అరంగేట్రం మహిళల అండర్-19 ఆసియాకప్‌లో యువ భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా సాగిన ఆఖరి పోరులో భారత్..బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష అర్ధసెంచరీతో చెలరేగిన వేళ.. పోరాడే స్కోరు అందుకున్న టీ మ్ఇండియా.. ఆయూశి, సోనమ్, పరునిక స్పిన్ తంత్రంతో బంగ్లాను కుప్పకూల్చింది. ఇటీవలే ఇదే ఆసియాకప్ అండర్-19 ఫైనల్లో బంగ్లా చేతిలో భారత కుర్రాళ్లకు ఎదురైన పరాజయానికి అమ్మాయిలు ప్రతీకారం తీర్చుకున్నట్లయ్యింది.
U-19 Asia Cup | కౌలాలంపూర్: అండర్-19 మహిళల ఆసియాకప్ టోర్నీలో యువ భారత్ కప్ కొట్టేసింది. తొలిసారి ప్రవేశపెట్టిన టోర్నీలో టైటిల్‌ను ఒడిసిపట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో యువ భారత్ 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లా..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ గొంగడి త్రిష(47 బంతుల్లో 52, 5ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు మిథిలా వినోద్(17) ఆకట్టుకోవడంతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 117/7 స్కోరు చేసింది. ఫర్జానా ఇసామిన్(4/31) నాలుగు వికెట్లతో విజృంభించింది.
ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా 18.3 ఓవర్లలో 76 పరుగులకు కుప్పకూలింది. స్పిన్నర్లు ఆయూశీ శుక్లా(3/17), పరుని సిసోడియా(2/12), సోనమ్యాదవ్(2/13) స్పిన్ మాయాజాలంతో బంగ్లా పతనాన్ని శాసించారు. వీరి స్పిన్ ధాటికి బంగ్లా జట్టులో ఫిర్దోస్(22), ఫహిమిద(18) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు. ఛేదనలో ఒకానొక దశలో బంగ్లా 7 ఓవర్లకు 44/2 స్కోరుతో మెరుగ్గా కనిపించిన బంగ్లా..భారత స్పిన్నర్ల విజృంభణతో 32 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లు కోల్పోయి ఓటమి వైపు నిలిచింది. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన త్రిషకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
తెలంగాణ యువ బ్యాటర్ త్రిష అదరగొట్టింది. ఓపెనర్‌గా దిగిన త్రిష..టోర్నీలో సూపర్ ఫామ్ కొనసాగిస్తూ ఫైనల్లో విజృంభించింది. జట్టు స్కోరు 23 పరుగులకే ఓపెనర్ కమలిని(5) వికెట్ కోల్పోయిన భారత్‌ను ఈ యువ హైదరాబాదీ బ్యాటర్ కాపాడింది. ఫర్జానా పేస్ ధాటికి సహచర ప్లేయర్లు వరుసగా పెవిలియన్ చేరుతున్నా..ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఇన్నింగ్స్‌ను గాడిలో పడేసింది. సనికా చాల్కె(0) డకౌట్‌గా వెనుదిరుగగా, కెప్టెన్ నికీ ప్రసాద్(12)తో కలిసి నాలుగో వికెట్‌కు 41 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో తన ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, రెండు భారీ సిక్స్‌లలో అలరించింది. త్రిష..మినహా జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోవడంతో టీమ్ 117/7 స్కోరుకు పరిమితమైంది.
భారత్: 20 ఓవర్లలో 117/7(త్రిష 52, మిథిల 17, ఫర్జానా 4/31, నిశిత 2/23), బంగ్లాదేశ్: 18.3 ఓవర్లలో 76 ఆలౌట్(ఫిర్దోస్ 22, ఫహోమిద 18, ఆయూశి 3/17, పరునిక 2/12)