Asian Games 2023 | వయసు పెరుగుతున్నా తన ఆటలో వన్నె తగ్గలేదని రోహన్ బోపన్న నిరూపించుకుంటే.. పడి లేవడం అంటే ఏంటో రుతూజా చేతల్లో చూపెట్టింది. ఫలితంగా టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది!
పెద్దగా అంచనాలు లేని స్కాష్ పురుషుల విభాగంలో భారత్ దుమ్మురేపగా..చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసిన మన కుర్రాళ్లు పసిడితో అదరగొట్టారు!
పక్షి కన్నుకు గురిపెట్టిన పార్థుడిలా.. మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడిలా.. మన షూటర్లు మరోమారు తడాఖా చూపారు..10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్‌లో సరబ్‌జ్యోత్-దివ్య జంట వెండి కాంతులు విరజిమ్మింది!
10 వేల మీటర్ల పరుగులో కార్తీక్ రజతం కైవసం చేసుకోగా.. గుల్వీర్ సింగ్ కంచు మోత మోగించాడు. ఫలితంగా ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల ఏడో రోజు భారత్ 5 పతకాలు ఖాతాలో వేసుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల జట్టు తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించగా.. టేబుల్ టెన్నిస్ (టీటీ)లో సుతీర్థ-ఐహిక జంట ప్రపంచ చాంపియన్లకు షాకిచ్చి సెమీస్‌లో అడుగుపెట్టింది. బాక్సింగ్‌లో మరో మూడు పతకాలు ఖాయం కాగా.. వెయిట్ లిఫ్టింగ్ భారత స్టార్ మీరాబాయి చానుకు నిరాశ ఎదురైంది. పురుషుల హాకీలో దాయాది పాకిస్థాన్‌పై టీమ్ఇండియా రికార్డు విజయం నమోదు చేసుకుంటే.. అథ్లెటిక్స్‌లో తెలంగాణ యువకెరటం అగసర నందిని హీట్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. నేటి నుంచి ఆర్చరీ ఈవెంట్ ప్రారంభం కానుండగా.. అథ్లెటిక్స్ పోటీలు జోరందుకోనున్నాయి!
ప్రపంచ చాంపియన్లకు షాకిచ్చి..
టీటీ మహిళల డబుల్స్‌లో భార త యువ ప్లేయర్లు సుతీర్థ ముఖర్జీ-ఐహిక ముఖ ర్జీ చరిత్ర సృష్టించారు. సంచలన ఆటతీరుతో ప్రపంచ చాంపియన్లకు షాకిచ్చి సెమీఫైనల్లో అడుగుపెట్టారు. తద్వారా కనీసం కాంస్య పతకం ఖారురు చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో సుతీర్థ-ఐహిక జంట 3-1 (11-5, 11-5, 5-11, 11-9)తో ప్రపంచ రెండో ర్యాంక్ చైనీస్ ద్వయం మెంగ్ చెన్-యిడి వాంగ్‌పై ఘనవిజయం సాధించింది. ఆసియా క్రీడల మహిళల డబుల్స్‌లో భారత్‌కు ఇంతవరకు ఒక్క పతకం కూడా దక్కకపోగా.. తాజా ప్రదర్శనతో సుతీర్థ-ఐహిక ఆ ఘనత అందుకోనున్నారు.
రోహన్ రఫ్ఫాట..
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే చందంగా.. భారత వెటరన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్నా.. హాంగ్జౌలో సింహనాదం చేశాడు. పురుషుల డబుల్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగి రిక్తహస్తాలతో వెనుదిరిగిన 43 ఏండ్ల రోహన్ బోపన్న.. మిక్స్డ్ డబుల్స్‌లో రుతుజా భోంస్లేతో కలిసి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో బోపన్న-రుతుజా జోడీ 2-6, 6-3, 10-4తో సంగ్ హ్యాంగ్-షో లియాంగ్ (చైనా) ద్వయంపై విజయం సాధించింది. తొలి సెట్లో పరాజయం ఎదురైనా.. ఏమాత్రం ైస్థెర్యం కోల్పోకుండా భారత ప్లేయర్లు పోరాట పటిమ చూపారు. ఇటీవల డేవిస్ కప్‌లో భారత జట్టు నుంచి వీడ్కోలు పలికిన బోపన్న.. తన సర్వీస్‌లతో ఆకట్టుకుంటే.. రుతుజా రిటర్న్ షాట్లతో ప్రత్యర్థులను కంగు తినిపించింది. తాజా క్రీడల్లో టెన్నిస్‌లో భారత్‌కు ఇది రెండో పతకం కాగా.. ఈ శతాబ్దంలో ఇదే అత్యల్పం. 2002 (బుసాన్) క్రీడల్లో భారత్‌కు టెన్నిస్‌లో 4 మెడల్స్ రాగా.. 2006 (దోహా)లో నాలుగు, 2010 (గాంగ్జూ)లో ఐదు, 2014 (ఇంచియాన్)లో ఐదు, 2018 (జకార్తా)లో మూడు పతకాలు దక్కాయి. ఆసియా క్రీడల్లో బోపన్నకు ఇది రెండో స్వర్ణం కాగా.. 27 ఏండ్ల రుతుజా తొలిసారి పసిడి ముద్దాడింది.
రజతం, కాంస్యం మనవే
అథ్లెటిక్స్ పోటీల్లో మనవాళ్లు సత్తాచాటారు. శుక్రవారం మహిళల షాట్‌పుట్‌లో కాంస్యం దక్కగా.. శనివారం 10 వేల మీటర్ల రేసులో భారత అథ్లెట్లు రెండు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. శనివారం జరిగిన 10 వేల మీటర్ల పరుగు పందెంలో కార్తీక్ కుమార్ 28 నిమిషాల 15.38 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలువగా.. గుల్వీర్ సింగ్ 28 నిమిషాల 17.21 సెకండ్లతో మూడో ప్లేస్‌తో కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు. కార్తీక్‌కు ఇదే కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన కాగా.. చివరి వంద మీటర్లలో మన అథ్లెట్లు జోరు పెంచి పతకాలు పట్టారు. ఈ విభాగంలో బహ్రెయిన్ అథ్లెట్ బిర్హాను (28ని.13.62సె.) స్వర్ణం చేజిక్కించుకున్నాడు.
హాంగ్జౌ: ‘ఇస్ బార్ సౌ పార్’ అనే లక్ష్యంతో 19వ ఆసియా క్రీడల బరిలోకి దిగిన భారత అథ్లెట్లు.. అంచనాలకు మించి రాణిస్తున్నారు. చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ ఏడో రోజు శనివారం భారత అథ్లెట్లు 5 పతకాలు ఖాతాలో వేసుకున్నారు. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్న-రుతుజా భోంస్లే జంట పసిడి పతకం పట్టగా.. స్కాష్ పురుషుల టీమ్ ఈవెంట్లో మనవాళ్లు స్వర్ణ సౌరభాలు విరజిమ్మారు. షూటింగ్లో సరబ్‌జ్యోత్ సింగ్-దివ్య జంట రజతం నెగ్గగా.. 10 వేల మీటర్ల పరుగులో కార్తీక్ కుమార్ వెండి, గుల్వీర్సింగ్ కాంస్య పతకాలు చేజిక్కించుకున్నారు.
దీంతో ఇప్పటి వరకు 38 మెడల్స్ (10 స్వర్ణాలు, 14 రజతాలు, 14 కాంస్యాలు) నెగ్గిన భారత్ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నది. బ్యాడ్మింటన్ పురుషుల జట్టు ఆసియా క్రీడల్లో తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లి కొత్త చరిత్ర లిఖించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 3-2తో దక్షిణ కొరియాను చిత్తుచేసింది. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, అర్జున్-ధ్రువ్ జోడీలు పరాజయం పాలైనా.. సింగిల్స్‌లో ప్రణయ్, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ దుమ్మురేపారు. ఇక అనధికారిక జాతీయ క్రీడ హాకీలో భారత్ విశ్వరూపం కనబర్చింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్‌తో శివతాండవమాడటంతో భారత్ 10-2తో జయభేరి మోగించి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. మహిళల 200 మీటర్ల హెప్టాథ్లాన్ బరిలో దిగిన తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని 24.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరి హీట్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
దాయాది చిత్తు చిత్తు..
వరుస గోల్స్‌తో విజృంభించిన భారత పురుషుల హాకీ జట్టు.. పాకిస్థాన్‌పై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. పూల్-‘ఎ’లో భాగంగా శనివారం జరిగిన పోరులో భారత్ 10-2తో పాక్‌ను పాతరేసి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ, 17వ, 33వ, 34వ నిమిషాల్లో) నాలుగు, వరుణ్ కుమార్ (41వ, 54వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా.. మన్దీప్ సింగ్ (8వ), సుమిత్ (30వ), శంషేర్ సింగ్ (46వ), లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (49వ) ఒక్కో గోల్ చేశారు. పాక్ తరఫున మహమ్మద్ ఖాన్ (38వ), అబ్దుల్ రాణా (45వ) చెరో గోల్ కొట్టారు. ఇరు జట్ల మధ్య ఇది 180వ మ్యాచ్ కాగా.. భారత్‌కు గోల్స్ పరంగా (8) పాకిస్థాన్‌పై ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. మ్యాచ్ ఆరంభం నుంచే భారత స్ట్రయికర్లు పాక్ గోల్‌పోస్ట్‌పై దండయాత్ర ప్రకటించారు.
అయ్యో మీరా!
భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు ఆసియా గేమ్స్‌లో నిరాశ ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం పట్టి తనపై అంచనాలను అమాంతం పెంచేసిన చాను.. మహిళల 49 కేజీల విభాగంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రాక్టీస్ సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో పూర్తి స్థాయిలో సత్తాచాటలేకపోయిన చాను 191 కేజీలు (83 + 108) ఎత్తి పతకానికి దూరమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తేందుకు రెండుసార్లు ప్రయత్నించి విఫలమైంది. మరోవైపు భారత బాక్సర్లకు శనివారం మూ డు పతకాలు ఖాయమయ్యాయి. ప్రీతి పవా ర్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకుంది.
షూటింగ్లో 19వ పతకం
చైనా వేదికగా మన షూటర్ల ప్రతాపం కొనసాగుతున్నది. ఇప్పటికే తాజా క్రీడల్లో భారత షూటర్లు 18 పతకాలు సాధించగా.. శనివారం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్‌జ్యోత్-దివ్య జోడీ రజత పతకం నెగ్గి ఆ సంఖ్యను 19కి పెంచింది. ఆసియా క్రీడల చరిత్రలో మన షూటర్లకు ఇదే అత్యధికం. ఫైనల్లో సరబ్‌జ్యోత్-దివ్య జంట 14-16తో ప్రపంచ చాంపియన్లు జాంగ్ బోవెన్-జియాంగ్ రెంగ్జిన్ ద్వయం చేతిలో పరాజయం పాలైంది. సరబ్‌జ్యోత్ ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం నెగ్గగా.. ఈ క్రీడల్లో అతడికిది రెండో మెడల్. ఇక హైదరాబాద్ స్టార్ షూటర్ కైనన్ చెనాయ్ పురుషుల వ్యక్తిగత ట్రాప్ ఈవెంట్లో ఫైనల్‌కు అర్హత సాధించాడు.
ఎనిమిదేండ్ల తర్వాత స్కాష్‌లో స్వర్ణం
సౌరవ్ ఘోషల్ నేతృత్వంలో బరిలోకి దిగిన భారత పురుషుల స్కాష్ జట్టు అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం కైవసం చేసుకుంది. సౌరవ్, మహేశ్, అభయ్‌సింగ్‌తో కూడిన భారత జట్టు శనివారం ఫైనల్లో 2-1తో దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసి అగ్రస్థానంలో నిలిచింది. తొలి పోరులో మహేశ్ 0-3 (8-11, 3-11, 2-11)తో ఇక్బాల్ నసీర్ చేతిలో పరాజయం పాలవగా.. రెండో మ్యాచ్‌లో సౌరవ్ 3-0 (11-5, 11-1, 11-3)తో మహమ్మద్ ఆసిమ్‌పై ఏకపక్ష విజయం నమోదు చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో పోరులో అభయ్ 3-2 (11-7, 9-11, 8-11, 11-9, 12-10)తో నూర్ జమాన్ పై గెలుపొందాడు. హోరాహోరీగా సాగిన మూడో మ్యాచ్‌లో అభయ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కీలక పాయింట్లు నెగ్గడంతో స్కాష్‌లో భారత్‌కు ఎనిమిదేండ్ల (2014 ఇంచియాన్) తర్వాత పసిడి దక్కింది.