e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News నేటి నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ రెండో టెస్టు

నేటి నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ రెండో టెస్టు

  • వాంఖడే వార్‌
  • మ్యాచ్‌కు వరుణుడి ముప్పు.. ఉదయం 9.30 నుంచి

చిక్కినట్లే చిక్కి చేజారిన తొలి టెస్టు ఫలితాన్ని పక్కనపెట్టి రెండో పోరు కోసం టీమ్‌ఇండియా సిద్ధమైంది! రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టుతో చేరగా.. కూర్పు విషయంలో మేనేజ్‌మెంట్‌ మల్లగుల్లాలు పడుతున్నది. గత మ్యాచ్‌లో అద్వితీయ ప్రదర్శన చేసిన అరంగేట్ర ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ కోసం ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరం! స్టాండిన్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేపై వేటు పడుతుందా.. లేక పుజారాకు తప్పనిసరై ఓపెనింగ్‌ చేయాల్సి వస్తుందా నేడు తేలనుంది! మరోవైపు గత మ్యాచ్‌లో ఓటమి అంచుల నుంచి పోరాడి గట్టెక్కిన న్యూజిలాండ్‌.. ఈ మ్యాచ్‌ నెగ్గి భారత గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ చేజిక్కించుకోవాలని భావిస్తున్నది. మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉండగా.. పేసర్లకు అనుకూలించే పిచ్‌పై హైదరాబాదీ సిరాజ్‌కు చాన్స్‌ దక్కుతుందేమో చూడాలి!

ముంబై: మేఘావృతమైన వాతావరణంలో పేసర్లకు అనుకూలించనున్న పరిస్థితుల్లో టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌తో అమీతుమీకి రెడీ అయింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య కాన్పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగియగా.. సిరీస్‌ చేజిక్కించుకునేందుకు ఇటు భారత్‌, అటు కివీస్‌ పావులు కదుపుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో నిరాశాజనక ప్రదర్శన తర్వాత మూడు వారాలు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టుతో చేరగా.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు తుది జట్టు ఎంపిక తలనొప్పిగా మారింది. విరాట్‌ గైర్హాజరీలో జట్టులో చోటు దక్కించుకున్న యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌.. చక్కటి ఇన్నింగ్స్‌లతో తనను తప్పించలేని పరిస్థితి కల్పించగా.. గత కొన్ని మ్యాచ్‌లుగా ఆకట్టుకోలేకపోతున్న వైస్‌ కెప్టెన్‌ రహానే మెడపై కత్తి వేలాడుతున్నది. కరోనా వైరస్‌ కొత్త వేరియెంట్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనపై నీలినీడలు కమ్ముకుంటుండగా.. ఈ మ్యాచ్‌కు ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ 25 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించనుంది. మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉండగా.. ఇరు జట్లు ఒక్కో స్పిన్నర్‌ను తగ్గించుకొని అదనపు పేసర్లతో బరిలోకి దిగే చాన్స్‌లు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్‌లో జట్టును నడిపించిన రహానేకు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే.. సీనియర్‌ బ్యాటర్‌ చతేశ్వర్‌ పుజారాను ఓపెనింగ్‌ చేయించే దిశగా కూడా టీమ్‌ఇండియా ఆలోచిస్తున్నది. మెడనొప్పితో ఇబ్బంది పడి కాన్పూర్‌ టెస్టులో వికెట్‌ కీపింగ్‌కు దూరంగా ఉన్న సాహా పూర్తిగా కోలుకోవడంతో.. తెలుగు ఆటగాడు కోన శ్రీకర్‌ భరత్‌కు మరోసారి నిరీక్షణ తప్పేలా కనిపించడం లేదు. న్యూజిలాండ్‌ జట్టు భారత గడ్డపై టెస్టు మ్యాచ్‌ నెగ్గి మూడు దశాబ్దాలు దాటిపోగా.. చివరి సారిగా కివీస్‌ వాంఖడేలోనే విజయం సాధించడం కొసమెరుపు!

- Advertisement -

‘వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జట్టు కూర్పు ఉంటుంది. మేఘావృతమైన మైదానంలో ఎలాంటి బౌలింగ్‌ దళంతో బరిలోకి దిగితే ఫలితం అనుకూలిస్తుందో చర్చించాక.. దాన్నే అమలు చేస్తాం. జట్టులో ప్రతిఒక్కరికీ వారివారి బాధ్యతలు తెలుసు. తొలి టెస్టులో మెడనొప్పితో బాధపడ్డ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పూర్తి ఫిట్‌గా ఉన్నాడ-

విరాట్‌ కోహ్లీ, భారత కెప్టెన్‌

  • 2003లో చివరిసారిగా టీమ్‌ఇండియా సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో ఒక మ్యాచ్‌ కూడా నెగ్గలేకపోయింది. అప్పుడు కూడా ప్రత్యర్థి న్యూజిలాండే కాగా.. రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.
  • భారత గడ్డపై న్యూజిలాండ్‌ జట్టు చివరిసారిగా (1988లో) టెస్టు మ్యాచ్‌ నెగ్గింది ఇక్కడే కాగా.. ప్రస్తుత కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అప్పటికింకా పుట్టకపోగా.. విరాట్‌ కోహ్లీ వారాల బాలుడే కావడం గమనార్హం.
  • 2020 తర్వాత అజింక్యా రహానే బరిలోకి దిగిన 29 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో మూడు అర్ధశతకాలు మాత్రమే నమోదు చేశాడు. ఈ మూడూ (మెల్‌బోర్న్‌ 2020, చెన్నై 2021, లార్డ్స్‌ 2021) ఆయా సిరీస్‌ల్లోని రెండో టెస్టుల్లోనే రావడం విశేషం.

పిచ్‌, వాతావరణం

వాంఖెడే పిచ్‌ బౌన్స్‌కు సహకరించనుంది. గత రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో పిచ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. తేమ గల వాతావరణంలో పేసర్లకు స్వింగ్‌ లభించే అవకాశాలుండగా.. భారత్‌లోని ఇతర పిచ్‌లతో పోలిస్తే తక్కువ పొడిబారి ఉండనుంది. తొలి రోజు మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), మయాంక్‌, గిల్‌, పుజారా, శ్రేయస్‌/రహానే, జడేజా, సాహా, అశ్విన్‌, అక్షర్‌, సిరాజ్‌/ఇషాంత్‌, ఉమేశ్‌.
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), యంగ్‌, లాథమ్‌, టేలర్‌, నికోల్స్‌, బ్లండెల్‌, రచిన్‌, జెమీసన్‌, సౌథీ, వాగ్నర్‌, అజాజ్‌.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement