Team India | ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు సమిష్టి ప్రదర్శనతో కదం తొక్కింది. కీలకమైన సెమీస్ రేసులో నిలువాలంటే భారీ విజయం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో టీమ్ఇండియా జూలు విదిల్చింది. నాయక ద్వయం హర్మన్‌ప్రీత్‌కౌర్, మందన అర్ధసెంచరీలతో భారీ స్కోరు అందుకున్న భారత్..శ్రీలంకను స్వల్ప స్కోరుకు కట్టడి చేసింది. తద్వారా సెమీస్ రేసులో రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటములతో లంకకు నిరాశే ఎదురైంది.
దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. మెగాటోర్నీలో నిలువాలంటే భారీ తేడాతో గెలువాల్సిన స్థితిలో అదరగొట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 82 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. దీంతో 0.576 రన్‌రేట్‌తో గ్రూపు-ఏలో ఆస్ట్రేలియా(2.52) తర్వాత స్థానంలో కొనసాగుతున్నది. తొలుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(27 బంతుల్లో 52 నాటౌట్, 8ఫోర్లు, సిక్స్), స్మృతి మందన(38 బంతుల్లో 50, 4ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో భారత్ 20 ఓవర్లలో 172/3 స్కోరు చేసింది. ఆటపట్టు, కాంచన ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన లంక..19.5 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. కవిశ(21), అనుష్క(20)టాప్ స్కోరర్లుగా నిలిచారు. అరుంధతిరెడ్డి(3/19), ఆశా శోభన(3/19) మూడేసి వికెట్లు తీశారు. ధనాధన్ అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన హర్మన్‌ప్రీత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
మందన, కౌర్ దూకుడు: కచ్చితంగా భారీ విజయం సాధించాల్సిన పరిస్థితుల్లో మందన, హర్మన్‌ప్రీత్ అద్భుత ఆటతీరు ప్రదర్శించారు. ఓపెనర్లు షెఫాలీవర్మ, మందన దూకుడైన బ్యాటింగ్‌తో జట్టుకు మెరుగైన శుభారంభం అందించారు. దీంతో వవర్ప్లే ముగిసే సరికి భారత్ వికెట్ కోల్పోకుండా 41 పరుగులు చేసింది. మధ్యలో కొంత ఆట నెమ్మదించినా..వీరిద్దరు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే వరుస బంతుల్లో వీరు ఔట్ కావడం ఒకింత ఆందోళన కల్గించినా..కౌర్ వచ్చి రావడంతోనే బ్యాటు ఝులిపించింది. లక్ష్యఛేదనలో లంక ఏమాత్రం పోరాటపటిమ కనబర్చలేకపోయింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన ధాటికి లంక వరుసగా వికెట్లు కోల్పోయింది.
భారత్: 20 ఓవర్లలో 172/3(కౌర్ 52 నాటౌట్, మందన 50, కాంచన 1/29, ఆటపట్టు 1/34),
శ్రీలంక: 19.5 ఓవర్లలో 90 ఆలౌట్(కవిశ 21, అనుష్క 20, అరుంధతి 3/19, శోభన 3/19)