కొలంబో: విదేశీ గడ్డపై మూడేండ్ల విరామం తర్వాత టెస్టు సిరీస్ కైవసం చేసుకునేందుకు భారత్ సన్నద్ధమైంది. తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన గిల్‌సేన శ్రీలంకతో ఆదివారం మొదలయ్యే రెండో, ఆఖరి టెస్టులోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ పోరులోనూ నెగ్గి 2-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ 57.58 శాతంతో నాలుగో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది.
తొలి టెస్టులో భారీ శతకంతో మెరిసిన పడిక్కల్, ఫిఫ్టీలతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జురెల్ అదే ఫామ్ కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. అదే సమయంలో కెప్టెన్ గిల్, ఓపెనర్ జైస్వాల్ బ్యాట్ల నుంచి కూడా పరుగులు రావాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో గిల్ విఫలం అవ్వగా.. జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో శుభారంభం దక్కినా మంచి స్కోరు చేయలేకపోయాడు. గతేడాది ఢిల్లీలో వెస్టిండీస్‌పై సెంచరీ చేసిన తర్వాత జైస్వాల్ ఆడిన గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఒక్క ఫిఫ్టీ మాత్రమే కొట్టాడు. మరోవైపు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 టెస్టుల్లో 73 సగటుతో 1100 పరుగులు చేసిన గిల్, సారథిగా తన తొలి విదేశీ సిరీస్ విజయాన్ని అందుకోవాలని ఆరాటపడుతున్నాడు .
అందుకోసం బ్యాటర్‌గా తన మార్కు చూపెట్టాల్సిన అవసరం ఉంది. ఇక, గాలె టెస్టులో తీవ్రంగా నిరాశపరిచిన స్పిన్నర్ కుల్దీప్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. లంక బ్యాటింగ్ లైనప్‌లో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఎక్కువగా ఉండటంతో జట్టు యాజమాన్యం ఈ మార్పుపై ఆలోచిస్తోంది. మరోవైపు శ్రీలంక తమ టాపార్డర్‌ను బలోపేతం చేసేందుకు ఫామ్‌లో ఉన్న కొత్త ఓపెనర్ కమిల్ మిషారా, సహన్ అరచ్చిగేను జట్టులోకి తీసుకుంది. తొలి టెస్టులో చేసిన తప్పిదాలు సరిదిద్దుకొని ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను పంచుకోవాలని ధనంజయ డిసిల్వా కెప్టెన్సీలోని ఆతిథ్య జట్టు భావిస్తోంది. ఇక, కొలంబోలో వర్ష సూచన తక్కువే ఉంది. పొడిగా ఉన్న పిచ్‌పై కాస్త పచ్చిక కనిపిస్తోంది కాబట్టి పేసర్లకు కొంత అనుకూలించొచ్చు.