నార్తాంప్టన్: ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత అండర్-19 జట్టు దుమ్మురేపుతున్నది. గురువారం జరిగిన మూడో వన్డేలో యువ భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ముందంజ వేసింది. ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (31 బంతుల్లో 86, 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో కదంతొక్కాడు.
ఇంగ్లండ్ నిర్దేశించిన 269 పరుగుల లక్ష్యఛేదనలో టీమ్ఇండియా 34.3 ఓవర్లలో 274-6 స్కోరు చేసింది. 38 పరుగులకే కెప్టెన్ అభిజ్ఞాన్ కుందు (12) వికెట్ కోల్పోయినా జట్టును సూర్యవంశీ ఆదుకున్నాడు. ఇంగ్లం డ్ బౌలర్లను ఊచకోత కోస్తూ అండర్-19 క్రికెట్ చరిత్రలో మూడో వేగవంతమైన అర్ధసెంచరీ (20 బంతుల్లో) సూర్యవంశీ తన పేరిట లిఖించుకున్నాడు. వైభవ్ నిష్ర్కమించినా విహాన్ మల్హోత్ర(46), కనిశ్క్ చౌహాన్(43 నాటౌట్) రాణించడంతో యువ భారత్ గెలుపు సులువైంది.