బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో భారత బ్యాటింగ్ పేలవ ప్రదర్శన పతాకస్థాయికి చేరుకుంది. ఇప్పటికే తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న టీమ్ఇండియా సిడ్నీ టెస్టులో మళ్లీ అదే సీన్ పునరావృతం చేసింది. ఆస్ట్రేలియా పేసర్ల ముప్పేట బౌలింగ్ ధాటికి మన బ్యాటింగ్ పేకమేడను తలపించింది. పచ్చికతో కళకళలాడుతున్న పిచ్‌పై బోలాండ్, స్టార్క్, కమిన్స్ సూపర్ స్వింగ్‌తో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విరాట్‌కోహ్లీ.. బోలాండ్ బౌలింగ్‌కు మరోమారు బలయ్యాడు. ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ బలహీనతకు గురవుతూ కోహ్లీ వికెట్ సమర్పించుకున్నాడు. టాపార్డర్ ఘోరంగా విఫలం కాగా, మిడిల్లో రిషబ్ పంత్, జడేజా పోరాట పటిమ కనబరిచారు. ఆసీస్ బౌలింగ్ ధాటికి పలుమార్లు గాయాలపాలైన పంత్ టాప్‌స్కోరర్‌గా నిలువగా, మెల్బోర్న్ సెంచరీ హీరో నితీశ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరుగడంతో 185 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్..ఖవాజ వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌శర్మ డగౌట్లో ముభావంగా కూర్చోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్‌లో సిడ్నీ పోరుకు శుక్రవారం తెరలేచింది. రోహిత్‌శర్మ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా వచ్చిన బుమ్రా..టాస్ గెలిచిన వెంటనే మరో ఆలోచన లేకుండానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇదే అదనుగా వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుంటూ ఆస్ట్రేలియా పేసర్లు ఆది నుంచే భారత్‌పై మెరుపుదాడికి దిగారు. పచ్చికతో ఉన్న పిచ్‌పై స్వింగ్ రాబడుతూ టీమ్ఇండియాను కోలుకోలేని దెబ్బతీశారు. స్కాట్ బోలాండ్(4-31), స్టార్క్(3-49), కమిన్స్(2-37)..టీమ్ఇండియా పతనంలో కీలకమయ్యారు. రిషబ్ పంత్(98 బంతుల్లో 40, 3ఫోర్లు, సిక్స్) టాప్‌స్కోరర్‌గా నిలువగా, జడేజా(95 బంతుల్లో 26, 3ఫోర్లు) ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ ఆట ముగిసే సరికి ఓపెనర్ ఖవాజ(2) వికెట్ కోల్పోయి 9 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న ఆసీస్ ప్రస్తుతం 176 పరుగుల వెనుకంజలో ఉన్నది. కెప్టెన్ బుమ్రా(1-7) ఒక వికెట్ తీశాడు.
పంత్, జడేజా పోరాటం : రోహిత్ స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్న బుమ్రా బ్యాటింగ్ వైపు మొగ్గుచూపాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టడంలో బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. సిరీస్‌లో ఒకింత నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న కేఎల్ రాహుల్(4) నిరాశపరిచాడు. తన వికెట్ విలువను గుర్తు ఎరుగకుండా స్టార్క్ బౌలింగ్‌లో కాన్స్టాస్కు క్యాచ్ ఇచ్చి మొదటి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రాహుల్‌ను అనుసరిస్తూ జైస్వాల్(10) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. బోలాండ్ బౌలింగ్‌లో అరంగేట్రం ప్లేయర్ వెబ్‌స్టర్ క్యాచ్‌తో ఔటయ్యాడు. దీంతో 17 పరుగులకే టీమ్ఇండియా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. రోహిత్‌కు బదులుగా జట్టులోకి వచ్చిన గిల్(20) నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు.
ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ రెండు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. కుదురుగా సాగుతున్న ఇన్నింగ్స్‌లో గిల్ ఔట్ రూపంలో కుదుపు ఏర్పడింది. లంచ్‌కు ముందు లియాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన గిల్..స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత విరాట్‌కోహ్లీ(69 బంతుల్లో 17) వంతైంది. సిరీస్‌లో తన బలహీనతను మరోమారు బయపెట్టుకుంటూ బోలాండ్ వేసిన స్వింగర్‌ను ఆడే ప్రయత్నంలో కోహ్లీ క్యాచ్ ఔటయ్యాడు. పెర్త్ టెస్టులో సెంచరీ మినహా పెద్దగా చెప్పుకోలేని స్కోర్లు చేసిన కోహ్లీ వికెట్‌కు ఉన్న విలువను గుర్తించలేకపోయాడు. ఈ తరుణంలో పంత్ అద్భుతమైన పోరాటపటిమ కనబరిచాడు. అప్పటికే 72 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును పంత్ ఒడ్డున పడేసే ప్రయత్నం చేశాడు. ఓవైపు ఆసీస్ బౌలింగ్ ధాటికి కాచుకుంటూ పలుమార్లు గాయపడ్డాడు. పంత్ చివరికి బోలాండ్కు వికెట్ ఇచ్చుకున్నాడు. దీంతో జడేజాతో ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మరుసటి బంతికే నితీశ్‌కుమార్(0) కూడా ఔట్ కావడంతో టీమ్ఇండియా కోలుకోలేకపోయింది. ఆఖర్లో బుమ్రా(22) బ్యాటు ఝులిపించినా లాభం లేకపోయింది.
బుమ్రా ఖాతాలో ఖవాజ : బీజీటీ సిరీస్‌లో ఖవాజ మరోమారు..బుమ్రా చేతికే చిక్కాడు. తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్ ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. బుమ్రా స్వింగ్‌కు తొలించిన ఖవాజ..స్లిప్‌లో రాహుల్ క్యాచ్‌తో ఔటయ్యాడు. దీంతో ఈ సిరీస్‌లో ఆరోసారి బుమ్రా బౌలింగ్‌లో ఖవాజ ఔటైనట్లు అయ్యింది. మరో ఎండ్‌లో కాన్స్టాస్(7) దూకుడుగా కనిపించాడు. కవ్వించే ప్రయత్నం చేసిన కాన్స్టాస్ను బుమ్రా తనదైన శైలిలో నిలువరించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 185 ఆలౌట్(పంత్ 40, జడేజా 26, బోలాండ్ 4-31, స్టార్క్ 3-49),
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 9-1(కాన్స్టాస్ 7 నాటౌట్, ఖవాజ 2, బుమ్రా 1-7)