మార్గవో: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య(సాఫ్) మహిళల టోర్నీకి వేళయైంది. మార్గవో(గోవా) వేదికగా మే 25 నుంచి జూన్ 6వ తేదీ వరకు టోర్నీ జరుగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం ఢాకా(బంగ్లాదేశ్)లో విడుదల చేశారు. టోర్నీలో మొత్తం ఆరు జట్లు బరిలో ఉన్నాయి. ఆతిథ్య భారత్ సహా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు పోటీపడుతున్నాయి. ప్రస్తుత ఫిఫా ర్యాంకింగ్స్‌ను అనుసరించి గ్రూపులను ప్రకటించారు. ఐదుసార్లు చాంపియన్ భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు గ్రూపు-బీలో ఉన్నాయి. టోర్నీలో రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌పై కన్నేసిన భారత మహిళల జట్టుకు డిఫెండింగ్ చాంపియన్ బంగ్లా నుంచి దీటైన పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2016 తర్వాత రెండోసారి ఆతిథ్యమిస్తున్న భారత్..మరోమారు టైటిల్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నది.