బ్రిస్బేన్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా (Ind vs Aus) పటిష్ట స్థితిలో ఉన్నది. ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో విజృంభించగా, అలెక్స్ కేరీ 70 రన్స్ చేయడంతో మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. 405 రన్స్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కొద్ది సేపటికే మిచెల్ స్టార్క్‌ను 423 రన్స్ వద్ద బుమ్రా ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన నాథన్ వికెట్‌ను అద్భుతమైన బంతితో మహ్మద్ సిరాజ్ పడగొట్టాడు. ఇక క్రీజులో పాతుకుపోయిన అలెక్స్ కేరీని (70) ఆకాశ్ దీప్ ఔట్ చేశాడు. దీంతో మ్యాచ్‌లో తొలి వికెట్‌ను ఆకాశ్ సొంతం చేసుకున్నాడు. ఇక బుమ్రా 6 వికెట్లు తీయగా, సిరాజ్ 2, ఆకాశ్, నితీశ్ కుమార్ చెరో వికెట్ తీశారు. భారత తన మొదటి ఇన్నింగ్స్‌ను జైశ్వాల్‌తో కలిసి రాహుల్ ప్రారంభించనున్నాడు. అయితే మ్యాచ్‌కు మరోసారి వర్షం అడ్డుపడింది.
బీజీటీ సిరీస్‌లో చెరో టెస్టు గెలిచి 1-1తో సమంగా మూడో టెస్టులో అడుగుపెట్టిన ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. సొంతగడ్డపై పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆసీస్ ప్రయత్నిస్తుంటే.. టీమ్ఇండియా దీటైన పోటీనిచ్చేందుకు సై అంటున్నది. టెస్టు తొలి రోజు ఆటకు వరుణుడు అంతరాయం కల్గించగా, రెండో రోజు షెడ్యూల్ కంటే అరగంట ముందు మ్యాచ్ ప్రారంభించారు. ఓవర్‌నైట్ స్కోరు 28/0తో ఆదివారం ఆట కొనసాగించిన ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(160 బంతుల్లో 152, 18ఫోర్లు), స్టీవ్ స్మిత్(190 బంతుల్లో 101, 12ఫోర్లు) సెంచరీలతో విజృంభించారు.