సిడ్నీ: శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యే అయిదో టెస్టుకు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్.. కెప్టెన్సీ విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించలేదు. కెప్టెన్సీ ఎవరు చేస్తారన్న దానిపై గంభీర్ ఎటువంటి ద్రువీకరణ చేయలేదు. దీంతో రేపటి నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టెస్టుకు బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మెల్బోర్న్ టెస్టు తర్వాత మీడియాతో మాట్లాడుతూ మానసికంగా ఆందోళనతో ఉన్నట్లు రోహిత్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్టుకు రోహిత్‌కు సారథ్యాన్ని అప్పగిస్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి.. బుమ్రా(Jasprit Bumrah)ను సిడ్నీ టెస్టుకు కెప్టెన్‌గా ఆడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
డ్రెస్సింగ్ రూమ్‌ల్లో జరిగే చర్చలు అక్కడికే పరిమితం కావాలని, అక్కడ చోటుచేసుకున్న సంభాషణలు బయటకు రావద్దు అని గంభీర్ తెలిపారు. కొందరు ఆటగాళ్లతో మర్యాదపూర్వకమైన చర్చ చేపట్టినట్లు చెప్పారు. రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న ప్రశ్నకు గంభీర్ సమాధానం ఇచ్చేందుకు దాటవేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో నిజాయితీ వ్యక్తులు ఉంటే, భారత క్రికెట్ సురక్షితమైన హస్తాల్లో ఉంటుందని గంభీర్ తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు కెప్టెన్ రోహిత్ రాకపోవడంతో.. తుది జట్టులో అతను ఉంటాడా లేదా అని జర్నలిస్టులు ప్రశ్న వేశారు. రోహిత్‌తో అంతా బాగానే ఉందన్నారు. సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్‌తో వ్యూహాల గురించి చర్చించినట్లు చెప్పారు. సిడ్నీ టెస్టులో రోహిత్‌కు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.