INDA AUSA : పొట్టి సిరీస్‌లో భారత మహిళల ఏ జట్టు అద్భుతంగా పోరాడినా ఫలితం మాత్రం మారలేదు. రెండో టీ20లో 73కే ఆలౌటైన టీమిండియా నామమాత్రమైన మూడో పోరులో గట్టి పోటీ ఇచ్చినా మ్యాచ్ చేజార్చుకుంది. ఆస్ట్రేలియా ఏ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో ఓపెనర్ షఫాలీ వర్మ(41), మిన్ను మణి(30)లు అదరగొట్టినా మిగతా బ్యాటర్ల వైఫల్యంతో ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్ చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన గేమ్‌లో నాలుగు పరుగుల తేడాతో రాధా యాదవ్ బృందం ఓటమి పాలైంది. వరుసగా మూడో పరాజయంతో సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది.
ఆసీస్ పర్యటనలో భారత ఏ జట్టు తీవ్రంగా నిరాశ పరిచింది. పొట్టి సిరీస్‌లో ఒక్కటంటే ఒక్క మ్యాచూ గెలవలేదు. రెండో టీ20లో దారుణ ఓటమి నుంచి కోలుకున్న భారత ఏ జట్టు మూడో మ్యాచ్‌లో గట్టిగానే పోరాడింది. ఛేదనలో నాలుగు పరుగులకే ఓపెనర్ వ్రిందా దినేశ్(4) ఔటైనా షఫాలీ వర్మ(41) ధనాధన్ ఆడుతూ లక్ష్యాన్ని కరిగించింది. ఆమెకు రగ్వీ బిస్త్(25), మిన్ను మణి (30)లు సహకరించడంతో భారత జట్టు విజయం దిశగా సాగింది.
3-0 T20 Series Domination. 💪
Australia A beat India A by 4 Runs to continue their winning momentum in the T20 format. #CricketTwitter #AUSvIND pic.twitter.com/h9VpVgin4z
— Female Cricket (@imfemalecricket) August 10, 2025
అయితే.. సియన్నా జింజర్ (4-16) సంచలన బౌలింగ్‌తో మిడిలార్డర్ పని పట్టింది. ఆమె విజృంభణతో వచ్చిన వాళ్లు వచ్చినట్టే డగౌట్ చేరారు. ఆఖర్లో ప్రేమా రావత్ (12 నాటౌట్) బ్యాట్ ఝులిపించగా ఆశలు చిగురించాయి. ఆఖరి ఓవర్లో ఒక బౌండరీతో కలిపి 10 రన్స్ మాత్రమే వచ్చాయి. దాంతో, ఆసీస్ జట్టు నాలుగు పరుగుల తేడాతో గెలుపొంది క్లీన్‌స్వీప్ చేసింది. మొదట ఆడిన ఆడిన కంగారూ జట్టు సమిష్టి ప్రదర్శనతో 144 రన్స్ చేసింది. అలీసా హేలీ(27), మడెలినా పెన్నా (39), సియన్నా జింజర్(17 నాటౌట్)లు రాణించారు.