు అందించారు. తమ నాయకత్వ పటిమతో చిరస్మరణీయ విజయాలందించి బాధ్యతల నుంచి వైదొలిగిన ప్రతీసారి అభిమానుల మనసులో ఏదో సందేహం. కానీ వాటిని పటాపంచలు చేస్తూ వారిని మరిపిస్తూ తమదైన శైలితో టీమ్ఇండియాను కెప్టెన్లు ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. దిగ్గజ త్రయం విరాట్‌కోహ్లీ, రోహిత్‌శర్మ, అశ్విన్ నిష్ర్కమణ వేళ సరిగ్గా ఇదే వెలితి కనిపిస్తున్నది.
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : వారం రోజుల వ్యవధిలో రోహిత్, కోహ్లీ అనూహ్యంగా టెస్టులకు వీడ్కోలు పలికిన సందర్భానికి తోడు అంతకుముందే స్పిన్ మాంత్రికుడు అశ్విన్.. ఆస్ట్రేలియాలో షాకింగ్ రిటైర్మెంట్ నిర్ణయం భారత క్రికెట్లో పెనుమార్పు! దేశ క్రికెట్లో ఒక రకంగా సంధి దశ. తమ అద్భుత నైపుణ్యంతో టీమ్ఇండియాకు లెక్కకు మిక్కిలి చిరస్మరణీయ విజయాలందించిన ఈ దిగ్గజ త్రయం వైదొలిగిన వేళ.. మార్పులకు బోర్డు శ్రీకారం చుట్టింది. అందరి ఊహలకు భిన్నంగా స్పీడ్‌స్టర్ బుమ్రాకు బదులుగా పంజాబీ పుత్తర్ శుభ్‌మన్ గిల్‌కు భారత టెస్టు పగ్గాలు అందించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటూ సెలెక్టర్లు, బోర్డు తీసుకున్న నిర్ణయం ఒక రకంగా కొందరిని బాధించినా అతడిని అంగీకరించక తప్పని పరిస్థితి.
గంగూలీ నుంచి ధోనీ, ధోనీ నుంచి కోహ్లీ, కోహ్లీ నుంచి రోహిత్ బాధ్యతలు అందుకున్నప్పుడూ ఇలాంటి పరిస్థితే. నాయకత్వ మార్పిడి టీమ్ఇండియాకు కొత్త కాకపోయినా.. దిగ్గజాలు లేని లోటును యువ క్రికెటర్లు ఏమేరకు పూడుస్తారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(2025-27) సైకిల్లో తొలి సిరీస్ ఆడబోతున్న టీమ్ఇండియా అందుకు తగ్గట్లు పావులు కదుపుతున్నది. కొరకరాని కొయ్యలాంటి ఇంగ్లండ్ పేస్ పిచ్‌లపై భారత యువ క్రికెటర్లు ఎలా రాణిస్తారన్నది అభిమానుల మెదళ్లను తొలుస్తున్నది.
ఇదిలా ఉంటే రాహుల్ ద్రవిడ్ తర్వాత చీఫ్ కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు అందుకున్న తర్వాత టీమ్ఇండియాకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఒక రకంగా చెప్పాలంటే టెస్టుల్లో ఘోర పరాభవాలను టీమ్ఇండియా మూటగట్టుకుంది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్.. ఇది చాలాదన్నట్లు ఆస్ట్రేలియాపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పరాభవం. టీమ్ఇండియా టెస్టు టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా రోహిత్, కోహ్లీ, అశ్విన్ రూపంలో నిష్ర్కమణ పర్వం. వీరి లోటును భర్తీ చేసేందుకు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, నితీశ్‌కుమార్‌రెడ్డి, సుందర్, జైస్వాల్ సదా సిద్ధంగా ఉండగా, కెప్టెన్సీతో పాటు బ్యాటర్‌గా గిల్ ఏ మేరకు సత్తాచాటుతాడు అనేది ప్రశ్నగా మారింది. మరో రెండు రోజుల్లో ఇంగ్లండ్‌తో మొదలయ్యే టెస్టు సిరీస్ గిల్‌కు ఒక రకంగా ‘లిట్మస్ టెస్టు’ లాంటింది.
దేశవాళీతో పాటు ఐపీఎలో గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించిన గిల్‌కు అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా అంతగా అనుభవం లేదు. టీమ్ఇండియాకు ఐదు టీ20 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్‌కు ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కత్తిమీద సాము లాంటిదే. ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితుల్లో డ్యూక్ బంతులు చేసే స్వింగ్‌ను తట్టుకోవడం అంతగా అనుభవం లేని భారత బ్యాటర్లకు విషమ పరీక్షే. బజ్‌బాల్‌తో ఇప్పటికే టెస్టు క్రికెట్‌ను దూకుడుగా మార్చేసిన ఇంగ్లండ్‌ను సొంతగడ్డపై నిలువరించాలంటే గిల్ స్థాయికి మించి పోరాడాల్సిందే. దూకుడును మరో స్థాయికి తీసుకెళ్లిన విరాట్‌కోహ్లీని ఇంకా మరిచిపోని భారత అభిమానులు..గిల్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
రోహిత్ లాంటి స్టయిల్ బ్యాటింగ్‌కు తోడు కోహ్లీ లాంటి దూకుడు గిల్లో చూడాలనుకుంటున్నారు. ఓవైపు తన కెప్టెన్సీ నైపుణ్యంతో సెషన్ సెషన్‌కు మారే ఆటతీరును అంచనా వేస్తూ ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ బ్యాటింగ్‌లో రాణించడం గిల్‌కు శక్తికి మించిన పనే! ఇప్పటి వరకు ఇంగ్లండ్‌లో 3 టెస్టులు ఆడిన గిల్ 6 ఇన్నింగ్స్‌ల్లో చేసిన అత్యుత్తమ స్కోరు 28 పరుగులే కావడం గమనార్హం. ఇందులో 42 శాతం స్పిన్నర్ల బౌలింగ్‌లో పరుగులు వస్తే..31 శాతం పేసర్ల నుంచి వచ్చాయి. కీలకమైన పరివర్తన దశలో పగ్గాలు అందుకున్న గిల్‌కు ఇంగ్లండ్ పిచ్‌లు పరీక్ష పెట్టబోతున్నాయి.
2007 తర్వాత తిరిగి ఇంగ్లండ్‌లో సిరీస్ గెలువని టీమ్ఇండియా ఈసారైనా చరిత్ర తిరుగరాయాలని చూస్తున్నది. ఎక్కువ డ్రైవ్ షాట్లు ఆడే గిల్‌కు అవే ప్రతిబంధకంగా మారనున్నాయి. ఫార్వర్డ్ డిఫెన్స్ షాట్ ఆడే క్రమంలో గిల్ ఇప్పటి వరకు 21 సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. ఏ మాత్రం ఆత్మవిశ్వాసం సన్నగిల్లినా అది అంతిమంగా జట్టును మొత్తంగా దెబ్బతీయడం ఖాయం. కోహ్లీ గైర్హాజరీలో కీలమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశమున్న గిల్ ఆ పాత్రకు ఏ మేరకు న్యాయం చేస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే కేఎల్ రాహుల్, బు మ్రా, జడేజా, సిరాజ్, పంత్ మినహా దాదాపు మిగిలినవారికి ఇంగ్లండ్‌లో ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడం టీమ్ఇండియా గెలుపు అవకాశాలను ప్రభావితం చేయనుంది.
భారత క్రికెట్ అభిమానులు సచిన్ టెండూల్కర్‌ను ‘గాడ్’గా భావిస్తే.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా ఆరాధించారు. ఇప్పుడు ఇదే కోవలో అభిమానులు.. గిల్‌ను ‘ప్రి న్స్’ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నా రు. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం నిర్వహించిన ఫొటోషూట్‌లో గిల్ బ్యాట్‌పై ప్రిన్స్ అన్న పదం బాగా హైలెట్ కావడం విశేషం. భారత అభిమానుల అంచనాలు అందుకు ంటూ ప్రిన్స్ గిల్ సత్తాచాటుతాడా? లేదా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.