గువాహటి: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి టెస్టు చేజార్చుకున్న టీమ్ఇండియా చావోరేవో లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నది. శనివారం నుంచి గువాహటి వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మొదలుకానుంది. దేశ సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఈశాన్య భారత్ అంతర్జాతీయ టెస్టు పోరుకు ఆతిథ్యమిస్తున్నది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో పోలిస్తే సాయంత్రం సమయంలో తొందరగా సూర్యుడు ఆస్తమించనున్న గువాహటిలో పరిస్థితులు భిన్నంగా ఉండనున్నాయి. రెగ్యులర్ టెస్టులతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో లంచ్(మ:1.20) కంటే ముందు టీబ్రేక్(ఉ:11) ఉండనుంది. చేజేతులా కోల్‌కతా టెస్టును వదులుకున్న టీమ్ఇండియా గెలిస్తే గానీ సిరీస్‌ను నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేదు. ఎర్రమట్టితో కళకళలాడుతున్న బర్సపర పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంలా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే గౌతం గంభీర్ కోచింగ్‌లో న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై క్లీన్‌స్వీప్ ఎదుర్కొన్న టీమ్ఇండియా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. గంభీర్ కంటే ముందు స్వదేశంలో దాదాపు దశాబ్దం పాటు ఎస్ఈఎన్ఏ(దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)ను మట్టికరిపించిన భారత్..ప్రస్తుతం సొంత ఇలాఖాలో గడ్డు పరిస్థితిలో ఉన్నది. దీనికి తోడు రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడనొప్పితో రెండో టెస్టుకు దూరం కావడం జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. తొలి టెస్టులోనే తీవ్రంగా ఇబ్బందిపడ్డ గిల్..గువాహటి టెస్టు నుంచి వైదొలిగిన నేపథ్యంలో రిషబ్ పంత్ నేతృత్వంలో టీమ్ఇండియా పోటీకి దిగుతున్నది.
డబ్ల్యూటీసీ చాంపియన్ దక్షిణాఫ్రికా..ఇదే అదనుగా టీమ్ఇండియాను మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకు పావులు కదుపుతున్నది. అపజయమెరుగని బవుమా కెప్టెన్సీలో సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసేందుకు పట్టుదలగా ఉంది. స్పిన్‌తో సఫారీలను చుట్టేద్దామనుకున్న భారత్ అదే ఊబిలో కూరుకుపోవడం అభిమానులను కలవరపెడుతున్నది. దిగ్గజ త్రయం రోహిత్, కోహ్లీ, అశ్విన్ నిష్క్రమణ తర్వాత యువకులతో కనిపిస్తున్న భారత్ ప్రస్తుతం పరివర్తన దశను ఎదుర్కొంటున్నది. సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్‌ను ఎదుర్కొవడంపైనే టీమ్ఇండియా గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. గిల్ స్థానంలో సాయిసుదర్శన్ రాక దాదాపు ఖరారు కాగా, అక్షర్‌పటేల్‌ను తప్పించి ఆల్‌రౌండర్ నితీశ్‌ను జట్టులోకి తీసుకునే చాన్స్ కనిపిస్తున్నది.
భారత్: జైస్వాల్, రాహుల్, సుదర్శన్, జురెల్, పంత్(కెప్టెన్), నితీశ్‌కుమార్, జడేజా, సుందర్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్;
దక్షిణాఫ్రికా: మార్క్మ్,్ర రికల్టన్, ముల్దర్/బ్రెవిస్/ముత్తుస్వామి, టోనీ డీ జార్జి, బవుమా(కెప్టెన్), స్టబ్స్, వెరైన్, బాచ్, యాన్సెన్, హార్మర్, మహారాజ్