ఢిల్లీ: ఇటీవలే వివాహ బంధంలోకి అడుగిడిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. పెండ్లి తర్వాత ఆడుతున్న తొలి టోర్నీలో అదరగొడుతోంది. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్‌లో ఆమె క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
సింధుతో పాటు పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి, భారత స్టార్ జోడీ సాత్విక్-చిరాగ్ సైతం క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు.. 21-15, 21-13తో జపాన్ అమ్మాయి మనామి సుయిజును ఓడించింది.
మరోవైపు కిరణ్ 22-20, 21-13తో అలెక్స్‌ను ఓడించి క్వార్టర్స్ చేరుకున్నాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ 20-22, 21-14, 21-16తో ఒకముర-మిసుహాషి (జపాన్)ను ఓడించింది.