ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌ను పాతరేస్తూ టీమ్ ఇండియా విజయపతాకాన్ని ఎగురవేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్‌ను కట్టడి చేసిన భారత్.. భారీ విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లినట్టే!. 2017లో లండన్‌లో ఎదురైన ఓటమికి దుబాయ్‌లో ప్రతీకారం తీర్చుకున్న భారత్.. పాక్‌ను అనధికారికంగా ఇంటికి సాగనంపింది. ఇక కింగ్ కోహ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. చాలారోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల దాహార్తిని తీర్చేలా పరుగుల వరద పారిస్తూ సెంచరీతో అలరించాడు.
ఆహా ఏమా పోరు! చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ సమరం అభిమానులను మరోమారు అలరించింది. కోట్లాది మంది జనాలు ప్రత్యక్షంగా వీక్షించిన పోరులో దాయాది పాక్‌పై భారత్‌దే పైచేయి అయ్యింది. ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌ను పాతరేస్తూ టీమ్ఇండియా విజయపతాకాన్ని ఎగురవేసింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్‌ను కట్టడి చేసిన భారత్.. దుబాయ్‌లో భారీ విజయంతో మెగాటోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. కుల్దీప్, హార్దిక్ వికెట్ల వేటతో పాక్ 241 పరుగులకే పరిమితమైంది. లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్‌శర్మ ఆదిలోనే నిష్క్రమించినా విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. ప్రియమైన ప్రత్యర్థి పాక్ పాలిట సింహస్వప్నంలా నిలుస్తూ సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. పాక్ పేస్ త్రయం ఆఫ్రిదీ, నసీమషా, రవూఫ్‌ను చీల్చిచెండాడుతూ బెబ్బులిలా గర్జించాడు. శ్రేయాస్ అయ్యర్, గిల్ అండగా విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ భారత చిరస్మరణీయ విజయంలో కీలకమయ్యాడు. ఈ క్రమంలో వన్డేల్లో 14 వేల పరుగుల మైలురాయిని సగర్వంగా ముద్దాడి తనకు తిరుగలేదని చాటిచెప్పాడు. మొత్తంగా ఏడేండ్ల క్రితం లండన్‌లో ఎదురైన ఓటమికి దుబాయ్‌లో ప్రతీకారం తీర్చుకున్న భారత్..చాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్‌ను అనధికారికంగా సాగనంపింది.
Champions Trophy | దుబాయ్ : ఐసీసీ టోర్నీలలో పాకిస్థాన్‌ను చిత్తుచేసే అలవాటును కొనసాగిస్తూ దాయాదుల పోరులో మరోసారి భారత్‌దే పైచేయి. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రిజ్వాన్ సేనకు ఘోర పరాభవం. ఆల్‌రౌండ్ షో తో పాక్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించిన టీమ్ఇండియా.. సెమీస్ బెర్తును ఖాయం చేసుకోగా వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి ఆతిథ్య పాక్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది! పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోయే ఆడే రన్మిషీన్, ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ (111 బంతుల్లో 100 నాటౌట్, 7 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగి మరో మరుపురాని ఇన్నింగ్స్ ఆడటంతో పాక్ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలోనే పూర్తిచేసింది. కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ (67 బంతుల్లో 56, 5 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్ (52 బంతుల్లో 46, 7 ఫోర్లు) రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. సౌద్ షకీల్ (76 బంతుల్లో 62, 5 ఫోర్లు), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (77 బంతుల్లో 46, 3 ఫోర్లు) ఆదుకోవడంతో పోరాడగలిగే స్కోరును సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (3/40), హార్దిక్ పాండ్యా (2/31), జడేజా (1/40) పాక్‌ను కట్టడిచేశారు. కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కోహ్లీ కమాల్ : ఐసీసీ టోర్నీలలో తనకెంతో ఇష్టమైన ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోయే కోహ్లీ.. కీలక పోరులోనూ దానిని కొనసాగించాడు. రోహిత్ నిష్క్రమణ తర్వాత వచ్చి ఆరంభంలో గిల్‌కు అండగా నిలిచిన విరాట్.. హరీస్ 13వ ఓవర్లో తనదైన ట్రేడ్ మార్క్ కవర్ డ్రైవ్ బౌండరీలతో పరుగుల వేటకు శ్రీకారం చుట్టాడు. గిల్ ఔట్ అయినా శ్రేయస్ అండగా అతడు కళాత్మకమైన ఆటతీరుతో విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీని ఔట్ చేయడానికి రిజ్వాన్.. పదే పదే బౌలింగ్ మార్పులు చేసినా ఫలితం లేకుండా పోయింది. గత మ్యాచ్‌లో స్పిన్ ఆడేందుకు ఇబ్బందులు పడ్డ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో అబ్రర్, ఖుష్దిల్లను మాత్రం ఆత్మవిశ్వాసంతో ఎదుర్కున్నాడు. ఒక్కోపరుగు కూడగడుతూ శ్రేయస్, విరాట్.. స్కోరుబోర్డును లక్ష్యం దిశగా నడిపించారు. 27వ ఓవర్లో నసీమ్ తొలి బంతిని బౌండరీకి తరలించడంతో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తయింది. శ్రేయస్ కూడా దూకుడు పెంచి.. అఘా బౌలింగ్‌లో 102 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. 63 బంతుల్లో అర్ధ శతకం సాధించిన శ్రేయస్‌ను ఖుష్దిల్ 39వ ఓవర్లో ఔట్ చేశాడు. కానీ అప్పటికే భారత విజయం ఖరారైంది. హార్ధిక్ (8) విఫలమైనా కోహ్లీకి అండగా అక్షర్ (3 నాటౌట్) నిలబడ్డాడు. కాగా 42వ ఓవర్లో భారత విజయానికి 10 పరుగులు అవసరం కాగా కోహ్లీ కూడా 90లలోకి రావడంతో అతడి శతకం పూర్తవుతుందా? లేదా? అని అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. కానీ ఖుష్దిల్ 43వ ఓవర్లో సింగిల్‌తో పాటు మూడో బంతికి బౌండరీ బాదిన కోహ్లీ.. వన్డేలలో 51వ, మొత్తంగా 82వ శతకాన్ని పూర్తిచేయడమే గాక భారత్‌కు అపురూప విజయాన్ని అందించాడు.
మందకొడి పిచ్‌పై తొలుత టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఆరంభంలో ఫర్వాలేదనిపించినా వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోవడంతో నెమ్మదిగా ఆడింది. బాబర్ ఆజమ్ (26 బంతుల్లో 23, 5 ఫోర్లు) గత మ్యాచ్‌తో పోల్చితే కాస్త వేగంగానే ఆడినట్టు కనిపించాడు. ఇమామ్ ఉల్ హక్ (10)తో కలిసి అతడు మొదటి వికెట్‌కు 41 పరుగులు జోడించాడు. కానీ బౌలింగ్ మార్పుగా వచ్చిన హార్దిక్.. తన రెండో ఓవర్లో బాబర్‌ను పెవిలియన్‌కు పంపడంతో పాక్ వికెట్ల పతనం మొదలైంది. ఆ మరుసటి ఓవర్లో ఇమామ్‌ను అక్షర్ తన అద్భుత త్రో తో రనౌట్ చేయడంతో పాక్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షకీల్-రిజ్వాన్ ద్వయం ఎట్టిపరిస్థితుల్లోనూ వికెట్‌ను కాపాడుకోవాలనే పట్టుదలతో ఆడటంతో పరుగుల రాక మందగించింది. మొదటి 10 ఓవర్లలో 52/2గా నిలిచిన పాక్.. స్పిన్నర్ల ఎంట్రీతో 11-20 ఓవర్ల మధ్య చేసిన స్కోరు 27 పరుగులే.
కుల్దీప్, అక్షర్, హర్షిత్, జడేజా కట్టుదిట్టంగా బంతులేశారు. స్పిన్నర్లు రాణించడంతో రోహిత్ కూడా పేసర్ల కంటే వారితోనే ఎక్కువ ఓవర్లు వేయించి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఫలితంగా 26వ ఓవర్లో గానీ పాక్ వంద పరుగుల మార్కును అందుకోలేకపోయింది. షకీల్ సింగిల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేసినా రిజ్వాన్ మాత్రం డిఫెన్స్‌కే ప్రాధాన్యమిచ్చాడు. 63 బంతుల్లో షకీల్ అర్ధ శతకం పూర్తయింది. వంద పరుగుల భాగస్వామ్యం పూర్తిచేసుకున్న రిజ్వాన్-షకీల్ జోడీని ఎట్టకేలకు అక్షర్ విడదీశాడు. అతడు వేసిన 34వ ఓవర్లో ముందుకొచ్చి ఆడబోయిన రిజ్వాన్.. క్లీన్‌బౌల్డ్ అవడంతో 104 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులో కుదురుకున్న షకీల్.. హార్దిక్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి డీప్ మిడ్ వికెట్ వద్ద అక్షర్ పట్టిన క్యాచ్‌తో నిష్క్రమించాడు. జడేజా.. తయ్యబ్ తాహిర్‌ను బౌల్డ్ చేశాడు. కుల్దీప్ 43 ఓవర్లో అఘా సల్మాన్ (19), షహీన్ షా అఫ్రిది (0)ని ఔట్ చేసి పాక్‌ను దెబ్బతీశాడు. ఆఖర్లో ఖుష్దిల్ (39 బంతుల్లో 38, 2 సిక్సర్లు) ఆ జట్టుకు పోరాడగలిగే స్కోరును అందించాడు.
వన్డేలలో కోహ్లీ 14వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మ్యాచ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో సచిన్ (18,426), కుమార సంగక్కర (14,234) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. అంతర్జాతీయంగా అత్యధిక వేగంగా ఈ రికార్డును అందుకున్న తొలి క్రికెటర్ కోహ్లీనే. 287 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లీ ఈ రికార్డు సాధిస్తే సచిన్ 350 ఇన్నింగ్స్, సంగక్కర 378 ఇన్నింగ్స్‌లలో 14వేల మైలురాయిని దాటారు.
ఛేదించాల్సిన లక్ష్యం చిన్నదే అయినప్పటికీ పిచ్ స్పందిస్తున్న తీరు, గత మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌తో ఛేదన అంత సులువు కాదనే అనిపించింది. కానీ అందుకు భిన్నంగా భారత ఇన్నింగ్స్ సాగింది. సారథి రోహిత్ శర్మ (15 బంతుల్లో 20, 3 ఫోర్లు, 1 సిక్స్) నసీమ్ షా రెండో ఓవర్లోనే 4, 6తో ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించాడు. గిల్ కూడా షహీన్ మూడో ఓవర్లో రెండు బౌండరీలు కొట్టాడు. కానీ షహీన్ 5వ ఓవర్లో నాలుగో బంతిని బౌండరీకి తరలించిన హిట్‌మ్యాన్.. ఐదో బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. సారథి ఔట్ అయినా కోహ్లీ అండతో గిల్ రెచ్చిపోయాడు. షహీన్‌ను లక్ష్యంగా చేసుకున్న అతడు.. 7వ ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. రెండో బౌండరీని స్ట్రైట్ డ్రైవ్‌తో బౌండరీకి పంపించాల్సిన తీరు సచిన్‌ను గుర్తుచేసింది. మొదటి పవర్ ప్లేలో భారత్ ఒక వికెట్ నష్టానికి 64 పరుగులు చేస్తే అందులో గిల్వే సగం. కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించిన గిల్.. అర్ధ సెంచరీ ముంగిట అబ్రర్ 17వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు.
1 ఈ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు పట్టడంతో భారత్ తరఫున వన్డేలలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్లలో కోహ్లీ (157).. మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ (156)ను అధిగమించాడు. అంతర్జాతీయ స్థాయిలో జయవర్దెనే (218), పాంటింగ్ (160) కోహ్లీ కంటే ముందున్నారు. ఐసీసీ టోర్నీలలో భాగంగా పాకిస్థాన్‌తో ఆడిన 18 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 4 శతకాలు, 3 అర్ధ సెంచరీలు సాధించాడు.
సంక్షిప్త స్కోర్లు :
పాకిస్థాన్: 49.4 ఓవర్లలో 241 ఆలౌట్ (షకీల్ 62, రిజ్వాన్ 46, కుల్దీప్ 3/40, హార్దిక్ 2/31);
భారత్: 42.3 ఓవర్లలో 244/4 (కోహ్లీ 100 నాటౌట్, శ్రేయస్ 56, షహీన్ 2/74, అబ్రర్ 1/28)
చాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్‌లను మైదానాలకు ప్రత్యక్షంగా వచ్చి చూసేవారు లేక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో పాటు ఐసీసీ ఆందోళన చెందుతున్న వేళ దాయాదుల పోరుకు మాత్రం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పూర్తిగా నిండిపోయింది.
పాకిస్థాన్‌పై భారత్ గెలువడం ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ నా అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో సాధ్యమైతే అది మరింత ప్రత్యేకం. టీమ్ఇండియాకు ప్రత్యేక అభినందనలు
చాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ పోరు అద్భుతం. అంతర్జాతీయ క్రికెట్లో 82వ సెంచరీతో కదంతొక్కిన విరాట్ కోహ్లీకి ప్రత్యేక శుభాకాంక్షలు. పాక్‌పై ఈ విజయం చిరస్మరణీయం. ఇలాంటి విజయాలు మరిన్ని రావాలి.
భారత్, పాక్ మ్యాచ్‌లో అభిమానులు సందడి చేశారు.భారత్, పాక్ పోరు చూసేందుకు సినిమా స్టార్లు చిరంజీవి, వివేక్ ఒబేరాయ్‌తో పాటు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు, మాజీ ఎంపీ సంతోశ్‌కుమార్, దర్శకుడు సుకుమార్, క్రికెటర్లు తిలక్‌వర్మ, అభిషేక్‌శర్మ, సూర్యకుమార్‌యాదవ్ హాజరయ్యారు.