దంబుల్లా(శ్రీలంక): ఆసియాకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ మరోపోరుకు సిద్ధమైంది. ఆదివారం తమ రెండో మ్యాచ్‌లో యూఏఈతో టీమ్ఇండియా తలపడనుంది. ఇప్పటికే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారీ విజయం సాధించి జోరుమీదున్న హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్సీలోని భారత్..యూఏఈపై గెలిచి సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకోవాలని చూస్తున్నది.
పాయింట్ల పట్టికలో 2.29 రన్‌రేట్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్ఇండియా..యూఏఈపై గెలిస్తే సెమీస్‌లోకి దాదాపు అడుగుపెట్టినట్లే. పాక్‌తో మ్యాచ్‌లో దీప్తిశర్మ, స్మృతి మంధాన, రేణుకా సింగ్, షెఫాలీవర్మ మెరుగ్గా రాణించారు. లక్ష్యఛేదనలో వర్మ, మంధాన మెరుగైన శుభారంభం అందించారు. పాక్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ అలవోకగా పరుగులు సాధించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భావిస్తున్న ఆసియాకప్‌లో తిరిగి టైటిల్ నిలబెట్టుకునేందుకు భారత్ తహతహలాడుతున్నది.