పెర్త్ : భారీ అంచనాల నడుమ ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు తమ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా.. టీమ్ఇండియాపై 7 వికెట్ల తేడా (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో)తో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. వర్షం పదేపదే అంతరాయం కల్గించిన మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ బ్యాటింగ్‌లో తడబాటుకు గురై 26 ఓవర్లలో 136/9 పరుగులకే పరిమితమైంది. కేఎల్ రాహుల్ (31 బంతుల్లో 38, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా అక్షర్ పటేల్ (31) ఫర్వాలేదనిపించాడు. టాపార్డర్ వైఫల్యం భారత్‌ను దెబ్బతీసింది. అనంతరం ఛేదన (131)ను ఆసీస్.. 21.1 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తిచేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మిచెల్ మార్ష్ (52 బంతుల్లో 46 నాటౌట్, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే గురువారం అడిలైడ్‌లో జరుగుతుంది.
మబ్బులు పట్టి ఉన్న వాతావరణంలో టాస్ గెలిచిన మార్ష్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌పై ఉన్న అదనపు బౌన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ ఆసీస్ పేసర్లు చెలరేగడంతో ఏడు నెలల విరామం తర్వాత జాతీయ జట్టుకు మ్యాచ్ ఆడిన రోహిత్ (8), కోహ్లీ (0) ద్వయం తీవ్రంగా నిరాశపరించింది. 22 బంతులకే ఈ ఇద్దరి ఇన్నింగ్స్ ముగిసింది. స్టార్క్ ఓవర్లో స్ట్రెయిట్ డ్రైవ్ బౌండరీతో హిట్‌మ్యాన్ పరుగుల వేటను ఆరంభించాడు. కానీ నాలుగో ఓవర్లో హాజిల్‌వుడ్ వేసిన బంతి అతడి బ్యాట్‌ను ముద్దాడుతూ రెండో స్లిప్‌లో ఉన్న రెన్షా చేతిలో పడింది. అభిమానుల కోలాహలం నడుమ క్రీజులో అడుగుపెట్టిన కోహ్లీ.. మరోసారి తన బలహీనతను బయటపెట్టుకుంటూ స్టార్క్ వేసిన ఆఫ్‌సైడ్‌కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మూల్యం చెల్లించుకున్నాడు.
ఆస్ట్రేలియాలో డకౌట్ అవడం (వన్డేల్లో) కోహ్లీకి ఇదే మొదటిసారి. కొత్త కెప్టెన్ గిల్ (10) సైతం ‘రోకో’నే అనుసరించడంతో భారత్ 8 ఓవర్లకు 25/3తో నిలిచింది. ఈ క్రమంలో వరుణుడు పలుమార్లు దోబూచులాడాడు. రెండు గంటల విరామం తర్వాత ఆట తిరిగి ప్రారంభమవగా మ్యాచ్‌ను 35వ ఓవర్లకు కుదించారు. శ్రేయాస్ అయ్యర్ (11)ను హాజిల్‌వుడ్ ఔట్ చేయడంతో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. కానీ రాహుల్, అక్షర్ జట్టును ఆదుకునే యత్నం చేశారు. కానీ వర్షం మళ్లీ అడ్డుపడటంతో 26 ఓవర్ల మ్యాచ్‌గా మారింది. ఈ సమయంలో అక్షర్, రాహుల్ జోరు పెంచి వేగంగా ఆడారు. కానీ 19వ ఓవర్లో కున్హెమన్.. అక్షర్‌ను పెవలియన్‌కు పంపాడు. షాట్ 20వ ఓవర్లో రాహుల్ 2 సిక్స్‌లు బాది స్కోరును వంద దాటించాడు. రాహుల్ నిష్క్రమించినా అరంగేట్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (19*) మెరుపులతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
స్వల్ప ఛేదనలో ఆస్ట్రేలియా పది పరుగుల వద్దే ప్రమాదకర ట్రావిస్ హెడ్ (8) వికెట్‌ను కోల్పోయింది. మాథ్యూ షాట్ (8) సైతం వెనుదిరిగినా మార్ష్, వికెట్ కీపర్ జోష్ ఫిలిప్పీ (37) నిలకడగా ఆడారు. ఆసీస్ బౌలర్లు రాణించిన చోట భారత పేసర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఫిలిప్పీ ఔట్ అయినా రెన్షా (21*) అండతో మార్ష్ లాంఛనాన్ని పూర్తిచేశాడు.
వన్డేల్లో ఈ ఏడాది వరుసగా 8 విజయాల తర్వాత భారత్‌కు ఇదే తొలి ఓటమి.
భారత్: 26 ఓవర్లలో 136/9 (రాహుల్ 38, అక్షర్ 31, హాజిల్‌వుడ్ 2/20, ఓవెన్ 2/20);
ఆస్ట్రేలియా: 21.1 ఓవర్లలో 131/3 (మార్ష్ 46*, ఫిలిప్పీ 37, వాషింగ్టన్ 1/14, అక్షర్ 1/19)