న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ఆసియాకప్ టోర్నీకి భారత జట్టు కూర్పుపై కసరత్తు కొనసాగుతున్నది. వచ్చే నెల 9 నుంచి యూఏఈ వేదికగా మొదలయ్యే ఆసియా టోర్నీ కోసం మంగళవారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ భేటీ కానుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగబోతున్న భారత్ జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ముఖ్యంగా టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంపికపై సందిగ్ధతకు తెరపడటం లేదు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారించిన గిల్‌ను ఎంపిక చేయాలా లేదా అనే దానిపై తర్జన భర్జన నడుస్తున్నది. దీనికి తోడు ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన శ్రేయాస్ అయ్యర్, జితేశ్శర్మ సెలెక్షన్‌పై ఉత్కంఠ నెలకొన్నది. ఇది బ్యాటింగ్ వరకే పరిమితం కాకుండా బౌలర్ల ఎంపికలోనూ ఇదే ప్రతిష్టంభన ఉన్నది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ప్రస్తుత టీ20 జట్టును పరిశీలిస్తే ప్రతిభావంతులైన యువకులతో కళకళలాడుతున్నది. సూర్యకుమార్ కెప్టెన్సీలో ఇప్పటి వరకు టీమ్ఇండియా 20 టీ20లు ఆడితే 17 మ్యాచ్‌ల్లో గెలువడం దీనికి తార్కాణం. వాస్తవానికి ఆసియా కప్ టోర్నీ కోసం 15 మందితో జట్టును ఎంపిక చేయాల్సి ఉన్నా..మరో 15 మంది రిజర్వ్ ప్లేయర్లు టీమ్ఇండియాకు కనిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సెలెక్షన్ ప్రక్రియ అనేది కత్తిమీద సాము లాగా ఉన్నది. టీమ్‌లో టాప్-3 స్థానాల కోసం ఆరుగురు ప్లేయర్లు పోటీపడుతున్నారు. ప్రస్తుతం అభిషేక్‌శర్మ, సంజూ శాంసన్, తిలక్‌వర్మతో టీమ్ఇండియా టాపార్డర్ సూపర్‌ఫామ్ మీదుంది. అయితే వీళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ఇటీవల ముగిసిన ఐపీఎల్లో గిల్, సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్ అదరగొట్టారు. ముఖ్యంగా గిల్ గుజరాత్ టైటాన్స్ తరఫున నిలకడగా రాణించగా, సుదర్శన్ టోర్నీ టాపర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఒక వేళ గిల్‌ను ఎంపిక చేస్తే అభిషేక్, శాంసన్, తిలక్‌వర్మ ఎవరినో ఒకరిని వదులుకోవాల్సి వస్తుంది. టెస్టుల్లో కీలక బ్యాటర్లుగా కొనసాగుతున్న గిల్, జైస్వాల్ టీ20ల్లోనూ తమదైన రీతిలో రాణిస్తున్నారు. అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ అనే ఆలోచన బీసీసీఐ మదిలో మెదిలితే అప్పుడు గిల్‌ను సూర్యకు వైస్ కెప్టెన్‌గా నియమించే అవకాశముంది. దీనికి తోడు వయసు, ప్రతిభరీత్యా గిల్‌కు భవిష్యత్, బ్రాండింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కెప్టెన్ రేసులో ముందుంచే ప్రయత్నం జరగవచ్చు. ఇదే జరిగితే ప్రస్తుత వైస్ కెప్టెన్ అక్షర్‌పటేల్‌కు చెక్ పడ్డట్లే. మరోవైపు హార్డ్హిట్టర్గా ఎంపికైన రింకూసింగ్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోతున్నాడు. 2025 సీజన్‌తో పోలిస్తే 2024 ఐపీఎల్లో అంతోఇంతో రాణించిన రింకూపై కత్తి వేలాడుతున్నది. ఒకవేళ గిల్‌ను తీసుకోవాలని అనుకుంటే అప్పుడు రింకూపై వేటుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నది.
ప్రస్తుత టీ20 టీమ్‌కు అర్ష్‌దీప్‌సింగ్ ప్రధాన బౌలర్‌గా కొనసాగుతుండగా, స్టార్ పేసర్ బుమ్రా చేరికతో బలం పెరిగింది. ఆల్‌రౌండర్ హార్దిక్పాండ్యాతో టీమ్ఇండియా పేసర్ల సంఖ్య మూడుకు పెరిగింది. అయితే మిగిలిన బెర్తుల కోసం హర్షిత్రానా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మధ్య పోటీనెలకొన్నది. వెస్టిండీస్‌తో అక్టోబర్ 2నుంచి మొదలయ్యే టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుంటే సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణకు విశ్రాంతి ఇవ్వవచ్చు.
అక్షర్‌పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్యాదవ్..గంభీర్ టాప్-3 స్పిన్నర్లుగా కొనసాగుతున్నారు. ఇప్పటికే సీనియర్ స్పిన్నర్ చాహల్‌ను సెలెక్టర్లు పూర్తిగా విస్మరించిన సంగతి తెలిసిందే. దుబాయ్, అబుదాబి స్లో పిచ్‌లను దృష్టిలో పెట్టుకుని ఆల్‌రౌండర్ సుందర్ వైపు గంభీర్ మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి.
వికెట్‌కీపర్ బ్యాటర్ స్థానం కోసం జితేశ్శర్మ, ధృవ్ జురెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కప్ గెలువడంలో జితేశ్ కీలకంగా వ్యవహరించాడు.