ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. మెగాటోర్నీలో ఓటమి ఎరుగని భారత్, న్యూజిలాండ్ ఆదివారం దుబాయ్‌లో తలపడబోతున్నాయి. వరుస విజయాలతో జోరు మీదున్న ఇరు జట్లు అదే ఊపులో గ్రూపులో అగ్రస్థానం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌పై విజయాలతో టీమ్ఇండియా జోరుమీదుంటే..కివీస్ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతున్నది. స్పిన్ సమరంగా భావిస్తున్న మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అనేది ఆసక్తికరంగా మారింది. కీలకమైన సెమీస్‌కు ముందు తుది కూర్పుపై ఈ మ్యాచ్ ద్వారా రెండు జట్లు అంచనాకు వచ్చే అవకాశముంది. రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తున్నది. దాయాది పాకిస్థాన్‌పై సూపర్ సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ..కివీస్‌తో పోరు ద్వారా వన్డేల్లో 300వ మ్యాచ్ ఆడబోతున్నాడు.
Champions Trophy | దుబాయ్: క్రికెట్ అభిమానులను ఆదివారం అలరించనుంది. చాంపియన్స్ ట్రోఫీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. వరుస విజయాలతో మంచి జోరుమీదున్న ఈ రెండు జట్లు తమదైన వ్యూహాలతో బరిలోకి దిగబోతున్నాయి. రోజు తేడాతో జరిగే కీలకమైన సెమీఫైనల్ పోరుకు ముందు తమ అస్త్రశస్ర్తాలను పరిశీలించుకునేందుకు ఈ మ్యాచ్‌ను వాడుకోనున్నారు.
ముఖ్యంగా స్పిన్‌కు సహకరిస్తున్న దుబాయ్ పిచ్‌పై రెండు జట్లకు చెందిన స్పిన్నర్లు…బ్యాటర్లను ఇబ్బందులు పెట్టే అవకాశముంది. ఇటీవలి కాలంలో టీమ్ఇండియాకు న్యూజిలాండ్ కొరకరాని కొయ్యగా మారింది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్‌ను భారత్‌లోనే ఓడించిన కివీస్ దీటైన సవాలు విసురుతున్నది. బలబలాల పరంగా సమవుజ్జీలుగా కనిపిస్తున్న టీమ్ఇండియా, కివీస్ మధ్య పోరు అభిమానులకు పసందైన విందు అందించనుంది. ఇదిలా ఉంటే దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతున్న టీమ్ఇండియా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడింది.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే అందరి కండ్లు ఉన్నాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై సూపర్ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ..కివీస్‌తో పోరులోనూ అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. తనదైన రోజున ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని కోహ్లీ పరుగుల వరద పారించడంలో ముందుంటాడు. పాక్‌తో మ్యాచ్‌లోనే ఇది రుజువైంది. అప్పటి వరకు ఫామ్‌లేమితో ఇబ్బందిపడ్డ కోహ్లీ..ఆఫ్రిదీ, రవూఫ్, నసిమ్షాను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు కొల్లగొట్టాడు. కివీస్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయంగా 300వ వన్డే ఆడబోతున్న కోహ్లీకి ఇది ప్రత్యేకం కానుంది. ఇదిలా ఉంటే కీలకమైన సెమీస్ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా పలువురు ప్లేయర్లకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ రోహిత్‌శర్మ, సీనియర్ పేసర్ షమీని తప్పిస్తే..రిషబ్ పంత్, అర్ష్‌దీప్‌సింగ్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్యాదవ్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చాన్స్ దొరకవచ్చు. ఇదే జరిగితే తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారవచ్చు.
కీలకమైన చాంపియన్స్ ట్రోఫీకి ముందు నుంచి కివీస్ తమదైన జోరు కనబరుస్తున్నది. ముక్కోణపు సిరీస్ గెలిచిన కివీస్ అదే ఊపులో చాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతున్నది. తమ తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌కు చెక్ పెట్టిన కివీస్..మలి పోరులో బంగ్లా దంచేశారు. టీమ్ఇండియాతో పోరులో కివీస్ స్పిన్నర్లు సాంట్నర్, బ్రాస్‌వెల్ కీలకం కానున్నారు. రచిన్ రవీంద్ర, యంగ్, లాథమ్, కాన్వె ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసిరానుంది.
300 కివీస్‌తో మ్యాచ్ ద్వారా కోహ్లీ 300వ అంతర్జాతీయ వన్డేల మైలురాయిని చేరుకోనున్నాడు.
భారత్: రోహిత్(కెప్టెన్), గిల్, కోహ్లీ, అయ్యర్, పంత్, హార్దిక్, జడేజా, సుందర్, రానా, కుల్దీప్/వరుణ్, షమీ/అర్ష్‌దీప్.
న్యూజిలాండ్: కాన్వె, రవీంద్ర, విలియమ్సన్, మిచెల్, లాథమ్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, సాంట్నర్, జెమీసన్, హెన్రీ, రూర్కీ.