Ind Vs NZ | పూణె: న్యూజిలాండ్‌తో ఇటీవలే బెంగళూరులో ముగిసిన తొలి టెస్టులో అనూహ్య ఓటమిని ఎదుర్కున్న టీమ్ఇండియా.. గురువారం నుంచి పుణెలో మొదలయ్యే రెండో టెస్టును గెలిచి సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌట్ అయినా రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్నట్టే కనిపించిన రోహిత్ సేన మరోసారి కివీస్ పేసర్లకు దాసోహమై భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఈ నేపథ్యంలో ‘చిన్నస్వామి’కి భిన్నంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) పిచ్ ఉండనున్నట్టు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో పేస్ పిచ్‌లు తయారుచేయించుకుని పప్పులో కాలేసిన భారత్.. పుణెలో మాత్రం సంప్రదాయ స్పిన్ పిచ్‌పై కివీస్‌ను తిప్పేసేందుకు సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ సన్నాహకాల్లో ఉన్న మెన్ ఇన్ బ్లూ.. ప్రయోగాలకు ఫుల్స్టాప్ పెట్టి సిరీస్‌ను 2-1తో గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు 36 ఏండ్ల తర్వాత భారత్‌లో భారత్‌ను టెస్టు మ్యాచ్‌లో ఓడించిన న్యూజిలాండ్.. పుణెలో గెలిచి సిరీస్‌ను ఇక్కడే పట్టేయాలని తహతహలాడుతోంది.
సెలక్షన్ తిప్పలు!
రెండో టెస్టులో రోహిత్ సేనకు సెలక్షన్ తిప్పలు తప్పేలా లేవు. మెడ కండరాల గాయంతో బెంగళూరు టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్ రెండో టెస్టుకు ఫిట్‌గా ఉండనున్నాడు. దీంతో మిడిలార్డర్లో కేఎల్ రాహుల్ లేదా సర్ఫరాజ్ ఖాన్‌లో ఎవరో ఒకరిపై వేటు పడనుంది. ఇరానీ కప్‌లో ద్విశతకం, తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మేటి ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్ జోరుమీదున్నాడు. కానీ రాహుల్ మాత్రం బంగ్లా సిరీస్‌తో పాటు బెంగళూరు టెస్టులోనూ విఫలమవడంతో అతడిని పక్కనబెట్టాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ హెడ్‌కోచ్ గంభీర్ మాత్రం రాహుల్‌కు తమ మద్దతు ఉంటుందని చెప్పడంతో సర్ఫరాజ్‌పై వేటు పడనుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక గత టెస్టులో విఫలమైన జైస్వాల్ ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝుళిపించాలని భారత్ కోరుకుంటోంది. ఈ ఏడాది తొలి అర్ధ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ కూడా భారీ ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నారు. ఐదేండ్ల క్రితం ఇక్కడ సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో కోహ్లీ 254 పరుగులతో అజేయంగా నిలిచి ఈ ఫార్మాట్లో తన అత్యుత్తమ స్కోరును నమోదుచేయగా తాజాగా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. పిచ్ స్పిన్‌కు అనుకూలించనుండటంతో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో భారత్ బరిలోకి దిగే అవకాశముంది. సిరాజ్ స్థానంలో ఆకాశ్ దీప్‌ను ఆడించనున్నట్టు తెలుస్తోంది.
జోరుమీదున్న కివీస్: బెంగళూరు టెస్టు ఇచ్చిన విజయంతో జోరుమీదున్న న్యూజిలాండ్.. స్పిన్‌కు స్వర్గధామమైన పుణెలో భారత్‌ను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ లేకున్నా డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిఫ్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్ వంటి నాణ్యమైన ఆటగాళ్లు కివీస్ సొంతం. స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కావడంతో మిచెల్ శాంట్నర్‌ను మ్యాచ్ ఆడించే ఆలోచనలో ఆ జట్టు ఉంది. శాంట్నర్, అజాజ్ పటేల్‌తో పాటు రచిన్, ఫిలిప్స్ భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు. భారత్‌లో ఇంతవరకూ టెస్టు సిరీస్ గెలవని కివీస్.. పుణెలో అద్భుతం చేస్తే సరికొత్త చరిత్ర సృష్టించినట్టే!
తుది జట్లు (అంచనా)