న్యూఢిల్లీ:ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. యువ భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో తృటిలో పరాజయం పాలైన శిఖర్ ధవన్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండు వన్డేలు నెగ్గి సిరీస్ చేజిక్కించుకుంది. నిర్ణయాత్మక పోరులో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ సఫారీలకు సింహస్వప్నంలా మారగా.. కుల్దీప్ మిగిలిన పని పూర్తి చేశాడు. సుందర్, షాబాజ్ కూడా తమ వంతు తోడ్పాటు అందించడంతో పర్యాటక జట్టు మూడంకెల స్కోరుకు ముందే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యఛేదనను టీమ్ఇండియా ఇరవై ఓవర్ల లోపే ముగించి ట్రోఫీ ముద్దాడింది.
బౌలర్ల హవా సాగిన పోరులో టీమ్ఇండియాదే పైచేయి అయింది. మేఘావృతమైన వాతావరణంలో మన బౌలర్లు విజృంభించడంతో దక్షిణాఫ్రికాపై సిరీస్ చేజిక్కింది. మంగళవారం నిర్ణయాత్మక మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ధవన్ సేన 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. క్లాసెన్ (34) టాప్ స్కోరర్ కాగా.. జానెమన్ మలన్ (15), జెన్సెన్ (14) మినహా తక్కినవాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. డికాక్ (6), హెండ్రిక్స్ (3), మార్క్మ్ (9), మిల్లర్ (7), ఫెలుక్వాయో (5) విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ నిర్ణీత సమయం కంటే అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 105 రన్స్ చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (49; 8 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. కుల్దీప్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.
సత్తాచాటిన సిరాజ్
జస్ప్రీత్ బుమ్రా గాయపడటంతో.. టీ20 ప్రపంచకప్ జట్టులో ఓ స్థానం ఖాళీ కాగా.. దానికి తానే అర్హుడినని సిరాజ్ మరోసారి నిరూపించుకున్నాడు. తాజా సిరీస్‌లో తన వేగంతో పాటు కచ్చితత్వంతో ఆకట్టుకున్న ఈ హైదరాబాదీ.. ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. గత మ్యాచ్ ఫామ్‌ను కొనసాగిస్తూ చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో డికాక్‌ను ఔట్ చేయడం ద్వారా సుందర్ వికెట్ల ఖాతా తెరువగా.. మలన్, హెండ్రిక్స్‌ను సిరాజ్ వరుస ఓవర్లలో బుట్టలో వేసుకున్నాడు. బవుమా, కేశవ్ అందుబాటులో లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు డేవిడ్ మిల్లర్ సారథ్యం వహించాడు. గత మ్యాచ్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షాబాజ్ అహ్మద్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. కుల్దీప్ లోయర్ ఆర్డర్ పనిపట్టాడు. ఆఖరి వరుస ఆటగాళ్లు కనీస ప్రతిఘటన కనబర్చకపోవడంతో 33 పరుగుల వ్యవధిలో దక్షిణాఫ్రికా చివరి 6 వికెట్లు కోల్పోయింది. ఓవరాల్‌గా భారత్‌పై వన్డేల్లో అత్యంత స్వల్ప స్కోరు నమోదు చేసుకున్న సఫారీలు.. బౌలింగ్‌లోనూ అద్భుతాలు చేయలేకపోయారు. ధవన్ (8), ఇషాన్ (10) ఎక్కువసేపు నిలువకపోయినా.. గిల్ రాణించడంతో భారత్ సునాయాసంగా గెలిచింది.వన్డేల్లో భారత్‌పై దక్షిణాఫ్రికాకు ఇదే (99) అత్యల్ప స్కోరు. 1999లో చేసిన 117 స్కోరు రెండో స్థానానికి చేరింది.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా: 27.1 ఓవర్లలో 99 ఆలౌట్ (క్లాసెన్ 34; కుల్దీప్ 4/18, సిరాజ్ 2/17), భారత్: 19.1 ఓవర్లలో 105/3 (గిల్ 49).