Team India | రాజ్‌కోట్: కొత్త రికార్డులు నమోదైన రాజ్‌కోట్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఏకంగా 304 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి పాత రికార్డుల దుమ్ము దులిపింది. అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన టీమ్ఇండియా.. సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మంధాన సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 435 పరుగుల రికార్డు స్కోరు చేసింది. వన్డేలలో భారత్ (పురుషుల, మహిళల)కూ ఇదే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. ఓపెనర్లు ప్రతీక రావల్ (129 బంతుల్లో 154, 20 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (80 బంతుల్లో 135, 12 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకాల మోత మోగించగా రిచా ఘోష్ (42 బంతుల్లో 59, 10 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో ప్రత్యర్థి ఎదుట భారత్ భారీ స్కోరును నిలిపింది. అనంతరం ఛేదనలో ఐర్లాండ్.. 31.4 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో సారా ఫోర్బ్స్ (41) ఫర్వాలేదనిపించగా మిగిలినవారంతా చేతులెత్తేశారు. భారీ శతకం బాదిన ప్రతీకకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ’ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులూ లభించాయి.
గత కొంతకాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్న మంధాన, ఇటీవలే జట్టులోకి వచ్చి నిలకడగా ఆడుతున్న ప్రతీక ప్రారంభ ఓవర్ల నుంచే ఐర్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ప్రెండర్గస్ట్ 3వ ఓవర్లోనే ప్రతీక 3 బౌండరీలు బాది తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పింది. మ్యాచ్ ఆసాంతం ఆమె అదే జోరును కొనసాగించింది. అర్లెనె 9వ ఓవర్లో స్మృతి.. 6, 6, 4 బాదడంతో స్కోరువేగం మరింత పుంజుకుంది. ఈ క్రమంలో ఆమె 31 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేసుకుంది. 17వ ఓవర్లో బౌండరీతో 52 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాక ప్రతీక మరింత జోరు పెంచింది. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిన మంధాన.. 70 బంతుల్లోనే తన పదో శతకాన్ని సాధించింది. భారత్ (మహిళల) తరఫున వన్డేలలో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. ఈ ఇద్దరి దూకుడుతో 24 ఓవర్లకే భారత్.. వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. సెంచరీ తర్వాత మరింత వేగంగా ఆడే క్రమంలో మంధాన 27వ ఓవర్లో పెవిలియన్ చేరింది. దీంతో 233 పరుగుల తొలి వికెట్ (26.4 ఓవర్లలోనే) భాగస్వామ్యానికి తెరపడింది.
మంధాన నిష్క్రమించినా ఆమె స్థానంలో వచ్చిన రిచాతో కలిపి ప్రతీక జోరు కొనసాగించింది. ఇదే సిరీస్‌లో శతకం చేసే అవకాశాన్ని కోల్పోయిన ఆమె.. 35వ ఓవర్లో ఐదో బంతిని సింగిల్ తీసి కెరీర్లో తొలిసారి మూడంకెల స్కోరును సాధించింది. ఆ తర్వాత ఆమె ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. రిచా సైతం బౌండరీల వర్షం కురిపించడంతో భారత్ స్కోరు రాకెట్ వేగాన్ని తలపించింది. రెండో వికెట్‌కు 104 పరుగులు జోడించిన ఈ జోడీని కెల్లీ 38వ ఓవర్లో విడదీసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రతీక సైతం ఔట్ అయినా తేజల్ (28), హర్లీన్ (15) కలిసి 400 పరుగుల మార్కును దాటించారు.
రికార్డు ఛేదనలో ఐర్లాండ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆ జట్టులో ఐదుగురే రెండంకెల స్కోరు చేశారు. స్పిన్నర్లు దీప్తి శర్మ (3/27), మిన్ను మణి (1/22), తనూజా కన్వర్ (2/31) స్పిన్ మాయాజాలానికి ఐరిష్ బ్యాటర్లు నిలువలేకపోయారు.
వన్డేలలో 400 పరుగులు చేయడం భారత మహిళా జట్టుకు ఇదే తొలిసారి. అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ ఘనత సాధించాయి.
వన్డే ఫార్మాట్లో టీమ్ఇండియాకు (పురుషులు, మహిళలు కలిపి) ఇదే అత్యుత్తమ స్కోరు. పురుషుల జట్టు 2011లో వెస్టిండీస్‌పై 411 పరుగులు చేయడమే ఇప్పటిదాకా హయ్యస్ట్.
భారత్: 50 ఓవర్లలో 435/5 (ప్రతీక 135, స్మృతి 135, ప్రెండర్గస్ట్ 2/71)
ఐర్లాండ్: 31.4 ఓవర్లలో 131 ఆలౌట్ (సారా 41, ప్రెండర్గస్ట్ 36, దీప్తి 3/27)