భారత్, ఇంగ్లండ్ వన్డే పోరు వార్ వన్‌సైడ్ అన్నట్లు మొదలైంది. టీ20 సిరీస్ గెలుపు జోరును కొనసాగిస్తూ ఇంగ్లండ్‌ను టీమ్ఇండియా చిత్తుచిత్తుగా ఓడించింది. జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లిష్ బ్యాటర్ల భరతం పట్టాడు. పదునైన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించాడు. రాయ్ క్లీన్‌బౌల్డ్‌తో మొదలైన బుమ్రా వికెట్ల జోరు కార్స్‌తో ముగిసింది. ఆరు వికెట్లతో బుమ్రా తన కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడితే షమీ కీలక వికెట్లు పడగొట్టడంతో బట్లర్ గ్యాంగ్ స్వల్ప స్కోరుకే చాపచుట్టేసింది. ఓపెనింగ్ ద్వయం రోహిత్‌శర్మ, ధవన్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించి భారత్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టారు.
లండన్: ఇంగ్లండ్‌తో తొలి వన్డే పోరులో భారత్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ జోరు దిగ్విజయంగా కొనసాగిస్తూ ఇంగ్లండ్‌కు పట్టపగలే చుక్కలు చూపించారు. మంగళవారం పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో(188 బంతులు మిగిలుండగానే) భారీ విజయం సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్..ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. నాయకుని నమ్మకాన్ని నిలబెడుతూ టీమ్ఇండియా బౌలర్లు పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. బుమ్రా(6/19) రికార్డు ప్రదర్శనకు తోడు షమీ(3/31) రాణింపుతో ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బట్లర్(30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన భారత్..రోహిత్‌శర్మ(58 బంతుల్లో 76 నాటౌట్, 7ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు ధవన్(31 నాటౌట్)రాణింపుతో 18.4 ఓవర్లలో 114 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గడ్డపై ఆరు వికెట్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య గురువారం లార్డ్స్ వేదికగా రెండో వన్డే జరుగుతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ఇండియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో నిలిచింది.
బుమ్రా సిక్సర్:
ఇంగ్లండ్‌పై స్పీడ్‌స్టర్ బుమ్రా వీరవిహారం చేశాడు. తాను ఎంత ప్రమాదకర బౌలరో మరోమారు రుచిచూపిస్తూ ఆది నుంచే వికెట్ల వేట కొనసాగించాడు. తన తొలి ఓవర్లోనే రాయ్(0), రూట్(0)ను బుమ్రా పెవిలియన్ పంపాడు. ఇన్‌స్వింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన రాయ్ క్లీన్‌బౌల్డ్ అయితే..బుల్లెట్లా దూసుకొచ్చిన బంతిని ఆడటంలో విఫలమైన రూట్..పంత్ క్యాచ్‌తో నిష్క్రమించాడు. మరో ఎండ్‌లో షమీ కూడా జత కలువడంతో ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. స్టోక్స్(0), బెయిర్‌స్టో(7), లివింగ్‌స్టోన్(0) ఇలా వచ్చి అలా వెళ్లారు. మధ్యలో బట్లర్, మొయిన్ అలీ(14) కుదురుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. అలీని ప్రసిద్ధ్ కృష్ణ(1/26) రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేశాడు. బుమ్రా, షమీ ధాటికి ఒక దశలో ఇంగ్లండ్ 68 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ తరుణంలో విల్లే(21), కార్స్(15) తొమ్మిదో వికెట్‌కు 35 పరుగులు జోడించి ఇంగ్లండ్ పరువు కాపాడారు. మరోమారు బౌలింగ్‌కు దిగిన బుమ్రా..విల్లే, కార్స్‌ను ఔట్ చేసి ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
ఆసియా అవతల వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా బుమ్రా (6/19) నిలిచాడు. గతంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెహ్రా (6/23) ఇప్పటి వరకు అత్యుత్తమం
ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై వన్డేల్లో ఆరు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.
వన్డేల్లో భారత్‌పై ఇంగ్లండ్‌కు ఇది అత్యల్ప స్కోరు(110). 2006లో జైపూర్ వన్డేలో 125 స్కోరు ఇప్పటి వరకు ఇంగ్లండ్ తక్కువ స్కోరు.
రోహిత్ ధనాధన్
స్వల్ప లక్ష్యఛేదనలో రోహిత్, ధవన్ అదరగొట్టారు. ముఖ్యంగా రోహిత్..ఇంగ్లండ్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ తన ఇన్నింగ్స్‌లో ఐదు భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు ఘోరంగా తడబడ్డ పిచ్‌పై హిట్‌మ్యాన్ పరుగుల వరద పారించాడు. బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో ధవన్ ధాటిగా ఆడటంలో ఒకింత తడబడినా.. ఆ తర్వాత తేరుకుని పోటీలోకి వచ్చాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు అజేయంగా 114 పరుగులు జోడించి భారీ విజయాన్ని కట్టబెట్టారు. స్టార్ బ్యాటర్ కోహ్లీ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 25.2 ఓవర్లలో 110 ఆలౌట్(బట్లర్ 30, విల్లే 21, బుమ్రా 6/19, షమీ 3/31), భారత్: 18.4 ఓవర్లలో 114 (రోహిత్ 76 నాటౌట్, ధవన్ 31 నాటౌట్)