సొంతగడ్డపై జరుగుతున్న సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా దంచి కొడుతుందనుకుంటే.. బజ్‌బాల్‌తో కౌంటర్ ఇచ్చిన ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ఉప్పల్‌లో సత్తాచాటలేకపోయిన రోహిత్ సేన విశాఖలోనైనా ఇంగ్లిష్ టీమ్ జోరుకు పగ్గాలేసేందుకు సిద్ధమైంది.
సిరీస్ ప్రారంభానికి ముందే షమీ దూరమయ్యాడు. కోహ్లీ తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. ఇప్పుడు రాహుల్, జడేజా కూడా గాయాల బారినపడ్డారు. ఇలాంటి స్థితిలో స్వీప్ షాట్లతో చెలరేగుతున్న స్టోక్స్ సేనను అడ్డుకోవాలంటే టీమ్ఇండియా అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే!
గత పర్యటనలో సైతం ఇంగ్లండ్ తొలి మ్యాచ్ గెలిచి సంబురపడ్డా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ మనవాళ్లు ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బిగించి ఉక్కిరి బిక్కిరి చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సారి ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరం. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమ్ ఇండియాకు ఎంపికైన సర్ఫరాజ్‌కు తుది జట్టులో చోటు అనుమానమే!
విశాఖపట్నం: సుదీర్ఘ ఫార్మాట్లో దంచికొట్టడమే పరమావధిగా చెలరేగిపోతున్న ఇంగ్లండ్.. అదే ‘బజ్‌బాల్’ ఆటతీరుతో ఉప్పల్‌లో టీమ్ఇండియాను కంగుతినిపించింది. తొలి రెండు రోజులు కనీసం పోటీలో లేని పర్యాటక జట్టు ఆ తర్వాత అసమాన పోరాటంతో మ్యాచ్‌ను విజయంతో ముగించింది. ఇప్పుడు ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని టీమ్ఇండియా కాచుకొని ఉంటే.. అదే జోరులో సిరీస్‌పై మరింత పట్టు సాధించాలని స్టోక్స్ సేన భావిస్తుంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి సాగర తీరం విశాఖలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోగా.. గత మ్యాచ్‌లో రాణించిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా గాయాలతో జట్టుకు దూరమయ్యారు. దీంతో టీమ్మేనేజ్మెంట్కు తుది జట్టు ఎంపిక కష్టంగా మారింది. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్తో పాటు మిడిలార్డర్లో రజత్ పాటిదార్ బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ.
దేశవాళీల్లో పరుగుల వరద పారించి టీమ్ఇండియాకు ఎంపికైన సర్ఫరాజ్ ఖాన్.. అవకాశం కోసం మరింత కాలం వేచి చూడాల్సి రావచ్చు. తొలి టెస్టులో స్వీప్ షాట్లతో భారత స్పిన్ యంత్రాన్ని ఛేదించిన ఇంగ్లండ్.. వైజాగ్‌లోనూ అదే అస్ర్తాన్ని ప్రయోగించాలని చూస్తుంటే.. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం దానికి తమ దగ్గర విరుగుడు ఉందని ధీమాగా ఉన్నాడు. ఇంగ్లండ్ జట్టు చివరిసారిగా భారత పర్యటనకు వచ్చిన సమయంలోనూ చెన్నైలో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించగా.. ఆ తర్వాత మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఇంటి ముఖం పట్టింది.
ఇప్పుడు కూడా అదే ఫలితం రావాలని అభిమానులు ఆశిస్తుంటే.. దూకుడే మంత్రంగా దూసుకెళ్తున్న స్టోక్స్ సేన.. భారత్‌కు ఆ అవకాశం ఇవ్వకూడదని చూస్తున్నది. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ గిల్, శ్రేయస్ అయ్యర్‌కు మరో అవకాశం దక్కడం లాంఛనమే. మరోవైపు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ స్థానంలో సూపర్ సీనియర్ అండర్సన్, లీచ్ ప్లేస్‌లో బషీర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
4 మరో నాలుగు వికెట్లు తీస్తే భారత్ నుంచి 500 టెస్టు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ రికార్డుల్లోకెక్కనున్నాడు. అనిల్ కుంబ్లే (619) ముందున్నాడు.
రోహిత్ శర్మ వైజాగ్‌లో ఆడిన చివరి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాదాడు. 2019లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో రోహిత్ 176, 127 పరుగులు చేశాడు.
తుది జట్లు : భారత్ (అంచనా): రోహిత్ (కెప్టెన్), యశస్వి, గిల్, శ్రేయస్, రజత్ పాటిదార్, అక్షర్, భరత్, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
ఇంగ్లండ్: స్టోక్స్ (కెప్టెన్), క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్‌స్టో, ఫోక్స్, రెహాన్, హార్ట్లీ, బషీర్, అండర్సన్.