భారత యువ క్రికెటర్ తిలక్‌వర్మ దుమ్మురేపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఫామ్‌లేమితో ఇన్ని రోజులు తడబడ్డ తిలక్..సఫారీల పనిపట్టాడు. సహచరులు విఫలమైన చోట తన విలువ చాటుకుంటూ ధనాధన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచూరియన్‌లో తన టీ20 కెరీర్లో తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. తిలక్‌కు తోడు అభిషేక్‌శర్మ రాణింపుతో భారత్ తొలుత 219 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనలో సఫారీలు పోరాడి ఓడారు. దక్షిణాఫ్రికాను జాన్సెన్ ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ఇండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
సెంచూరియన్ : భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 పోరు రసవత్తరంగా సాగుతున్నది. బుధవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ సేన 11 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించింది. తొలుత భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ(56 బంతుల్లో 107 నాటౌట్, 8ఫోర్లు, 7సిక్స్‌లు) శతకానికి తోడు అభిషేక్ శర్మ (25 బంతుల్లో 50, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో మెరవడంతో టీమ్ఇండియా భారీ స్కోరు సాధించింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 107 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సిమిలేన్(2/34), మహారాజ్(2/36) రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 208/7 పరుగులు చేసింది. జాన్సెన్(17 బంతుల్లో 54, 4ఫోర్లు, 5సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నా..జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయాడు. అర్ష్‌దీప్‌సింగ్(3/37), చక్రవర్తి(2/54) రాణించారు. తిలక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్, తిలక్ ఆటే హైలైట్. గత మ్యాచ్‌లో మాదిరిగానే సంజూ శాంసన్.. మరోసారి మార్కో జాన్సెన్ తొలి ఓవర్ రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ బ్యాటింగ్‌లో ప్రమోషన్ పొంది మూడో స్థానంలో వచ్చిన తిలక్.. ఎదుర్కున్న రెండో బంతికి బౌండరీతో ఖాతా తెరవడమే గాక ఆ మరుసటి బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా భారీ సిక్సర్‌గా మలిచాడు. గత 8 ఇన్నింగ్స్‌లలో కనీసం 20 పరుగుల మార్కును అందుకోలేకపోయిన అభిషేక్ ఈ మ్యాచ్‌లో మాత్రం నిలబడ్డాడు. కొయెట్జీ 2వ ఓవర్లో 4, 6, 4తో బాదుడుకు శ్రీకారం చుట్టాడు. మొదటి పవర్ ప్లే ముగిసేసరికే భారత్ స్కోరు 70/1గా నమోదైంది. కేశవ్ మహారాజ్ 9వ ఓవర్లో తొలి బంతినే లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టిన అభిషేక్.. తర్వాత బంతికే సింగిల్ తీసి అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. కానీ అదే ఓవర్లో నాలుగో బంతిని ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అవడంతో 107 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అతడి స్థానంలో వచ్చిన సారథి సూర్యకుమార్ (1) మరోసారి నిరాశపరిచాడు. హార్దిక్ (18) మూడు ఫోర్లు కొట్టి జోరుమీద కనిపించినా మహారాజ్ 13వ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగాడు.
హార్దిక్ ఔట్ అయ్యేటప్పటికే 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న తిలక్.. ఆ తర్వాత మరింత జోరుపెంచాడు. పరుగులు రాబట్టడంలో రింకూ సింగ్ (8) వెనుకబడ్డా వర్మ మాత్రం బాదుడు ఆపలేదు. మహారాజ్ 15వ ఓవర్లో 4,6,4 బాదిన అతడు కొయెట్జి వేసిన మరుసటి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 90కు చేరువగా వచ్చాడు. సిపమ్ల 19వ ఓవర్లో ఐదో బంతిని మిడాప్ మీదుగా బౌండరీకి తరలిచండంతో టీ20లలో అతడు తొలి శతకాన్ని సాధించాడు.
కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వచ్చిన సఫారీలు ఆరంభంలోనే తడబడ్డారు. రెండు బౌండరీలు, ఓ సిక్సర్‌తో ఊపుమీదున్న రికెల్టన్ (20)ను అర్ష్‌దీప్ బౌల్డ్ చేశాడు. ఇక 13 బంతుల్లోనే 4 ఫోర్లు కొట్టిన మరో ఓపెనర్ హెండ్రిక్స్ (21)ను చక్రవర్తి మొదటి ఓవర్లో స్టంపౌట్ అయ్యాడు. కెప్టెన్ మార్క్మ్(్ర29), స్టబ్స్(12) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. కుదురుకుంటున్న తరుణంలో స్టబ్స్‌ను ఔట్ చేసి అక్షర్ పటేల్ దెబ్బ తీశాడు. ఆఖర్లో క్లాసెన్(41) బ్యాటు ఝులిపించాడు. ఇక గెలుపు తమదే అనుకుంటున్న తరుణంలో జాన్సెన్( 54) మెరుపులు మెరిపించాడు.పాండ్యా 19వ ఓవర్లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 16 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న జాన్సెన్ను అర్ష్‌దీప్ ఔట్ చేయడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
సఫారీ ఇన్నింగ్స్ ఆరంభించిన కొద్దిసేపటికే స్టేడియాన్ని పురుగులు చుట్టుముట్టాయి. ఆటగాళ్లకు ఇబ్బంది కలిగించే అవకాశముండటంతో మ్యాచ్ నిర్వాహకులు కొద్దిసేపు ఆటను తాత్కాలికంగా నిలిపేశారు. సుమారు 20 నిమిషాల విరామం తర్వాత అంపైర్లు ఆటను పునరుద్ధరించారు.
భారత్: 20 ఓవర్లలో 219/6 (తిలక్ 107 నాటౌట్, అభిషేక్ 50, సిమెలానె 2/34, మహారాజ్ 2/36);
దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 208/7(జాన్సెన్ 54, క్లాసెన్ 41, అర్ష్‌దీప్‌సింగ్ 3/37, చక్రవర్తి 2/54)