భారత్ పోరాటం అద్భుతం, అనిర్వచనీయం! ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా పోరాడిన తీరు కలకాలం గుర్తుండిపోతుంది. స్కోరుబోర్డుపై కనీసం ఒక పరుగు చేరకముందే రెండు కీలక వికెట్లు కోల్పోయిన భారత్.. మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌కు మూడు చెరువుల నీళ్లు తాగించింది. గెలుపు ఆశలు వదులుకున్న వేళ కనీసం డ్రా అయినా చాలు అనుకున్న అభిమానుల ఆశలకు అనుగుణంగా తుదికంటా కొట్లాడింది. పోరాడితే పోయేదేమి లేదన్న తరహాలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ శతక విజృంభణతో మాంచెస్టర్ పరుగుల వానలో తడిసిముద్దయ్యింది. వికెట్ల కోసం విరామమెరుగకుండా దాడి చేసి అలసిపోయిన ఇంగ్లండ్ డ్రా కోసం చేతులు కలిపే పరిస్థితి తీసుకొచ్చింది. ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ గిల్, రాహుల్ బలమైన పునాది వేస్తే జడేజా, సుందర్ చారిత్రక ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌కు వన్నె తెచ్చారు. గిల్ నిష్క్రమణతో భారత్‌ను కట్టడి చేద్దామనుకున్న స్టోక్స్‌సేన ఆశలపై జడేజా, సుందర్ ద్వయం నీళ్లు గుమ్మరించింది. ఐదు రోజుల పాటు నువ్వానేనా అన్నట్లు సాగిన నాలుగో టెస్టు డ్రా కాగా, సిరీస్ మరింత రసవత్తరంగా మారింది.
మాంచెస్టర్: సుదీర్ఘ భారత క్రికెట్లో మరో మరుపురాని మ్యాచ్! ప్రత్యర్థి మనపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన వేళ పోరాటాన్ని అణువణువున నింపుకున్న టీమ్ఇండియా కొట్లాడిన తీరు మాటల కందనిది. సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ను గిల్, రాహుల్, జడేజా, సుందర్ ఒడ్డున పడేసిన తీరు అచిరకాలం గుర్తుండిపోతుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఆదివారం ముగిసిన నాలుగో టెస్టు డ్రా గా ముగిసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా 1-2తో వెనుకంజలో కొనసాగుతున్నది. తొలుత ఓవర్‌నైట్ స్కోరు 174/2తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమ్ఇండియా 143 ఓవర్లలో 425/4 స్కోరు చేసింది.
మాంచెస్టర్‌లో గత చరిత్రను తిరుగరాస్తూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(238 బంతుల్లో 103, 12ఫోర్లు) పాటు జడేజా(206 బంతుల్లో 101 నాటౌట్, 9ఫోర్లు, సిక్స్), సుందర్(185 బంతుల్లో 107 నాటౌట్, 13ఫోర్లు, సిక్స్) శతకాలతో విజృంభించారు. ఓపెనర్ కేఎల్ రాహుల్(90) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వోక్స్(2/67)కు రెండు వికెట్లు దక్కగా, ఆర్చర్, స్టోక్స్ ఒక్కో వికెట్ తీశారు. సెంచరీకి తోడు ఆరు వికెట్లు తీసిన స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈనెల 31 నుంచి ఓవల్ వేదికగా ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు జరుగనుంది.
మాంచెస్టర్ టెస్టులో భారత్ పోరాటాన్నే నమ్ముకుంది. కొండలా కనిపిస్తున్న పరుగుల భారాన్ని తమ భుజస్కంధాలపై మోస్తూ గిల్, రాహుల్, జడేజా, సుందర్ ఇంగ్లండ్ సిరీస్ గెలుపు ఆశలను వమ్ముచేశారు. ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ మొదలైన ఎనిమిది ఓవర్లకు రాహుల్ ఔట్ కావడంతో టీమ్ఇండియా శిబిరంలో ఆందోళన నెలకొన్నది. ఆర్చర్ బౌలింగ్‌లో రాహుల్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోవడంతో 10 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. దీంతో మూడో వికెట్‌కు 188 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.
పంత్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్..గిల్‌కు జతకలిశాడు. ఓవైపు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్న గిల్ ఈ సిరీస్‌లో మరో సెంచరీ ఖాతాలో వేసుకుని ఇంగ్లండ్‌కు దీటైన సవాలు విసిరాడు. సాఫీగా సాగుతున్న క్రమంలో ఆర్చర్ బౌలింగ్‌లో కీపర్ స్మిత్ క్యాచ్‌తో గిల్ ఔట్ కావడంతో మళ్లీ అభిమానుల్లో ఆందోళన పెరిగింది. ఓవైపు గాయంతో పంత్ ఆడేది అనుమానంగా మారగా, సుందర్, జడేజాలో ఏ ఒక్కరూ ఔటైనా మ్యాచ్ ఇంగ్లండ్ వశమైనట్లే. కానీ 223/4 స్కోరుతో లంచ్‌కు వెళ్లిన టీమ్ఇండియా మళ్లీ వెనుదిరిగి చూడలేదు. జడేజా, సుందర్ ద్వయం.. ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్ష పెట్టారు.
పిచ్‌పై పూర్తి అవగాహనకు వచ్చిన ఈ ఇద్దరు క్రీజులో నిలదొక్కుకోవడంతో టీ విరామ సమయానికి భారత్ 322/4తో మెరుగ్గా కనిపించింది. అప్పటికే 11 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియాను జడేజా, సుందర్ అద్భుతంగా నడిపించారు. ఆఖర్లో స్టోక్స్ డ్రా కోసం హ్యాండ్‌షేక్ ఇచ్చినా..సెంచరీలతో టెస్టుకు జడేజా, సుందర్ ఘనమైన ముగింపు ఇచ్చారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా రికార్డు స్థాయిలో 203 రన్స్ జోడించడం విశేషం.
1 ఒక సిరీస్‌లో నాలుగు భారత బ్యాటర్లు(గిల్, పంత్, రాహుల్, జడేజా) నాలుగు వందలకు పైగా స్కోర్లు చేయడం ఇది తొలిసారి.
1 సున్నా పరుగులకే 2 వికెట్లు కోల్పోయి మూడో వికెట్‌కు 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం టెస్టుల్లో భారత్‌కు ఇదే తొలిసారి.
4 ఒక సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో గిల్(నాలుగు సెంచరీలు)నిలిచాడు. గతంలో గవాస్కర్, కోహ్లీ నాలుగుసెంచరీలు చేశారు.
3 ఒక సిరీస్‌లో నాలుగు సెంచరీలు చేసిన మూడో కెప్టెన్‌గా గిల్ నిలిచాడు.
722 ఇంగ్లండ్‌తో సిరీస్‌లో గిల్ చేసిన పరుగులివి. గిల్ కంటే ముందు భారత్ తరఫున గవాస్కర్ వెస్టిండీస్‌పై 774, 732 పరుగులు చేశాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 358 ఆలౌట్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్, భారత్ రెండో ఇన్నింగ్స్: 425/4(జడేజా 107 నాటౌట్, గిల్ 103,సుందర్ 101 నాటౌట్, వోక్స్ 2/67, స్టోక్స్ 1/33)