Gambhir vs Curator : ఓవల్ మైదానంలో భారత కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) పిచ్ క్యురేటర్‌తో గొడవపడిన విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడానికి కారణం ఏంటనేది బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ (Sitanshu Kotak) వివరించాడు. క్యురేటర్‌కు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఆయన అసలు ఏం జరిగిందో చెప్పాడు.
‘మంగళవారం మా జట్టు నెట్స్‌లో సాధన చేస్తోంది. అప్పుడే మా దగ్గరికి వచ్చిన చీఫ్ క్యురేటర్ లీ ఫొర్టిస్.. మీరు వికెట్‌కు 2.5మీటర్ల దూరంలో ఉండాలని చెప్పాడు. తాడుకు అవతలివైపు నుంచి వికెట్ చూడండని అన్నాడు. ఏ దేశంలోనూ ఇలా ఎవరూ అనడం నేను చూడలేదు. ఫొర్టిస్ మాటలతో చిర్రెత్తుకొచ్చిన గంభీర్ మేము ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాం.. నువ్వు నీ హద్దుల్లో ఉండు అని బదులిచ్చాడు. అయినా సరే ఫొర్టిస్ ఆగలేదు. నేను మీపై ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. అప్పుడు గౌతీ నువ్వు మాకు ఏం చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. మాకు అన్నీ తెలుసు. ఎవరికి ఫిర్యాదు చేసుకుంటావో చేసుకో అని గట్టిగానే అతడికి చెప్పాడు’ అని కొటాక్ జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించాడు.
Gautam Gambhir was right!
He’s India’s head coach, not someone a groundsman can disrespect. In England, casual racism runs deep where even helpers often look down on Indians. Sometimes, it’s not about humility, it’s about putting them in their place.pic.twitter.com/vNYgLReUGb
— Aryan Kochhar (@aryan_kochhar) July 29, 2025
అంతేకాదు నెట్స్‌లో ఉన్నప్పుడు తమ ఆటగాళ్లు స్పైక్స్ కాకుండా జాగింగ్ షూ వేసుకున్నారని.. అలాంటప్పుడు పిచ్ దెబ్బతినే అవకాశమే లేదని బ్యాటింగ్ కోచ్ తెలిపాడు. అయితే.. అంతకుముందు ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఏకంగా పిచ్ మధ్యలో నిల్చొని క్యురేటర్‌తో మాట్లాడిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తమకు ఎదురైన ఈ సంఘటనపై ఐసీసీకి ఫిర్యాదు చేయబోమని కొటాక్ అన్నారు.
మాంచెస్టర్ టెస్టు ఆఖరి రోజున జడ్డూ, సుందర్‌ల సెంచరీకి అడ్డుపడాలనుకున్న బెన్ స్టోక్స్ డ్రాకు ప్రతిపాదించాడు. రెండు సెషన్లలో ఇంగ్లండ్ ప్రధాన పేసర్లను దీటుగా ఎదుర్కొని వాళ్లు శతకానికి చేరువలో ఉన్నప్పుడు షేక్‌హ్యాండ్ ఇవ్వబోయి అభాసుపాలైన స్టోక్స్‌పై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఓవల్‌లో క్యురేటర్ భారత కోచ్, ఆటగాళ్లను వికెట్ దగ్గరికి రావొద్దని హెచ్చరించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత క్రికెటర్లు మండిపడుతున్నారు. ఇరుజట్ల మధ్య జూలై 31 గురువారం నుంచి ఐదో టెస్టు జరుగనుంది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీగా పేరు మార్చి తొలిసారి నిర్వహిస్తున్న సిరీస్‌లో1-2తో వెనకబడిన గిల్ సేన.. విజయం సాధిస్తేనే సమం చేయగలదు. అదే ఇంగ్లండ్ డ్రా చేసుకున్నా సరే ట్రోఫీని తన్నుకుపోతుంది.