అబుదాబి: ఆసియాకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన భారత్‌కు పసికూన ఒమన్ ముచ్చెమటలు పట్టించింది. సులువైన ప్రత్యర్థినే కదా అని అలవోకగా తీసుకున్న టీమ్ఇండియా..ఒమన్‌పై చెమటోడ్చి నెగ్గింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 21 పరుగుల తేడాతో ఒమన్‌పై గెలిచింది. తొలుత టీమ్ఇండియా 20 ఓవర్లలో శాంసన్(45 బంతుల్లో 56, 3ఫోర్లు, 3సిక్స్‌లు), అభిషేక్‌శర్మ(38) రాణించడంతో 188/8 స్కోరు చేసింది. వీరికి తోడు అక్షర్‌పటేల్(26), తిలక్‌వర్మ(29) ఆకట్టుకున్నారు. ఫైజల్, జితెన్, కలీమ్ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఒమన్ 20 ఓవర్లలో 167/4 స్కోరు చేసింది. ఆమీర్ కలీమ్(46 బంతుల్లో 64, 7ఫోర్లు, 2సిక్స్‌లు), హమ్మద్ మీర్జా(33 బంతుల్లో 51, 5ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. వీరిద్ధరి ధాటికి ఒక దశలో ఒమన్..భారత్‌కు షాక్ ఇస్తుందా అనిపించింది. హార్దిక్, అర్ష్‌దీప్, రానా, కుల్దీప్ ఒక్కో వికెట్ తీశారు.
టీమ్ఇండియా నిర్దేశించిన లక్ష్యఛేదన కోసం బ్యాటింగ్‌కు దిగిన ఒమన్ సాధికారిక ఆటతీరుతో ఆకట్టుకుంది. నిర్జీవమైన పిచ్‌పై పసలేని టీమ్ఇండియా బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొంటూ ఒమన్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. మరో ఓపెనర్ ఆమీర్ కలీమ్‌తో కలిసి కెప్టెన్ జతిందర్సింగ్(32) జట్టుకు మెరుగైన శుభారంభం అందించడంలో సఫలమయ్యాడు. గత మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమవుతూ వస్తున్న జతిందర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్‌లో కలీమ్ కూడా జత కలువడంతో ఒమన్ పవర్‌ప్లే ముగిసే సరికి 44 పరుగులు చేసింది. కుల్దీప్ 9వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూ నుంచి కలీమ్ తప్పించుకోగా, బంతి తేడాతో జతిందర్సింగ్..క్లీన్‌బౌల్డ్ కావడంతో తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక్కణ్నుంచి కలీమ్, హమ్మద్ మీర్జా ఇన్నింగ్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.
టీమ్ఇండియా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ లక్ష్యాన్ని అంతకంతకు తగ్గించే ప్రయత్నం చేశారు. అప్పటికే మంచి టచ్‌లోకి వచ్చిన కలీమ్..దూబే 15వ ఓవర్లో సిక్స్‌తో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా టీమ్ఇండియాకు లాభం లేకపోయింది. అయితే రానా 18వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించినా కలీమ్..హార్దిక్ సూపర్ క్యాచ్‌తో రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 93 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌కు ముగింపు పడింది. కలీమ్ ఔటైనా మీర్జా తన జోరు కొనసాగిస్తూ అర్ధసెంచరీ చేరుకున్నాడు. హార్దిక్ 19వ ఓవర్లో క్యాచ్ ఔట్‌తో మీర్జా మూడో వికెట్‌గా ఔటయ్యాడు.
ఇప్పటికే సూపర్-4కు అర్హత సాధించిన భారత్..ఒమన్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో పోరుకు సన్నాహకంగా భావించింది. టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్ మరో ఆలోచన లేకుండానే వెంటనే బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు.ఫామ్‌లేమితో సతమవుతున్న గిల్(5) మరోమారు నిరాశపరిచాడు. షా ఫైజల్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి గిల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. షకీల్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ తొలి బంతికే ఎల్బీడబ్ల్యూ నుంచి బయటపడ్డ అభిషేక్ తన సహజశైలికి తగ్గట్లు బ్యాటు ఝులిపించాడు. షకీల్‌ను లక్ష్యంగా చేసుకుంటూ గిల్..రెండు ఫోర్లు, భారీ సిక్స్‌తో విరుచుకుపడ్డాడు.మూడో స్థానంలో వచ్చిన సంజూ శాంసన్..అభిషేక్‌కు జత కలిశాడు.
క్రీజులో నిలదొక్కుకునేందుకు శాంసన్ ప్రయత్నించగా, మరో ఎండ్‌లో అభిషేక్ బ్యాటు ఝులిపించాడు. నదీమ్ వేసిన ఐదో ఓవర్లో అభిషేక్ మూడు ఫోర్లతో కదం తొక్కడంతో స్కోరుబోర్డు ఊపందుకుంది. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి టీమ్ఇండియా వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. అభిషేక్‌కు జత కలుస్తూ శాంసన్ సిక్స్, ఫోర్‌తో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో అభిషేక్..రామానంది బౌలింగ్‌లో కీపర్ శుక్లాకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ (1) అనూహ్య రీతిలో రనౌటయ్యాడు. ఈ తరుణంలో ఇన్నింగ్స్ బాధ్యతను శాంసన్ భుజానికెత్తుకున్నాడు. అక్షర్‌పటేల్(26)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
బౌండరీలతో టచ్‌లోకి వచ్చిన అక్షర్..కలీమ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌తో ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా..శాంసన్ నిలకడ కనబరిచాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన దూబే(5)..కలీమ్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. ఏడో స్థానంలో వచ్చిన తిలక్‌వర్మ(29) నిలదొక్కుకోవడం టీమ్ఇండియాకు కలిసి వచ్చింది. తన ఇన్నింగ్స్‌లో రెండు భారీ సిక్స్‌లు, ఫోర్‌తో అలరించిన వర్మ..ఆరో వికెట్‌కు శాంసన్‌తో కలిసి 41 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో శాంసన్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆఖర్లో హర్షిత్రానా(13 నాటౌట్) రాణింపుతో టీమ్ఇండియా 188 స్కోరు అందుకుంది. ఇదిలా ఉంటే బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం కెప్టెన్ సూర్యకుమార్ ఆఖరి స్థానానికి పరిమితం కావడం విశేషం.
భారత్: 20 ఓవర్లలో 188/8(శాంసన్ 56, అభిషేక్‌శర్మ 38, ఫైజల్ 2/23, అమీర్ కలీమ్ 2/31),
ఒమన్: 20 ఓవర్లలో 167/4(కలీమ్ 64, మీర్జా 51, కుల్దీప్ 1/23, రానా 1/25)