Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన భారత్.. పాకిస్తాన్‌పై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అడ్డగోలు వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్‌ను నిందిస్తుందంటూ భారత్‌పై వ్యాఖ్యానించాడు. ఉగ్రవాదులను నిర్మూలించాలని తమ దేశానికి సందేశం ఇచ్చే ముందు.. ఆధారాలు అందివ్వాలన్నాడు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆరోపణలు.. ప్రతివాదనలకు దిగడం విచారకరమని, ఇలాంటి చర్యలు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు, అశాంతిని పెంచుతాయన్నాడు. నిందలు వేసే ఆటలో పాల్గొనేందుకు బదులుగా, సమస్యలను పరిష్కరించడానికి, క్రికెట్‌ను రాజకీయాలకు గురవకుండా ఉంచడానికి భారత్ చర్చల్లో పాల్గొనాలని చెప్పాడు.
ఇరు దేశాల మధ్య సఖ్యత కుదరాలంటే రెండు దేశాలు చర్చలు జరపాలని.. హింస, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయని.. రాజకీయ జోక్యం లేకుండా క్రికెట్ విముక్తి పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఎవరూ ఏ మతానికి చెందినవారైనా.. ఎవరూ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరని తాను నమ్ముతున్నానని.. అక్కడ (పహల్గాం) జరిగినది విచారకరమైన విషయమని.. అలాంటి ఘటనలు పాకిస్తాన్‌లోనూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇది చాలా దురదృష్టకరం, ఇలాంటివి జరుగకూడదని.. పొరుగు దేశాలు ఒకదానితో ఒకటి మెరుగైన సంబంధాలు కలిగి గొడవలతో ఎలాంటి ఫలితం ఉండదని మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిలయంగా ఉన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. అయినా, మాజీ కెప్టెన్ ఆధారాలు చూపించాలని చెప్పడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు పాకిస్తాన్ వుమెన్ క్రికెటర్ ఫిరోజా మాట్లాడుతూ రాబోయే ప్రపంచకప్ భారత్‌లో కాకుండా తటస్థ వేదికలో ఆడటం సంతోషంగా ఉందని పేర్కొంది. బీసీసీఐ, ఐసీసీ, పీసీబీ మధ్య ఒప్పందం ప్రకారం.. 2027 వరకు జరుగనున్న ఐసీసీ ఈవెంట్లో ఇరుదేశాలు తటస్థ వేదికల్లో ఆడనున్నాయి. ఈ ఏడాది భారత్ 2025 వుమెన్స్ ప్రపంచకప్‌కి ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిరోజా మాట్లాడుతూ భారత్‌లో ఆడేందుకు తమకు ఆసక్తి లేదని.. శ్రీలంక, దుబాయిలో ఎక్కడ మ్యాచులు జరిగినా పరిస్థితులు ఆసియా తరహాలోనే ఉంటాయని పేర్కొంది. ఎక్కడ మ్యాచులు ఆడినా పాకిస్తాన్లో ఉన్నట్లుగానే పరిస్థితులు ఉంటాయని.. అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. ఉగ్రదాడి తర్వాత సౌరవ్ గంగూలీ, శ్రీవత్స్ గోస్వామి సహా పలువురు భారత మాజీ క్రికెటర్లు పాకిస్తాన్‌తో పూర్తిగా క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని వ్యాఖ్యానించారు. ఇతర టోర్నీల్లోనూ పాకిస్తాన్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.