Asteroid | ఆస్టరాయిడ్స్తో భూమికి ప్రమాదం పొంచి ఉన్నది. విశ్వంలో ఓ గమ్యం అంటూ లేకుండా సంచరిస్తున్న ఈ గ్రహశకలాలు భూమి వైపుగా దూసుకువస్తుంటాయి. ఇందులో కొని భూమికి దగ్గరా వచ్చి వెళ్తుంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్నవి భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. భూ వాతావరణంలోకి రాగానే మండిపోతుంటాయి. అయితే, భారీ గ్రహశకలాలు ఢీకొట్టే మాత్రం పెను విధ్వంసం కలిగించే అవకాశం ఉన్నది. భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడంతోనే ఆ సమయంలో డైనోసార్స్ జాతి అంతరించిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరోసారి ఆస్ట్రరాయిడ్స్పై హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24న మధ్యాహ్నం 1.50 గంటల సమయంలో భూమికి దగ్గర నుంచి ఓ గ్రహశకలం వెళ్తుందని చెప్పింది. ఈ గ్రహశకలానికి 2024 టీపీ17గా నామకరణం చేసింది. ఈ గ్రహశకలం విమానం సైజులో ఉంటుంది.
ఇది భూమికి 46లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణిస్తుందని పేర్కొంది. భూమికి దగ్గరగానే వెళ్తుందని పేర్కొంది. ఈ ఆస్టరాయిడ్ గంటకు 20,832 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఆస్టరాయిడ్ గమనాన్ని నాసా నిశితంగా పరిశీలిస్తున్నది. గ్రహశకలం వేగం సాధారణం అయినప్పటికీ.. భూమికి దాని సమీపంగా వెళ్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆస్టరాయిడ్ 2024 టీపీ17 గ్రహశకలం 46,40,400 కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్తుండగా.. ఇది భూమి, చంద్రుడి మధ్య దూరం 3.84లక్షల కిలోమీటర్ల కంటే 12 రెట్లు ఎక్కువ. ప్రస్తుతం ఈ గ్రహశకలం నుంచి భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా ధ్రువీకరించింది. నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ గ్రహశకలాలపై నిఘా వేసి ఉంచుతుంది. గ్రహశకలాలకు సంబంధించిన డేటాను సేకరించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక అబ్జర్వేటరీల సహాయం తీసుకుంటుంది. గ్రహశకలం నుంచి ఇప్పటికప్పుడు ఎలాంటి ముప్పు లేకపోయినప్పటికీ.. రక్షణ వ్యూహాలను మెరుగుపరచడానికి నాసా నిరంతరం కృషి చేస్తోంది.