దుబాయ్: ఆసియాకప్‌లో భారత్, శ్రీలంక సూపర్-4 పోరు అభిమానులను కట్టిపడేసింది. టీ20 మజాను అందిస్తూ ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయ్యింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు(202/5) సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు జరిగిన సూపర్ ఓవర్లో భారత్..అద్భుత విజయం సాధించింది. మొదట లంక నాలుగు బంతుల్లో రెండు వికెట్లు(కుశాల్, శనక)కోల్పోయిన రెండు పరుగులే చేసింది. ఛేదనలో టీమ్ఇండియా తొలి బంతికే విజయాన్నందుకుంది. అంతకుముందు భారత్ 20 ఓవర్లలో 202/5 స్కోరు చేసింది.
ఓపెనర్ అభిషేక్‌శర్మ(31 బంతుల్లో 61, 8ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు తిలక్‌వర్మ(49 నాటౌట్), శాంసన్(39) రాణించారు. అసలంక, శనక ఒక్కో వికెట్ తీశారు. లక్ష్యఛేదనలో లంక 20 ఓవర్లలో 202/5 స్కోరు దగ్గర ఆగిపోయింది. ఓపెనర్ పతుమ్ నిస్సనక(58 బంతుల్లో 107, 7ఫోర్లు, 6 సిక్స్‌లు) ధనాధన్ సెంచరీతో దుమ్మురేపాడు. నిస్సనకకు తోడు కుశాల్ పెరెరా(58) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. హార్దిక్, అర్ష్‌దీప్, కుల్దీప్, రానా ఒక్కో వికెట్ తీశారు.
టీమ్ఇండియా యువ ఓపెనర్ అభిషేక్‌శర్మ..ఆసియాకప్‌లో సూపర్‌ఫామ్ కొనసాగిస్తున్నాడు. టాస్ గెలిచిన లంక..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టోర్నీలో ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(4) మరోమారు నిరాశపరిచాడు. తీక్షణ రెండో ఓవర్లో షాట్ ఆడబోయిన గిల్..నేరుగా అతనికే క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. తుషారను లక్ష్యంగా చేసుకుంటూ మూడో ఓవర్లో వరుస బౌండరీలు కొట్టిన అభిషేక్..ఐదో ఓవర్లో చమీరాకు చుక్కలు చూపించాడు. కండ్లు చెదిరే సిక్స్‌తో మొదలుపెట్టి రెండు ఫోర్లతో దుమ్మురేపడంతో 15 పరుగులు వచ్చిపడ్డాయి. అదే దూకుడు తుషారపై కొనసాగిస్తూ రెండు ఫోర్లతో 22 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్(12) తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు.
హసరంగా బౌలింగ్‌లో స్వీప్‌షాట్ ఆడబోయిన సూర్య..ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఓవైపు సహచరులు నిష్క్రమిస్తున్నా..తన జోరు తగ్గించని అభిషేక్.. అసలంక 8వ ఓవర్లో మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన శాంసన్..తిలక్‌వర్మకు జతకలిశాడు. పది ఓవర్లకు 100/3 స్కోరు చేసిన టీమ్ఇండియా వీరిద్దరి బ్యాటింగ్‌తో స్కోరుబోర్డు ఊపందుకుంది. ముఖ్యంగా శాంసన్ తనదైన శైలిలో బ్యాటు ఝులిపించాడు. కుదురుకున్న సమయంలో శనక..శాంసన్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ జోడీని విడగొట్టాడు. దీంతో నాలుగో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన హార్దిక్‌పాండ్యా(2) శాంసన్‌ను అనుసరించాడు. ఆఖర్లో అక్షర్‌పటేల్(21 నాటౌట్)తో కలిసి తిలక్‌వర్మ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అక్షర్ సిక్స్ కొట్టడం ద్వారా భారత్ 200 పరుగుల మార్క్ అందుకుంది.
లక్ష్యఛేదనలో లంకకు ఓపెనర్ కుశాల్ మెండిస్(0) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత పతుమ్ నిస్సనక, కుశాల్ పెరెరా ఇన్నింగ్స్ నిర్మించారు. రానా మూడో ఓవర్లో నిస్సనక, పెరెరా చెరో బౌండరీతో దంచుడుకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అర్ష్‌దీప్‌ను నిస్సనక ఓ ఫోర్, సిక్స్‌తో అరుసుకోగా, ఈసారి తన వంతూ అంటూ పెరెరా కూడా చెలరేగడంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి లంక 72/1 స్కోరు చేసింది. వీరిద్దరిని విడదీసేందుకు కెప్టెన్ సూర్య ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది.
ఈ క్రమంలో 25 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న నిస్సనక ఏ దశలోనూ వెనుకకు తగ్గలేదు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని వరుణ్ 13వ ఓవర్లో విడదీయడంతో రెండో వికెట్‌కు 127 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. నిస్సనక 52 బంతుల్లో టీ20ల్లో తొలి సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. రానా వేసిన చివరి ఓవర్లో 12 పరుగులు అవసరమైన దశలో వికెట్ కోల్పోయి 11 రన్స్‌కు పరిమితమైంది.
భారత్: 20 ఓవర్లలో 202/5(అభిషేక్ 61, తిలక్ 49 నాటౌట్, అసలంక 1/18, శనక 1/23),
శ్రీలంక: 20 ఓవర్లలో 202/5(నిస్సనక 107, కుశాల్ పెరెరా 58, హార్దిక్ 1/7, కుల్దీప్ 1/31)