రియాద్: వచ్చే ఒలింపిక్స్‌లో ఆడించనున్న క్రీడల్లో ఒకటైన లాక్రోస్‌లో భారత్ అదరగొట్టింది. సౌదీ అరేబియాలోని రియాద్ ఆతిథ్యమిచ్చిన ఆసియా లాక్రోస్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఉత్తరఅమెరికాలో ప్రాచుర్యం పొంది ఇప్పుడిప్పుడే ఆసియాలో ఉనికిని చాటుకుంటున్న ఈ క్రీడ హాకీ ఆటను పోలి ఉంటుంది. భారత పురుషుల జట్టుకు తెలంగాణలోని మహాబూబ్‌నగర్‌కు చెందిన అనుదీప్ రెడ్డి సారథిగా వ్యవహరిస్తున్నాడు.
భారత్, పాకిస్థాన్, సౌదీ అరేబియా, ఇరాక్ పాల్గొన్న ఈ టోర్నీ ఫైనల్లో భారత్.. 9-2 స్కోరుతో ఇరాక్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. టోర్నీ ఆసాంతం జట్టును విజయవంతంగా నడిపించిన అనుదీప్.. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటి రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించాడు. ఇదే టోర్నీలో భారత మహిళల జట్టు.. 22-5తో పాకిస్థాన్‌పై గెలిచి స్వర్ణం నెగ్గడం గమనార్హం.