బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. ఆట మూడో రోజు ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ చేసిన గిల్ సేన.. 180 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ఇండియా.. ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 64 రన్స్ చేయడంతో గిల్ సేన ఆధిక్యం 244కు చేరింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ యువ బ్యాటర్లు జెమీ స్మిత్ (207 బంతుల్లో 184 నాటౌట్, 21 ఫోర్లు, 4 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (234 బంతుల్లో 158, 17 ఫోర్లు, 1 సిక్స్) రికార్డుస్థాయిలో త్రిశతక భాగస్వామ్యంతో వీరవిహారం చేసి ఆ జట్టును ఆదుకున్నారు.
భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ (6/70) ఆరు వికెట్లతో విజృంభించగా ఆకాశ్ దీప్ (4/88) నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (28) త్వరగానే నిష్క్రమించినా రాహుల్ (28 నాటౌట్), కరుణ్ (7 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. నాలుగో రోజు భారత బ్యాటర్లు.. స్టోక్స్ సేన ఎదుట ఏ మేరకు లక్ష్యాన్ని నిర్దేశిస్తారనేదానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
84/5.. మూడో రోజు ఉదయం ఆట ఆరంభమయ్యాక ఈ స్థితిలో ఉన్న ఇంగ్లండ్.. రెండు సెషన్ల పూర్తి ఆట ముగిసేసరికి 385/5కి చేరిందంటే అది అద్భుతమే! జీవం లేని బర్మింగ్‌హామ్ పిచ్‌పై యువ బ్యాటర్లు స్మిత్, బ్రూక్ ద్వయం భారత బౌలర్ల సహనానికి పరీక్షపెడుతూ ఏకంగా త్రిశతక భాగస్వామ్యంతో అదరగొట్టింది. మూడో రోజు సిరాజ్ వేసిన రెండో ఓవర్లోనే ఇంగ్లండ్.. వరుస బంతుల్లో రూట్ (22), స్టోక్స్ (0) వికెట్లను కోల్పోయినా ఆ జట్టు దూకుడు ఏమాత్రం తగ్గలేదు. కీలక బ్యాటర్లను ఔట్ చేసిన ఆనందం గిల్ సేనకు ఎంతోసేపు మిగల్లేదు. ఆరో స్థానంలో వచ్చిన స్మిత్.. బ్రూక్‌తో కలిసి భారత బౌలర్లను ఆటాడుకున్నాడు.
అతడు టీ20 తరహాలో చెలరేగిపోవడంతో తొలి సెషన్లో ఇంగ్లండ్.. 27 ఓవర్లలోనే ఏకంగా 6.37 రన్‌రేట్‌తో 172 రన్స్ సాధించిందంటే ఆ జట్టు దూకుడు ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఎదుర్కున్న తొలి బంతినే బౌండరీగా మలిచిన స్మిత్.. ‘బజ్‌బాల్’ ఆటతీరుతో ఓవర్‌కు ఓ బౌండరీకి తగ్గకుండా భారత బౌలర్లను శిక్షించాడు.
బ్రూక్ కాస్త నెమ్మదించినా బాదే బాధ్యతను భుజానికెత్తుకున్న స్మిత్.. ప్రసిద్ధ్ వేసిన 32వ ఓవర్లో 4, 6, 4, 4, 4 తో 23 పరుగులు పిండుకున్నాడు. 43 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తిచేసిన అతడు.. ఆ తర్వాత శతకానికి చేరడానికి తీసుకున్నది 37 బంతులే. ఈ జోడీని విడదీయడానికి గిల్.. పదే పదే బౌలర్లను మార్చినా ఫలితం శూణ్యం. జడ్డూ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో 80 బంతుల్లోనే స్మిత్ టెస్టుల్లో రెండో శతకాన్ని నమోదుచేశాడు. మరో ఎండ్‌లో బ్రూక్ సైతం.. హాఫ్ సెంచరీ తర్వాత తన సహజశైలికి మారడంతో భారత బౌలర్లకు నిరాశ తప్పలేదు.
లంచ్ తర్వాత ప్రసిద్ధ్ వేసిన 51వ ఓవర్లో చివరి బంతిని బౌండరీకి తరలించిన బ్రూక్.. లీడ్స్‌లో తృటిలో చేజారిన శతకాన్ని బర్మింగ్‌హామ్‌లో సాధించాడు. టెస్టుల్లో అతడికి ఇది 9వ సెంచరీ. అయితే తొలి సెషన్లో వీరవిహారం చేసిన ఈ జోడీ.. రెండో సెషన్లో కాస్త నెమ్మదించినా పరుగుల వేటను మాత్రం ఆపలేదు. సిరాజ్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన స్మిత్.. 150 పరుగుల మార్కును అందుకున్నాడు.
క్రీజులో పాతుకుపోయి అప్పటికే 300+ భాగస్వామ్యం నమోదుచేసిన బ్రూక్-స్మిత్ జోడీ ద్విశతకాల దిశగా సాగుతున్న వేళ 81వ ఓవర్లో తీసుకున్న కొత్త బంతి భారత్‌కు ఊరటనిచ్చింది. 83వ ఓవర్లో ఆకాశ్.. బ్రూక్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో 303 పరుగుల రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది. వోక్స్ (5) సైతం ఆకాశ్ బౌలింగ్‌లో స్లిప్స్‌లో కరుణ్ చేతికి చిక్కాడు. సిరాజ్ లోయరార్డర్ పనిపట్టాడు. కార్స్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న ఈ హైదరాబాదీ పేసర్.. టంగ్నూ పెవిలియన్‌కు పంపి ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. బషీర్నూ క్లీన్‌బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ జట్టు చివరి ఐదు వికెట్లను 7.2 ఓవర్లలో 20 పరుగుల వ్యవధిలో కోల్పోయింది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 587;
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 89.3 ఓవర్లలో 407 ఆలౌట్ (స్మిత్ 184*, బ్రూక్ 158, సిరాజ్ 6/70, ఆకాశ్ 4/88);
భారత్ రెండో ఇన్నింగ్స్: 13 ఓవర్లలో 64/1 (జైస్వాల్ 28, రాహుల్ 28*, టంగ్ 1/12)