Sultan Of Johor Cup : ప్రతిష్ఠాత్మక సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్‌లో భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్లుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మలేషియాను చిత్తుగా ఓడించి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన భారత జట్టు ధాటికి మలేషియా 4-2తో ఓటమి పాలైంది. దాంతో, టీమిండియా 9 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
మలేషియా వేదికగా జరుగుతున్నసుల్తాన్ ఆఫ్ జోహార్ కప్‌లో భారత కుర్రాళ్లు జోరు చూపిస్తున్నారు. ఆతిథ్య జట్టు ఆటగాళ్లు చెలరేగడంతో ఆరంభంలో వెనకబడినా అనూహ్య ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాచ్ మొదలైన 8వ నిమిషంలోనే మలేషియా గోల్ చేసింది. డానిష్ ఐమన్ 8 వ నిమిషంలో గోల్ చేయగా.. హ్యారిస్ ఒస్మాన్ 9 వ నిమిషంలో గోల్ కొట్టాడు.
తొలి అర్థ భాగంలో మలేషియా రెండు గోల్స్‌తో ఆధిక్యంలో ఉన్నవేళ .. 11వ నిమిషంలో శారద తివారీ గోల్‌తో పోటీలోకి వచ్చిన భారత్ ఇక వెనుదిరిగి చూడలేదు. అర్ష్‌దీప్ సింగ్ (13), తలెమ్ ప్రియబర్త(39)లు ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్టూ భారత్ ఆధిక్యాన్ని 3-2కు పెంచారు. అనంతరం రోహిత్ 40 వ నిమిషంతో బంతిని మలేషియా గోల్‌పోస్ట్‌లోకి పంపాడు. రెండో అర్థ భాగంలో ఇరుజట్లు పోటాపోటీగా ఆడాయి. మలేషియా ఆటగాళ్లు గోల్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు. కానీ, మన కుర్రాళ్లు ఏ ఒక్క అవకాశం ఇవ్వకపోవడంతో భారీ విజయం సాధ్యమైంది.