గువహతి: సొంతగడ్డపై జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో భారత జట్టు చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది. గువహతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వేదికగా నరాలు తెగే ఉత్కంఠ నడుమ జరిగిన క్వార్టర్స్ పోరులో భారత్ 2-1 (44-45, 45-30, 45-33)తో కొరియాను చిత్తుచేసి సెమీస్ చేరింది. దీంతో భారత జట్టు పతకాన్ని ఖాయం చేసుకుంది.
ఈ టోర్నీ చరిత్రలో పతకం సాధించడం మన దేశానికి ఇదే తొలిసారి కావడం విశేషం. మూడు సెట్లుగా జరిగిన ఈ పోరులో తొలి సెట్‌ను ఒక్క పాయింట్ (44-45)తో చేజార్చుకున్న భారత్ తర్వాత అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. సెమీస్‌లో భారత జట్టు ఇండోనేషియాతో తలపడనుంది. క్వార్టర్స్‌లో ఇండోనేషియా.. 45-35, 45-35తో చైనీస్ తైఫీని ఓడించి సెమీస్ చేరింది.