Team India | రాజ్‌కోట్ : కుర్రాళ్ల అదిరిపోయే ప్రదర్శనలతో పటిష్టమైన ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తూ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే 2-0తో నిలిచిన యువ భారత జట్టు.. మంగళవారం మరో కీలక మ్యాచ్ ఆడనుంది. రాజ్‌కోట్ వేదికగా బట్లర్ సేనతో జరుగబోయే మూడో టీ20లో గెలిచి సిరీస్‌ను ఇక్కడే పట్టేయాలని టీమ్ఇండియా ఉవ్విళ్లూరుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ప్రత్యర్థి కంటే మెరుగైన ప్రదర్శనలు చేస్తూ సిరీస్ ఆధిక్యంలో నిలిచిన యువ భారత్.. రాజ్‌కోట్‌లోనూ అదే ఊపును కొనసాగించాలనే వ్యూహంతో బరిలోకి దిగనుంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌లలోనూ ఓడిన ఇంగ్లీష్ జట్టు.. మూడో టీ20లో అయినా పుంజుకుని సిరీస్ ఆశలు నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో నిరంజన్ షా స్టేడియంలో అభిమానులను మరో ధనాధన్ పోరు ఉర్రూతలూగించడం ఖాయం!
గతేడాది రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత జట్టు పగ్గాలను అందుకున్న సూర్య.. కెప్టెన్ అయ్యాక స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. సారథిగా జట్టుకు వరుస విజయాలను అందిస్తున్నా.. వ్యక్తిగతంగా అతడి ఫామ్ మాత్రం ఆందోళనకరంగా ఉంది. గత 17 ఇన్నింగ్స్‌లలో సూర్య.. 26.81 సగటుతో 429 పరుగులే చేశాడు. సూర్య కెరీర్లో ఇదే అత్యల్ప సగటు. తన కెరీర్ ఆరంభ ఏడాది (2021)లో కూడా అతడి సగటు 35గా నమోదు కాగా ఆ తర్వాత రెండేండ్లలో 45+గా ఉంది. గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో చేసిన హాఫ్ సెంచరీ తర్వాత అతడు మళ్లీ 30 పరుగుల మార్కును కూడా అందుకోలేదు. ఈ సిరీస్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన సూర్య.. చెన్నై మ్యాచ్‌లో 12 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో పరుగుల వరద పారే రాజ్‌కోట్‌లో అయినా మునపటి ఫామ్‌ను సంతరించుకోవాలని భారత్ ఆశిస్తోంది. సౌతాఫ్రికా సిరీస్‌లో వరుస సెంచరీలతో దుమ్మురేపిన సంజూ శాంసన్.. ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌లలోనూ షార్ట్ బాల్స్‌కు ఔట్ అయ్యాడు. రాజ్‌కోట్‌లో అతడు విజృంభిస్తే భారత్‌కు శుభారంభం దక్కడం ఖాయం. అభిషేక్ శర్మ, గత మ్యాచ్ హీరో తిలక్ వర్మ మంచి టచ్‌లో ఉన్నారు. రింకూ, నితీశ్ గాయాలతో దూరం కాగా, ఈ మ్యాచ్‌లో శివమ్ దూబే, రమణ్‌దీప్ సింగ్‌ను ఆడించే అవకాశాలున్నాయి.
జట్టు నిండా స్టార్లు, హిట్టర్లు ఉన్నప్పటికీ ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమవుతున్నారు. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్ వంటి హిట్టర్లంతా తేలిపోతున్నారు. రాజ్‌కోట్‌లో ఆ జట్టుకు తప్పనిసరి గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లోనూ ఓడితే ఇంగ్లీష్ జట్టు సిరీస్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. ఆర్చర్, వుడ్, రషీద్ వంటి మేటి బౌలర్లు భారత కుర్రాళ్లను అడ్డుకోలేకపోతున్నారు. అన్ని రంగాలలో ఇబ్బందిపడుతున్న బట్లర్ గ్యాంగ్.. రాజ్‌కోట్‌లో ఏ మేరుకు రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.4
రాజ్‌కోట్‌లో భారత్ ఆడిన ఐదు టీ20ల్లో నాలుగింటిలో గెలిచింది. గత రెండు పర్యాయాలు 80 పరుగుల తేడాతో విజయం సాధించింది.
భారత్: శాంసన్, అభిషేక్, తిలక్‌వర్మ, సూర్యకుమార్(కెప్టెన్), హార్దిక్, శివమ్, అక్షర్, సుందర్, బిష్ణోయ్, అర్ష్‌దీప్, చక్రవర్తి.
ఇంగ్లండ్: సాల్ట్, డకెట్, బట్లర్(కెప్టెన్), బ్రూక్, లివింగ్‌స్టోన్, స్మిత్, ఓవర్టన్, కార్స్, ఆర్చర్, వుడ్, రషీద్.