అడిలైడ్: పొట్టి ప్రపంచకప్ అనంతరం న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20, వన్డే సిరీస్‌లకోసం బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం జట్లను ప్రకటించింది. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత ప్రారంభం కానున్న కివీస్ పర్యటనలో టీ20లకు హార్దిక్ పాండ్యా, వన్డేలకు శిఖర్ ధవన్ భారత జట్టుకు సారథ్యం వహించనున్నారు. పని భారాన్ని దృష్టిలో పెట్టుకొని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ను ఈ సిరీస్‌లకు ఎంపిక చేయలేదని సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పేర్కొన్నాడు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు అర్థమవుతున్నది. సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌తో పాటు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను టీ20 జట్టుకు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. అది ముగిసిన వెంటనే 25 నుంచి వన్డే సిరీస్ జరుగనుంది. ఈ రెండు జట్లకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
వచ్చే నెల 4 నుంచి భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ టూర్లో భాగంగా టీమ్ఇండియా.. 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది. దీనికోసం కూడా సెలక్షన్ కమిటీ సోమవారమే జట్లను ప్రకటించింది. విరామం అనంతరం రోహిత్, కోహ్లీ, రాహుల్ బంగ్లా టూర్ కోసం టీమ్‌లో చేరనుండగా.. గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌నకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రానున్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్న జస్ప్రీత్ బుమ్రా బంగ్లాదేశ్ పర్యటన వరకు కోలుకునే అవకాశమున్నా.. రిస్క్ తీసుకోవద్దనే ఉద్దేశంతో అతడిని ఎంపిక చేయలేదని చేతన్ శర్మ తెలిపాడు.