Guwahati Test : టెస్టు మ్యాచ్‌లో రోజుకు మూడు సెషన్లు ఉంటాయని తెలిసిందే. ఎక్కడైనా సరే లంచ్ తర్వాత టీ బ్రేక్ (Tea Break) ఇవ్వడం చూశాం. కానీ, ఈ ఆనవాయితీని భారత బోర్డు పక్కన పెట్టనుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో టెస్టులో వెరైటీగా భోజన విరామానికి ముందే టీ బ్రేక్ ఉండనుంది. మామూలుగా అయితే డే నైట్ టెస్టులో ఇలా జరుగుంది. అయితే.. గువాహటి మ్యాచ్‌లోనే తేనీరు సెషన్ ముందే ఉంటుందని మంగళవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) వెల్లడించాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో కూడా సైకియా చెప్పాడు. అదేంటంటే..?
లంచ్‌కు ముందు టీ బ్రేక్ ఇవ్వడమేంటీ? అని అశ్చర్యపోతున్నారు. అందుకు ఓ కారణం ఉంది. గువాహటిలో వాతావరణం నేపథ్యంలో భారత బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈశాన్యప్రాంతమైన ఇక్కడ తొందరగా చీకటి పడనుంది. అందుకే.. మ్యాచ్ వేళల్లో మార్పులు చేశామని దేవజిత్ సైకియా తెలిపాడు. ఉదయం 11కే లంచ్ అంటే ఆటగాళ్లు కొంత అసౌకర్యంగా ఫీలవుతారు. కాబట్టి.. టీ బ్రేక్‌ను ముందే ఇవ్వాలని నిర్ణయించామని సైకియా చెప్పాడు.
Due to early sunrise and sunset in Guwahati, the second #INDvSA Test will see players having tea first followed by lunch ☕️
Play will begin at 9am with the tea break to be taken at 11, with the 40-minute lunch break at 1:20pm and stumps scheduled for 4pm 🕓 pic.twitter.com/t9lnZrN9ak
— ESPNcricinfo (@ESPNcricinfo) November 11, 2025
‘చలికాలం మా ఈశాన్య ప్రాంతంలో సూర్యోదయం, సూర్యాస్తమయం త్వరగా జరుగుతాయి. సాయంత్రం నాలుగుకే చీకటి పడడం మొదలవుతుంది. కాబట్టి.. మ్యాచ్ వేళల్లో మార్పులు చేయాల్సి వచ్చింది’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో సైకియా వెల్లడించాడు.
ఇప్పటివరకూ టీ20లకు మాత్రమే వేదికైన గువాహటిలో ఇదే మొదటి టెస్టు మ్యాచ్. నవంబర్ 22 శనివారం మ్యాచ్ అరగంట ముందుగానే ప్రారంభించనున్నారు. ఉదయం 8:30 గంటలకు టాస్ వేస్తారు. 9 గంటలకు తొలి బంతి పడుతుంది. ఆపై రెండు గంటలకు అంటే.. 11 గంటలకు టీ బ్రేక్ 20 నిమిషాలు ఇస్తారు. అనంతరం.. మధ్యాహ్నం1:20 గంటలకు భోజన విరామం ప్రకటిస్తారు. నలభై నిమిషాల బ్రేక్ తర్వాత ఆట తిరిగి మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలకు ఆట ముగుస్తుంది.