T20 World Cup | కౌలాలంపూర్: ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమ్ఇండియా.. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. కౌలాలంపూర్‌లోని బ్యూమస్ ఓవల్ వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత బౌలర్లు దుమ్మురేపడంతో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 44 పరుగులకే కుప్పకూలింది.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జోషిత (2/5)తో పాటు అయూషి శుక్లా (2/6), పరుణిక సిసోడియా (3/7) వెస్టిండీస్ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనీయలేదు. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టులో ఐదుగురు ఖాతా కూడా తెరకవపోగా కెనిక (15), అసబి (12) మినహా మిగినవారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బౌలర్లతో పాటు ఫీల్డర్లు మైదానంలో పాదరసంలా కదులుతూ మూడు రనౌట్లు చేయడంతో విండీస్ కోలుకోలేకపోయింది.
అనంతరం లక్ష్యాన్ని భారత్.. 4.2 ఓవర్లలోనే పూర్తిచేసింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (4) నిరాశపరిచినా కమలిని (16 నాటౌట్), సనిక (18 నాటౌట్) వేగంగా ఆడారు. గ్రూప్-ఏలో శ్రీలంక, మలేషియా మధ్య జరిగిన మ్యాచ్‌లో లంక అమ్మాయిలు 139 పరుగల భారీ తేడాతో గెలుపొందారు. మొదట బ్యాటింగ్ చేసిన లంక.. 162/6 చేయగా ఆతిథ్య మలేషియా 14.1 ఓవర్లలో 23 పరుగులకే ఆలౌట్ అయింది. ఈనెల 21న జరిగే మ్యాచ్‌లో భారత్, మలేషియా తలపడతాయి.