ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టుకు తెరలేవనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకంజలో ఉన్న టీమ్ఇండియా.. గెలిస్తేనే నిలిచే పరిస్థితిని ఎదుర్కొంటున్నది. లార్డ్స్ టెస్టులో పోరాడి ఓడిన గిల్‌సేన.. మాంచెస్టర్‌లో ఏండ్లుగా ఊరిస్తున్న విజయాన్ని ఒడిసిపట్టుకోవాలని చూస్తున్నది. ఓవైపు గాయాలు వేధిస్తున్న వేళ తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. స్టార్ పేసర్ బుమ్రా బరిలోకి దిగేది ఖరారు కాగా, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ పూర్తిగా కోలుకోవడం టీమ్ఇండియాకు గొప్ప ఉపశమనంగా మారాయి. అడ్డంకులను అధిగమిస్తూ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను సమం చేస్తుందా లేక కోల్పోతుందా అన్నది ఆసక్తికరం. లార్డ్స్ టెస్టు విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో ఉన్న ఇంగ్లండ్ అదే జోష్‌తో భారత్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నది.
మాంచెస్టర్: ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మరో పోరుకు సమయం ఆసన్నమైంది. బుధవారం నుంచి భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్టులో తలపడనున్నాయి. టెస్టు ఫార్మాట్ గొప్పతనాన్ని చాటుతూ, అభిమానులను మునివేళ్లపై నిలబెడుతూ ఇరు జట్లు సిరీస్‌లో హోరాహోరీగా తలపడుతున్నాయి. లార్డ్స్ టెస్టులో విజయం కోసం టీమ్ఇండియా కడదాకా పోరాడి ఓడితే తమకు అచ్చొచ్చిన మైదానంలో ఇంగ్లండ్ చారిత్రక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక తమకు పెట్టని కోటగా భావించే ఓల్డ్ ట్రాఫోర్డ్లోనూ ఇంగ్లండ్ విజయపతాక ఎగురవేయాలని చూస్తున్నది. గాయపడ్డ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్‌ను తీసుకున్న ఇంగ్లండ్ ఇప్పటికే తుది జట్టును ప్రకటించి ఒకింత పైచేయిలో ఉన్నది. మరోవైపు సిరీస్‌లో 1-2తో వెనుకంజలో ఉన్న టీమ్ఇండియాను ప్లేయర్ల గాయాలు వేధిస్తున్నాయి. ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే సిరీస్‌కు దూరం కాగా, గజ్జల్లో గాయంతో ఆకాశ్‌దీప్, చేతి గాయంతో అర్ష్‌దీప్‌సింగ్ నాలుగో టెస్టు నుంచి నిష్ర్కమించారు. వీరి గైర్హాజరీలో యువ పేసర్ అన్శుల్ కంబోజ్ జట్టుకు ఎంపిక కాగా, తుది జట్టు ఎలా ఉండబోతున్నది అనేది అందరి మెదళ్లను తొలుస్తున్నది.
అన్శుల్ అరంగేట్రం!
యువ పేసర్ అన్శుల్ అరేంగేట్రం ఖాయంగా కనిపిస్తున్నది. గాయంతో ఆకాశ్‌దీప్..నాలుగో టెస్టుకు ఫిట్నెస్ పరీక్షలో ఫెయిల్ కాగా, దేశవాళీతో పాటు ఇటీవల భారత్ ‘ఏ’ తరపున ఆకట్టుకున్న ఆన్శుల్ తుది జట్టుకు ఆడే అంచనాలు బలంగా ఉన్నాయి. రెండు రోజుల క్రితమే జట్టుతో కలిసిన ఈ 24 ఏండ్ల హర్యానా పేసర్…అటు చీఫ్ కోచ్ గౌతం గంభీర్‌తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌ను ఆకట్టుకున్నాడు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేసే సామర్థ్యంతో పాటు లోయార్డర్‌లో ఉపయుక్తమైన బ్యాటింగ్ అన్శుల్కు అదనపు బలం కానుంది. ఇదిలా ఉంటే పేస్ దళానికి బుమ్రా, సిరాజ్ నాయకత్వం వహించనుండగా, ఆల్‌రౌండర్ నితీశ్ స్థానంలో శార్దుల్ ఠాకూర్ లేదా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
ఒక వేళ శార్దుల్‌ను తీసుకుంటే జడేజా, వాషింగ్టన్ సుందర్ రూపంలో టీమ్ఇండియా బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నది. ఇక టాపార్డర్ విషయానికొస్తే ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్ ఖాయం కాగా, వరుసగా విఫలమవుతూ వస్తున్న కరణ్ నాయర్‌కు మరో అవకాశమిస్తారా లేక సాయి సుదర్శన్‌ను తీసుకుంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కరణ్‌ను కొనసాగించాలంటే సుదర్శన్ మరోమారు బెంచ్‌కు పరిమితం కాక తప్పదు. ఆరంభాలను భారీ స్కోర్లుగా మలువడంలో విఫలమవుతున్న నాయర్ రీఎంట్రీ ఆశించిన స్థాయిలో లేకపోవడం మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది. మిడిలార్డర్లో కెప్టెన్ గిల్‌కు తోడు పంత్, జడేజా సూపర్ ఫామ్‌మీద ఉండటం టీమ్ఇండియాకు కొండంత బలం కానుంది. ముగిసిన మూడు టెస్టుల్లో 600కు పైగా పరుగులతో కొనసాగుతున్న గిల్‌తో పాటు పంత్, జడేజా బ్యాట్లు ఝులిపిస్తే భారత్‌కు తిరుగుండకపోవచ్చు.
డాసన్ రీఎంట్రీ:
గాయపడ్డ షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్‌ను ఇంగ్లండ్ తమ తుది జట్టులోకి తీసుకుంది. దాదాపు ఏడేండ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన డాసన్ ఏకైక స్పిన్నర్‌గా కొనసాగనున్నాడు. బజ్‌బాల్ ఎరాలో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ముందుగానే తుది జట్టును ప్రకటిస్తున్న ఇంగ్లండ్..పెద్దగా మార్పులేమి లేకుండానే బరిలోకి దిగుతున్నది. జాక్ క్రాలీ, డకెట్, ఒలీపోప్ ఫామ్ కలవరపెడుతున్నా..రూట్,బ్రూక్, స్మిత్ రాణించడంతో ఇంగ్లండ్‌కు ఇబ్బందులు ఎదురు కావడం లేదు. కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అటు బ్యాటింగ్‌కు తోడు బౌలింగ్‌లో జట్టుకు కీలకంగా మారుతున్నాడు. ఆర్చర్ చేరికతో పేస్ దళం పదునెక్కగా, క్రిస్ వోక్స్, బ్రెండన్ కార్స్ మంచి టచ్‌లో ఉన్నారు. మాంచెస్టర్‌లో ఇప్పటి వరకు భారత్ 9 టెస్టులాడితే నాలుగింటిలో ఓడి, ఐదు మ్యాచ్‌లు డ్రా చేసుకుంది.
తుది జట్ల అంచనా:
భారత్: గిల్(కెప్టెన్), జైస్వాల్, రాహుల్, కరణ్-సుదర్శన్, పంత్, జడేజా, శార్దుల్-కుల్దీప్, సుందర్, బుమ్రా, సిరాజ్, అన్శుల్.
ఇంగ్లండ్: స్టోక్స్(కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్మిత్, డాసన్, వోక్స్, కార్స్, ఆర్చర్
పిచ్, వాతావరణం:
సాధారణంగా లండన్‌తో పోలిస్తే మాంచెస్టర్‌లో వాతావరణం చల్లగా ఉంటుంది. దీనికి తోడు వాతావరణ విభాగం అంచనాల ప్రకారం మ్యాచ్ జరిగే ఐదు రోజులు చిరుజల్లులు పడే అవకాశముంది. పిచ్ పేసర్లకు సహకరించనుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే చాన్స్ ఉంది.