మాంచెస్టర్: మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయం అవసరమైన వేళ ఉమెన్ ఇన్ బ్లూ సత్తాచాటింది. గురువారం ఓల్డ్ ట్రాఫర్డ్ (మాంచెస్టర్) వేదికగా ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 137 పరుగులు స్వల్ప ఛేదనను 16.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. తద్వారా టోర్నీలో మూడో విజయంతో సెమీస్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకుంది.
చేజింగ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షెఫాలీ వర్మ (34 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 53), జెమీమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26) మెరుపులు మెరిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 20 ఓవర్లలో 136/8కే పరిమితమైంది. ఓపెనర్ జువైరియ ఫెర్దొస్ (33), కెప్టెన్ నిగార్ సుల్తానా (32) ఆదుకోవడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు రాధా యాదవ్ (3/28), శ్రీ చరణి (2/21) ప్రత్యర్థిని కట్టడిచేశారు. ఈ టోర్నీలో భారత్.. ఈనెల 28న ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.
ఆరంభంలో షెఫాలీ, ఆఖర్లో జెమీమా ధనాధన్ మెరుపులతో భారత్‌కు ఛేదన తేలికైంది. ఫస్ట్ ఓవర్లోనే రెండు బౌండరీలతో పరుగుల వేటను ప్రారంభించిన షెఫాలీ.. షంజీదా అక్తర్ విసిరిన రెండో ఓవర్లో 6, 4 కొట్టింది. స్మృతి మంధాన (8) నిరాశపరిచినా వన్‌డౌన్‌లో వచ్చిన యస్తికా (23)తో కలిసి వేగంగా ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ ఇద్దరూ ఓవర్‌కు పది పరుగులకు తగ్గకుండా ఆడటంతో పవర్ ప్లేలోనే భారత్ 63/1తో నిలిచింది. రబెయ ఖాన్ 8వ ఓవర్లో మూడో బంతిని ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బౌండరీకి తరలించిన షెఫాలీ.. 29 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తిచేసింది. అయితే నహిదా 9వ ఓవర్లో షెఫాలీ దురదృష్టవశాత్తూ స్టంపౌట్‌గా వెనుదిరగడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన యస్తికాను 12వ ఓవర్లో రితూ ఔట్ చేయగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చిన రిచా (10) సైతం విఫలమైంది. అయితే వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ డిఫెన్స్‌లో పడింది. కానీ జెమీమా దూకుడుగా ఆడింది. విజయానికి 9 పరుగుల దూరంలో ఆమె నిష్క్రమించినా దీప్తి శర్మ (5 నాటౌట్) కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (13 నాటౌట్) లాంఛనాన్ని పూర్తిచేశారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా.. పవర్‌ప్లేలో భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు జారవిడవంతో ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. రేణుకా తన తొలి ఓవర్లోనే అక్తర్ (4)ను ఔట్ చేసి బ్రేక్ ఇచ్చింది. ఫెర్దొస్ ఇచ్చిన పలు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేయడంతో ఆమె సొభానా మోస్త్రీ (22), నిగార్తో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పింది. 8వ ఓవర్లో నందిని.. ఫెర్దొస్ తనకే ఇచ్చిన క్యాచ్‌ను అందుకుని ఆమెను పెవిలియన్‌కు పంపింది.
12 ఓవర్లకు 75/2తో మెరుగ్గానే ఉండి 150+స్కోరు చేస్తుందని భావించిన బంగ్లా.. తర్వాత తడబడింది. తన రెండో స్పెల్‌లో బంతినందుకున్న రాధా.. వరుస ఓవర్లలో సొభాన, నిగార్ను ఔట్ చేసి ఆ జట్టును దెబ్బకొట్టింది. చివరి ఓవర్ వేసిన చరణి.. 3 పరుగులే ఇచ్చి 2 వికెట్లతో బంగ్లాను కట్టడిచేసింది.
1 మహిళల టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో చరణి (12).. పూనమ్ యాదవ్ (10)ను మరో 4 వికెట్లు తీస్తే ఆమె 2024లో కివీస్ బౌలర్ కెర్ (15) రికార్డును అధిగమిస్తుంది.
బంగ్లాదేశ్: 20 ఓవర్లకు 136/8 (ఫెర్దోస్ 33, నైగర్ 32, రాధా 3/28, చరణి 2/21);
భారత్: 16.5 ఓవర్లకు 139/5 (షెఫాలీ 53, జెమీమా 26, రితూ 2/29, రబెయ 1/19)